కాంగ్రెస్‌లో చేరిన కన్హయ్య, మెవానీ

ABN , First Publish Date - 2021-09-29T07:13:00+05:30 IST

జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో

కాంగ్రెస్‌లో చేరిన కన్హయ్య, మెవానీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంగళవారమిక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన, గుజరాత్‌కు చెందిన దళిత యువ నాయకుడు జిగ్నేశ్‌ మెవానీ ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. కన్హయ్య 2019 ఎన్నికల సమయంలో సీపీఐలో చేరి.. బిహార్‌లోని బెగూసరాయ్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. పార్లమెంటుపై దాడి సూత్రధారి అఫ్జల్‌ గురు వర్ధంతిని పురస్కరించుకుని 2016లో  జేఎన్‌యూలో జరిగిన కార్యక్రమంలో కన్హయ్య జాతి వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆయన సీపీఐకి దూరంగా ఉంటున్నారు.  



దళితులకు చేరువయ్యేందుకు..

గుజరాత్‌లోని వద్గామ్‌ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మెవానీ పేరున్న దళిత నాయకుడు.. న్యాయవాది, జర్నలిస్టు కూడా. వచ్చే ఏడాది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎస్సీ ఓటర్లను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్‌ ఆయన్ను పార్టీలోకి చేర్చుకుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా, సీపీఐతో కన్హయ్య నిజాయితీగా వ్యవహరించలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆక్షేపించారు. పార్టీ నుంచి ఏం కోరుకుంటున్నదీ ముక్కుసూటిగా చెప్పలేదని ఆక్షేపించారు. ఆయన పార్టీలోకి రాకముందే సీపీఐ ఉందని.. ఆయన వెళ్లిపోయినా ఉంటుందన్నారు. ఆయనకు వ్యక్తిగత, రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని, కమ్యూనిస్టు సిద్ధాంతాలపై విశ్వాసమే లేదని ధ్వజమెత్తారు.


కాగా.. పట్నాలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో తాను పెట్టిన ఏసీని కన్హయ్య తీసేశారు. తన సొంత ఖర్చుతో ఆయన పెట్టారని.. అందుకే తొలగించడానికి అనుమతి ఇచ్చామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్‌నరేశ్‌ పాండే చెప్పారు.

Updated Date - 2021-09-29T07:13:00+05:30 IST