నా శవం కూడా బీజేపీలో చేరదు: కపిల్ సిబాల్

ABN , First Publish Date - 2021-06-10T20:56:07+05:30 IST

రాహుల్ అత్యంత సన్నిహితుడు జ్యోతిరాదిత్య సిందియా కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తాజాగా జితిన్ ప్రసాద చేరికతో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున లుకలుకలు ప్రారంభమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి

నా శవం కూడా బీజేపీలో చేరదు: కపిల్ సిబాల్

న్యూఢిల్లీ: తనే కాదు తన శవం కూడా భారతీయ జనతా పార్టీలో చేరదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్ అన్నారు. కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జితిన్ ప్రసాద.. భారతీయ జనతా పార్టీలో చేరడంపై ఆయన స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను పుట్టిపెరిగినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్న ఆ భావజాలపు రాజకీయ పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లనని ఆయన తేల్చి చెప్పారు.


రాహుల్ అత్యంత సన్నిహితుడు జ్యోతిరాదిత్య సిందియా కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తాజాగా జితిన్ ప్రసాద చేరికతో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున లుకలుకలు ప్రారంభమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సిందియా తర్వాత జితిన్ చేరిక కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ఎదురుదెబ్బ. పైగా దేశంలోనే అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని మరింత కలవరపెడుతోంది.


జితిన్ ప్రస్తావన సిబాల్ వద్దకు తీసుకురాగా ‘‘పార్టీ నాయకత్వం ఏం చేసిందనేదానిపై నేను ఏ విధంగానూ స్పందించను. అయితే రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. భావజాలపరమైన రాజకీయాలు పోయాయి. ఇప్పుడు ‘ప్రసాద రాం రాజకీయాల’ దశ కొనసాగుతోంది. గతంలోని ఆయారాం గయారాం రాజకీయాలకు ఇది కొనసాగింపు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో పూర్తిగా వ్యక్తిగత ప్రయోజనాల ప్రాతిపదిక కనిపిస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఇదే జరిగింది. పార్టీ నుంచి జితిన్ వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. ఇక్కడ నాకు అభ్యంతరం లేదు. అతడు పార్టీ నుంచి వెళ్లిపోవడాన్ని నేను తప్పు పట్టను. అయితే దశాబ్దాలుగా వ్యతిరేకిస్తున్న ఒక రకమైన రాజకీయాలవైపుకు వెళ్లడాన్ని నేను తప్పు పడుతున్నాను’’ అని సిబాల్ అన్నారు.

Updated Date - 2021-06-10T20:56:07+05:30 IST