Abn logo
Jul 23 2021 @ 02:42AM

నేస్తం కాదు.. మోసం

‘కాపు నేస్తం’కింద రెండేళ్లలో ఇచ్చింది 981 కోట్లు!

కానీ.. రూ.12వేల కోట్ల లబ్ధి పేరిట మాయ

అందరికీ లభించే వాటిలోనూ ‘కాపు కోటా’

రైతు భరోసా, పెన్షన్లూ కాపు సంక్షేమ ఖాతాలోనే

పంటల బీమా, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ కూడా

చివరికి బడిపిల్లల బ్యాగులకూ కులం లెక్కలు

అందరికీ ఇచ్చేవాటికే ‘ప్రత్యేక’ కలరింగ్‌

గత ప్రభుత్వ సహాయంపైనా వక్రీకరణ

నాడు సగటున ఏడాదికి 700 కోట్ల సాయం

అచ్చంగా కాపుల కోసమే ప్రత్యేక పథకాలు

విద్య, స్వయం ఉపాధికీ నాడు ప్రాధాన్యం

నేడు అన్నింటికీ స్వస్తి పలికిన ప్రభుత్వం 


రెండేళ్లలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు ‘జగనన్న సర్కారు’ రూ.12,126 కోట్ల సహాయం అందించిందట! ఇందులో నేరుగా... వారి ఖాతాల్లో పడిన మొత్తం 9359 కోట్లు! ఇది నిజమేనా? ఆయా పథకాలు అందరికీ వర్తించేవా? లేక... అచ్చంగా కాపులకు మాత్రమే వర్తించేవా? కానే కాదు! రాష్ట్రంలోని అన్ని వర్గాలకు వర్తించే పథకాల్లోంచి... కాపు లబ్ధిదారులను వేరు చేసింది. లెక్కలు... గొప్పగా చూపింది.

కాపుల సంక్షేమానికి ఏటా రూ.2 వేల కోట్లు ఇస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ... అంతకుమించి ప్రతి ఏటా 6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతోంది. చెప్పినదాని కంటే రూ.4 వేల కోట్లు అదనంగా ఇవ్వడం ఎలా సాధ్యమైంది? అని ఆరా తీస్తే... ఆ పథకాలు కాపుల కోసం మాత్రమే కాదని, అందరికీ అని అర్థమవుతోంది!

‘విద్యా దీవెన’ పథకంలో భాగంగా బడి పిల్లలకు బ్యాగులు, బూట్లు, పుస్తకాలు ఇస్తారు. చివరికి... బడి పిల్లల్లోనూ కాపులను విడదీసి, వారికి ఇచ్చిన ‘సహాయాన్ని’ ప్రత్యేకంగా చూపించడం గమనార్హం.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇది సంక్షేమ మాయల సర్కార్‌! లెక్కలతో గోల్‌మాల్‌ చేసి... ‘ఔరా’ అని అబ్బురపరిచే సర్కార్‌! ‘వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం’ అంటూ గురువారం ప్రభుత్వం రంగురంగుల ప్రకటనల్లో పేర్కొన్న గణాంకాల్లో అనేక మాయలు కనిపించాయి. ఇదే ప్రకటన ప్రకారం... ‘కాపు నేస్తం’ పథకం కింద గత ఏడాది రూ.491.02 కోట్లు ఇవ్వగా... ఈ ఏడాది రూ.490.86 కోట్లు ఇస్తున్నారు. అంటే... రెండేళ్లలో అచ్చంగా కాపులకు జరిగిన లబ్ధి 981.88 కోట్లు. కానీ... సర్కారు వారు ఏకంగా రూ.12,126 కోట్లను కాపులకు ఇచ్చేసినట్లు లెక్కలు చూపించారు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏ రూపంలో, ఎలాంటి లబ్ధి కలిగినా... దానిని కూడా కాపులకు ప్రత్యేకంగా చేసినట్లుగా మాయ చేశారు. కులమతాలతో సంబంధం లేకుండా.. దశాబ్దాలుగా అమలవుతున్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు కూడా సొంత డబ్బా నుంచి తప్పించుకోలేకపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా కాపుల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతమంది ఉన్నారో లెక్కగట్టి వారికిచ్చే పెన్షన్‌ నగదును కాపు సంక్షేమంలో కలిపేశారు. రైతులందరికీ ఇచ్చే రైతు భరోసా, పంటల బీమా, తల్లులకు ఇచ్చే అమ్మఒడి, వాహనమిత్ర.. చివరకు ఆరోగ్యశ్రీ కూడా వచ్చి కలిశాయి. ఇందులో చాలా పథకాలు ఈనాటివి కావు. కానీ గత ప్రభుత్వాలేవీ వాటిని కులాలవారీగా వర్గీకరించి ఆయా కులాలకు చేస్తున్న సంక్షేమంగా చెప్పుకోలేదు. కానీ జగన్‌ సర్వ పథకాలను ఒకేగాటిన కట్టి అందులో ఏ చిన్న లబ్ధి కాపు కుటుంబానికి చేకూరినా అది కాపు సంక్షేమం ఖాతాలో వేసింది. ఇలా మొత్తం కలిపి చూపించి.. హామీ కంటే రెండు రెట్లు అదనంగా కాపులకు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది.


