కానుగల వాగు ఆక్రమణ

ABN , First Publish Date - 2021-05-07T05:52:03+05:30 IST

అక్రమ లే అవుట్ల కారణంగా ఓ గ్రామానికి వరద ముప్పు ఏర్పడింది.

కానుగల వాగు ఆక్రమణ
కానుగల వాగును ఆక్రమించిన రియల్టర్లు

  1. అక్రమంగా మట్టి తరలింపు
  2. బలపనూరుకు వరద ముప్పు 
  3. రియల్టర్ల ఆగడాలను పట్టించుకోని అధికారులు


పాణ్యం, మే 6: అక్రమ లే అవుట్ల కారణంగా ఓ గ్రామానికి వరద ముప్పు ఏర్పడింది. కొందరు రియల్టర్లు వాగులను ఆక్రమిస్తున్నారు. బలపనూరు జాతీయ రహదారి పక్కనే ఉన్న పొలాలకు కొందరు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. దీంతో పొలానికి పక్కనే ఉన్న కానుగల వాగు కుచించుకుపోయింది. వర్షాకాలంలో వాగు నీరు సమీపంలో ఉండే కొత్త కాలనీలోకి చేరే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ, పంచాయతీ అఽధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని అధికారులు అంటున్నారు. ఏటా వర్షాకాలంలో కానుగల వాగుకు పెద్దఎత్తున వరద నీరు చేరుతోంది. సమీప పంటలు ముంపునకు గురవుతున్నాయి. మట్టి తరలింపుతో ముంపు మరింత పెరిగే ప్రమా దం ఉందని రైతులు అంటున్నారు. 


తమ్మరాజుపల్లె నుంచి ప్రతి రోజూ వందలాది టిప్పర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయం తమ పరిధిలోకి రాదని రెవెన్యూ, పంచాయతీ అధికారులు అంటున్నారు. మైనింగ్‌ అధికారులు నామమాత్రంగా దాడులు నిర్వహిస్తున్నారని ప్రజలు అంటున్నారు. 


నిత్యం ప్రమాదాలు

టిప్పర్‌ ప్రమాదాలు పెరిగిపోయాయి. గత ఏడాది డిసెంబరు 2న నూలు మిల్లు వద్ద ఆవుల మందపైకి టిప్పర్‌ దూసుకుపోయింది. ఏడు ఆవులు మృత్యువాత పడ్డాయి. జనవరి 8న తమ్మరాజుపల్లె వద్ద మేకల మందపైకి టిప్పర్‌ దూసుకుపోయింది. 15 మేకలు చనిపోయాయి. అనుభవం లేనివారు, మైనర్లు టిప్పర్లను నడుపుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. లైసెన్స్‌ ఉన్న డ్రైవర్లకు ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతో అనుభవం లేని వ్యక్తులకు టిప్పర్లను అప్పజెప్పుతున్నారని తెలిసింది. అనుమతి లేని మైనింగ్‌ భూములలో మట్టిని తవ్వి, దళారుల ద్వారా అక్రమ లే అవుట్లకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కౌలూరులో అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్థులు అడ్డగించారు. పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోలేదని వారు అంటున్నారు.


మాకు సంబంధం లేదు..

మట్టి తరలింపు అంశం మాకు సంబంధంలేదు. ఓ రైతు తన భూమికి మట్టిని తరలించి ఎత్తు పెంచుకుంటున్నాడు. మట్టి అక్రమ తరలింపును మైనింగ్‌ అధికారులు అరికట్టాలి. వాగును ఆక్రమించారన్న అంశంపై విచారించాము. మండల సర్వేయరు కొలతలు వేశాకే మట్టి తరలించారు. అక్రమ లే అవుట్లపై పంచాయతీ అధికారులు చర్య తీసుకోవాల్సి ఉంటుంది. వాగు ఆక్రమణపై ఫిర్యాదు అందలేదు.          - శంకర్‌, వీఆర్వో, బలపనూరు

Updated Date - 2021-05-07T05:52:03+05:30 IST