కాపులకు వైసీపీ ద్రోహం

ABN , First Publish Date - 2021-12-07T06:17:36+05:30 IST

జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం కాపులకు తీరని ద్రోహం చేసిందని కాపు ఉద్యమనేత మంచాల సాయిసుధాకర్‌నాయుడు తెలిపారు.

కాపులకు వైసీపీ ద్రోహం
సమావేశంలో మాట్లాడుతున్న సాయిసుధాకర్‌నాయుడు

టీడీపీ హయాంలోనే అంతోఇంతో లబ్ధి

కాపు ఉద్యమనేత సాయిసుధాకర్‌నాయుడు

మంగళగిరి, డిసెంబరు 6: జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం కాపులకు తీరని ద్రోహం చేసిందని కాపు ఉద్యమనేత మంచాల సాయిసుధాకర్‌నాయుడు తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌ ఐబీఎన్‌ భవన్‌లో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజం చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కాపులకు న్యాయం, అంతో ఇంతో లబ్ధి జరిగిందన్నారు. వైసీపి ప్రభుత్వంపై మండిపడ్డారు. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌,  వారిని అన్ని విధాలుగా దెబ్బతీయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో కాపు విద్యార్థుల విదేశీ విద్య కోసం ఏటా రూ.1500 కోట్ల నిధులను ఖర్చు చేయగా వైసీపీ దానికి కత్తెర వేసిందన్నారు. దీంతో విదేశాలలో చదువుకుంటున్న సుమారు 1100 మంది విద్యార్థుల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయన్నారు. కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశాల్లేకుండా చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించగా జగన్‌ వచ్చీరావడంతోనే రద్దుచేసి కాపులపట్ల తనకున్న ద్వేషాన్ని బహిరంగంగానే చాటుకున్నారని మండిపడ్డారు. కాపు ఉద్యోగులకు ప్రధాన పోస్టులు దక్కనివ్వకుండా అణగదొక్కుతున్నారన్నారు. పవన్‌కళ్యాణ్‌పై అధికారపార్టీ విమర్శలను ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులను బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. కాపులకు ఇంతపెద్దఎత్తున అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వంలో ఉన్న కాపు నాయకులు పదవులను కాపాడుకునే వెర్రిలో ఉన్నారన్నారు. వైసీపీ హయాంలో కాపులపై దాడులు కూడా పెరిగాయన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను చేపట్టేందుకు తాము సిద్ధపడుతున్నట్టు సుధాకర్‌ నాయుడు హెచ్చరించారు. సమావేశంలో ఏపీసీసీ కాపు రిజర్వేషన్‌ సాధికారిక విభాగ చైర్మన్‌ పిళ్లా వెంకటేశ్వరరావు, కాపు నేతలు రామారావు, తాటి కృష్ణారావు, పవన్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-07T06:17:36+05:30 IST