గత ప్రభుత్వంలోనే కాపు కార్పొరేషన్‌

వాస్తవానికి గత తెలుగుదేశం ప్రభుత్వానికి ముందు కాపుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ లేదు. అప్పట్లో ఏటా వెయ్యి కోట్లు ఇస్తామనే హామీతో టీడీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి... ఏటా సగటున రూ.700 కోట్ల వరకూ ఖర్చుచేసింది. ఇది అచ్చంగా కాపులకు మాత్రమే జరిగిన లబ్ధి. చివరికి... ఈ సహాయాన్ని కూడా జగన్‌ సర్కారు తన ప్రకటనలో వక్రీకరించి చూపించింది. ‘‘గత ప్రభుత్వం కాపు, బలిజ, తెలగ, ఒంటరి మహిళలకు వివిధ రూపాల్లో ఇచ్చింది సగటున ఏడాదికి రూ.400 కోట్లు మాత్రమే’’ అంటూ మాయ చేసింది. నిజానికి... వివిధ రూపాల్లో అందరికీ ఇస్తున్న పథకాలనూ, అచ్చంగా కాపులకే ఇస్తున్నట్లుగా చూపించింది జగన్‌ ప్రభుత్వమే! ఈ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకం ప్రధానంగా ఉండేది. ఏటా దాదాపు రూ.400 కోట్లు స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకునే పేద కాపులకు ఇచ్చేవారు. అలాగే విదేశీ విద్య, విద్యోన్నతి, ఇతర పథకాలు అమలు చేసింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలన్నిటికీ మంగళం పాడేసి కేవలం కాపునేస్తం అనే ఒక్క పథకాన్నే మిగిల్చింది. 45-60 మధ్య వయసున్న పేద కాపు మహిళలకు రూ.15 వేలు ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం. ఇందుకోసం ఈ రెండేళ్లలో ఏటా రూ.490 కోట్లు ఖర్చుచేసింది. ఇది తప్ప కాపులకు ప్రత్యేకంగా ఇచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటీ విడిగా లేదు. ‘కాపునేస్తం’ తప్ప ‘కాపు’ అనే పేరు వచ్చే పథకం ఒక్కటీ లేదంటే ఆ సంక్షేమం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు.


ఆశలు ఆవిరి..

టీడీపీ హయాంలో తమ సంక్షేమానికి ఏటా రూ.700 కోట్లే ఖర్చు చేసిందని.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.2వేల కోట్లు వస్తామని ఆశించిన కాపులకు ఆశాభంగమే ఎదురైంది. స్వయం ఉపాధి పథకం అమలుచేస్తే శాశ్వ త ప్రాతిపదికన ఉపాధి యూనిట్లు ఏర్పాటుచేసుకోవచ్చని భావించారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ పథకమే లేకుండా చేసింది. రెండేళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా స్వయంఉపాధి కింద రాయి తీ పొందలేదు. స్వయంఉపాధి కింద రూ.30 వేల నుంచి రూ.లక్ష రాయితీ ఇవ్వాలి. సగటున ఒక్కో లబ్ధిదారునికి రూ.50 వేలు అయినా ఇవ్వాల్సి వస్తుంది. కానీ దానిని ఎత్తివేసి కాపునేస్తాన్ని ఈ ప్రభుత్వం తెచ్చింది. స్వయంఉపాధిలో ఒక్కరికే ఇచ్చే రాయితీని విభజించి నలుగురైదుగురు మహిళలకు ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తుండడం గమనార్హం. స్వయంఉపాధిలో రాయితీ ఇస్తే ఒక్కరికైనా శాశ్వతంగా ఉపాధి దొరుకుతుంది. కానీ కాపునేస్తం కింద ఎక్కువ మందికి రూ.15 వేలు ఇచ్చినా అవి స్వీయ ఉపాధికి ఎందుకూ ఉపయోగపడడం లేదు.


ఇవి కాపులకు మాత్రమేనా?

