విరాట్ కోహ్లీ నోట అలాంటి మాటా?: తప్పుబట్టిన కపిల్‌దేవ్

ABN , First Publish Date - 2021-11-02T02:28:36+05:30 IST

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం కోహ్లీ చేసిన ‘పిరికితనం’ వ్యాఖ్యలను టీమిండియా మాజీ సారథి

విరాట్ కోహ్లీ నోట అలాంటి మాటా?: తప్పుబట్టిన కపిల్‌దేవ్

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం కోహ్లీ చేసిన ‘పిరికితనం’ వ్యాఖ్యలను టీమిండియా మాజీ సారథి కపిల్‌దేవ్ తప్పుబట్టాడు. కోహ్లీ మరీ ఇంత బేలగా మాట్లాడతాడని తాను అనుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లీ లాంటి ఆటగాడి నోటి వెంట ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఎంతమాత్రమూ సరికాదన్నాడు. మైదానంలో కోహ్లీ ఎంత కసిగా ఉంటాడో అందరికీ తెలుసని, మ్యాచ్ గెలవాలన్న పట్టుదల అతడిలో ఉంటుందని పేర్కొన్నాడు.


అలాంటి కోహ్లీ ఇంత పిరికిగా మాట్లాడడం అతడి స్థాయికి ఏమాత్రం సరిపోదని కపిల్ విమర్శించాడు. డ్రెస్సింగ్ రూములో ఆటగాళ్ల దృక్పథాన్ని ఒక్కసారిగా మార్చడం చాలా కష్టమైన పని అని అభిప్రాయపడిన కపిల్.. ఇలాంటి సమయాల్లో జట్టులో స్ఫూర్తినింపేందుకు కోచ్ రవిశాస్త్రి, మెంటార్ ధోనీ తమ అనుభవాన్ని ఉపయోగించాలని సూచించాడు. జట్టు వరుసగా ఓటమి పాలవుతున్నప్పుడు విమర్శలు తప్పవని, వాటిని ఎదుర్కొనేందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలని కపిల్ పేర్కొన్నాడు.


న్యూజిలాండ్‌తో ఓటమి అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో తమను పిరికితనం ఆవహించిందన్నాడు. ధైర్యంగా బ్యాట్ ఝళిపించేందుకు, దూకుడుగా బంతులు విసిరేందుకు వెనకంజ వేశామని పేర్కొన్న కోహ్లీ.. మొత్తంగా ఈ మ్యాచ్‌లో తాము ఆత్మవిశ్వాసంతో ఆడలేదన్న విషయాన్ని చెప్పగలనని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపైనే కపిల్ పై విధంగా స్పందించాడు.

Updated Date - 2021-11-02T02:28:36+05:30 IST