Abn logo
Sep 20 2021 @ 16:11PM

పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన కంగనా

ముంబై: రచయిత జావేద్ అఖ్తర్‌ వేసిన పరువునష్టం కేసులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోమవారంనాడు అంథేరి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరైంది. ఈసారి గైర్హాజరైతే అరెస్టు వారెంట్ జారీ చేస్తామంటూ కోర్టు హెచ్చరికల నేపథ్యంలో ఆమె విచారణ ముందుకు వచ్చారు. ఈ కేసును వేరే కోర్టుకు బదలీ చేయాల్సిందిగా కోరుతూ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్ దాఖలు చేసినట్టు కంగనా తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖి కోర్టుకు విన్నవించారు. అఖ్తార్‌కు వ్యతిరేకంగా కౌంటర్ కంప్లయింట్ ఫైల్ చేసామని, అఖ్తర్ చేసిన ఒరిజనల్ ఫిర్యాదు, తన క్లయింట్ దాఖలు చేసిన కౌంటర్ కంప్లయింట్ రెండింటినీ బదిలీ చేయాలని రిజ్వాన్ సిద్ధిఖి కోర్టును కోరారు. తన క్లయంట్‌పై చేసిన ఆరోపణలు విచారణకు అర్హం కావని, రాజీకి, బెయిలుకు అవకాశం ఉందని ఆయన వాదించారు. కోర్టుకు హాజరుకానందున అరెస్టు వారెంటు జారీ చేస్తామని పేర్కొనడం ద్వారా కోర్టు పరోక్షంగా హెచ్చరికలు చేసిందని అన్నారు. ఇలాంటి నేరాల విషయంలో ప్రతిసారి కోర్టు ముందు కంగనా హాజరుకావాల్సిన అవసరం ఉండదని అన్నారు.

అఖ్తర్ తరఫు న్యాయవాది భరద్వాజ్ తన వాదన వినిపిస్తూ, ప్రతిసారి కేసు జాప్యం కోసం ఏదో కొత్త వాదన తీసుకు వస్తున్నారని, చట్టం ప్రకారం విధివిధానాలను కోర్టు పాటించాలని కోరారు. కాగా, ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్లు పరిశీలించిన తర్వాతే ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని అంథేరి మెట్రోపాలిటన్ కోర్టు పేర్కంటూ, తదుపరి విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది. అక్టోబర్ 1న ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్‌పై చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు విచారణ జరుపుతారు.

ఇవి కూడా చదవండిImage Caption