గత రెండేళ్లలో కాపుల కోసం రూ.12,126 కోట్లు ఖర్చుచేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో వైఎస్సార్‌ రైతుభరోసా-2,550 కోట్లు, పెన్షన్‌ కానుక-2,384 కోట్లు, అమ్మఒడి-1,143 కోట్లు, కాపునేస్తం-981 కోట్లు, ఆసరా-653 కోట్లు, విద్యాదీవెన-354 కోట్లు, వసతి దీవెన-189 కోట్లు, విదేశీవిద్యా దీవెన- 29 కోట్లు, విద్యాకానుక-50 కోట్లు, ఉచిత పంటల బీమా-371 కోట్లు, ఇన్‌పుట్‌ సబ్సిడీ-131 కోట్లు, పంట రుణాలకు సున్నా వడ్డీ-101 కోట్లు, వాహనమిత్ర-83 కోట్లు, వైఎ్‌సఆర్‌ బీమా-132 కోట్లు, సున్నావడ్డీ (ఎస్‌హెచ్‌జీ)-202 కోట్లు, ఆరోగ్య ఆసరా-22 కోట్లు, జగనన్న చేదోడు(టైలర్లు)-14 కోట్లు, నేతన్న నేస్తం-12 కోట్లు, ఇళ్ల పట్టాలు-2,160 కోట్లు, ఆరోగ్యశ్రీ-289 కోట్లు, సంపూర్ణ పోషణ-144 కోట్లు, గోరుముద్ద-రూ.123 కోట్లు... వెరసి మొత్తం ఇంత అయిందని ప్రకటించింది. ఇందులో కాపునేస్తం తప్ప కాపులకు ప్రత్యేక పథకం ఒక్కటీ లేదు. గత ప్రభుత్వాలు కూడా ఈ పథకాలన్నిటినీ కలిపి ఆయా కులాల సంక్షేమంగా చూపించి ఉంటే దాదాపుగా ఈ లెక్కలే కనిపించేవి. కానీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సహా ఎవరూ ఇలాంటి లెక్కలు వేసి భారీగా ఖర్చుచేశామని చెప్పుకొనే ప్రయత్నం చేయలేదు.


అందరితో పాటే వారికీ..

రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ప్రజలు సుమారు 15 శాతం అంటే 75 లక్షల మంది ఉన్నారని అంచనా. అందులో కాపునేస్తం అందుతోంది కేవలం 3.27 లక్షల మంది మహిళలకే. వారికిచ్చే మొత్తం రూ.490 కోట్లను మొత్తం జనాభాతో సరాసరిన లెక్కగడితే కాపుల్లో ఒక్కొక్కరికీ ఏడాదిలో కలిగే లబ్ధి అక్షరాలా 653 రూపాయలు. కానీ రూ.6,060 ఖర్చుచేస్తున్నట్లు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. అవన్నీ అందరితోపాటు కాపులకూ వస్తున్నాయి తప్ప వారికంటూ అదనంగా ఒక్క రూపాయి అందడం లేదు.


ఇంటి స్థలం విలువ 84 వేలే

ఇక ఇళ్ల స్థలాల్లోనూ ప్రభుత్వం మాయ చేసిందనే విషయం తాజా లెక్కలతో తేటతెల్లమైంది. ఇటీవల పేదలందరికీ ఇచ్చిన ఈ స్థలాలకు కూడా విలువ గట్టి ఆ మొ త్తాన్ని కూడా కాపు సంక్షేమం ఖాతాలో వేసింది. 2,56,424 మంది కాపు కుటుంబాలకు ఇళ్ల స్థలాలిచ్చామని, అందుకోసం రూ.2,160 కోట్లు వెచ్చించామని వెల్లడించింది. అంటే సగటున ఒక్కో కుటుంబానికి ఇచ్చిన స్థలం విలువ రూ.8 4,235 మాత్రమే. ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో కుటుంబానికి ఇంటి కోసం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరుస్తామని వైసీపీ పేర్కొంది. అధికారంలోకి వచ్చాక అది స్థలం కూడా కలిపి అని మాట మార్చింది. ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు రాయితీ ఇస్తున్నారు. రాయితీ, ఇంటి స్థలం విలువ కలిపితే ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తం రూ.2.6 లక్షలే. ఈ రూ.84 వేల విలువైన స్థలంపైనే రూ.50 వేల రుణం ఇప్పిస్తామని ఇప్పుడు ప్రభుత్వం చెబుతోంది. అంత తక్కువ విలువ కలిగిన భూమికి రూ.50 వేల రుణం ఎవరిస్తారో చూడాలి.