కట్ట.. కరిగిపోతోంది

ABN , First Publish Date - 2021-10-24T04:51:03+05:30 IST

నల్లమడ కట్ట కరిగిపోతోంది. అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇదే అలుసుగా ఇష్టం వచ్చినట్లుగా కట్టను తవ్వి ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

కట్ట.. కరిగిపోతోంది
కొండుభొట్లపాలెం గ్రామంలో నల్లమడ కట్టను పరిశీలిస్తున్న బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కాగిత కోటేశ్వరరావు, సీపీఐ ఏరియా కార్యదర్శి జెబి.శ్రీధర్‌

ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నారు

ఎట్టకేలకు రూరల్‌ పోలీసుల విచారణ


బాపట్ల, అక్టోబరు 23: నల్లమడ కట్ట కరిగిపోతోంది. అక్రమార్కులు ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇదే అలుసుగా ఇష్టం వచ్చినట్లుగా కట్టను తవ్వి ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తవ్వకాలతో కట్ట బలహీనపడి వరద వస్తే ముంపు సంభవించే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. కొండుభొట్లపాలెం జడ్పీ హైస్కూల్‌ ప్రహరీని తొలగించి దారి వేసుకుని మరీ నల్లమడ కట్టను తవ్వి ఇసుకను తరలిస్తుండటంతో ఆ ప్రాంత ప్రజల ఫిర్యాదులు చేశారు. ఇంతజరుగుతున్నా ఇరిగేషన్‌ అధికారులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుకే పరిమితమయ్యారు. అయితే పోలీసులు మొక్కుబడి విచారణకే పరిమితమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. రాత్రుళ్లు కట్టను తవ్వి ఇసుకను తరలిస్తున్నారు. దీంతో బీఎస్పీ, సీపీఐ నాయకులు శనివారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో రూరల్‌ ఎస్‌ఐ ప్రసాద్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించి తవ్వకాలపై గ్రామ కార్యదర్శి పల్నాటి శ్రీరాములు, వీఆర్వో ప్రసాద్‌, మహిళా పోలీసు నళినీ, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ తిరుమల కుమార్‌లను విచారించారు. ఇసుక తవ్విన వ్యక్తి పేరు చెప్పేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఇసుక ఎక్కడ మెరక చేసేరనే విషయంపై విచారించారు. అధికారపార్టీ అండతోనే ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ఆ పార్టీకి చెందిన వారే విమర్శలు చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై వివరణ కోరగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డ్రెయినేజి ఏఈ భరద్వాజ తెలిపారు.


ప్రజల పాలిట శాపం 

కొండుభొట్లపాలెం గ్రామంలో ఇసుక వ్యాపారి ఒకరు నల్లమడ కట్టను కూడా వదలకుండా తవ్వి సొమ్ము చేసుకుంటున్నాడని, అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల పాలిట శాపంలా మారుతుందని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాగిత కోటేశ్వరరావు, సీపీఐ ఏరియా కార్యదర్శి జేబీ శ్రీధర్‌ తెలిపారు.  హైస్కూల్‌ ప్రహరి ఓవైపు వరద నీటి తాకిడికి పడిపోయిందని, మరోవైపు ఏవిధంగా దెబ్బతింతో తెలియదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్‌ వారికి తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కొచ్చర వినయ్‌రాజు, బడుగు ప్రభాకర్‌, గుదే రాజారావు, కుమార్‌, దగ్గుమల్లి శ్రీకర్‌ బాబు, బోయన సాంబశివరావు, చీరాల మండల మహిళా విభాగం అధ్యక్షులు ఏపూరి కుమారి, మిండా ఝాన్సీ, చిరంజీవి, పనసాల వెంకటేశ్వరరావు, మాణిక్యారావు, సీపీఐ నాయకులు బక్కా వెంకట రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.  

 

Updated Date - 2021-10-24T04:51:03+05:30 IST