May 4 2021 @ 16:21PM

తెల్లతోలు చూసుకుని ట్విట్టర్ మురిసిపోతోంది: కంగన

న్యూఢిల్లీ: ట్విట్టర్‌లో తన అధికారిక ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేయడం పట్ల బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ట్విట్టర్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘తెల్లతోలు ఉన్నవారు గోధుమ రంగు వారిని బానిసలుగా చూస్తారు’’ అంటూ ట్విట్టర్ యాజమాన్యంపై మాటల దాడి చేశారు. సస్పెన్షన్ తర్వాత మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘గోధుమ రంగు శరీరం ఉన్నవారిని తెల్లతోలు ఉన్నవారు బానిసలుగా చూస్తారు. ట్విట్టర్ అదే నిరూపించింది. ఎందుకంటే ట్విట్టర్ యాజమాన్యం అమెరికాకు చెందింది. మనమేం మాట్లాడాలో, ఏం ఆలోచించాలో వాళ్లే నిర్ణయించాలనుకుంటారు. ట్విట్టర్ పోతేనేమి..? నాకు వేరే సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. అందులో నా గొంతును వినిపిస్తాను. నేను నటిని. సినిమాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాను. ఈ దేశంలో కూడా కొంత మంది ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు వేధింపులు ఎదుర్కొంటున్నారు, బానిసలుగా చూడబడుతున్నారు. ఇప్పటికీ వారికి విముక్తి దొరకలేదు. వారికోసం మాట్లాడతాను’’ అని కంగనా రనౌత్ అన్నారు.


కంగనా రనౌత్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు ట్విటర్ ప్రకటించింది. ఆమె వరుసగా వివాదాస్పద ట్వీట్లు చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఆఫ్‌లైన్‌లో హింసకు దారి తీసే అవకాశం ఉన్న ప్రవర్తనపై చర్య తీసుకోవడంలో తాము స్పష్టంగా ఉన్నట్లు ట్విటర్ అధికార ప్రతినిధి వెల్లడించారు.