స్వచ్ఛతలో కరీంనగర్‌ జిల్లా భేష్‌

ABN , First Publish Date - 2020-12-03T05:37:58+05:30 IST

జూమ్‌/వెబ్‌నార్‌ ద్వారా జరిగిన ఎన్‌ఐఆర్‌డీ 7వ వాష్‌ సమ్మేళనంలో రాష్ట్రం నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు, కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక పాల్గొని తమ జిల్లాల్లో స్వచ్ఛత-సుస్థిరతపై జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు.

స్వచ్ఛతలో కరీంనగర్‌ జిల్లా భేష్‌
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ కె శశాంక

అభినందించిన యూనిసెఫ్‌ 

పల్లె ప్రగతి-నూతన పంచాయతీరాజ్‌ చట్టం మార్గదర్శకం

కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జూమ్‌/వెబ్‌నార్‌ ద్వారా జరిగిన ఎన్‌ఐఆర్‌డీ 7వ వాష్‌ సమ్మేళనంలో రాష్ట్రం నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు, కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక పాల్గొని తమ జిల్లాల్లో స్వచ్ఛత-సుస్థిరతపై జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు. కలెక్టర్‌ చాంబర్‌లో ఈ నెల 5న జరగనున్న యూఎన్‌ వలంటీర్‌ దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాను ఆగస్టు 15, 2017న బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించుకున్న నాటి నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం, పటిష్ఠమైన ప్రణాళికా, గ్రామ పంచాయతీ, మండల, జిల్లా అధికారుల చొరవతో కరీంనగర్‌ స్వచ్ఛతలో ఒక అడుగు ముందుంటోందని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ఓడీఎఫ్‌ ప్లస్‌ అనగా చెత్త సక్రమ నిర్వహణ, మురికి నీటి నిర్వహణ(విద్య, వైద్య, అంగన్‌వాడీ) సంస్థల్లో సక్రమ మరుగుదొడ్ల నిర్వహణ, సామాజిక మరుగుదొడ్ల ఏర్పాటు, నిర్వహణ విషయాలపై దృష్టిసారిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాకు 2016నుంచి అన్ని రకాలుగా యూనిసెఫ్‌ సహకరిస్తోందని అన్నారు. దీనివల్ల గ్రామాల్లో స్వచ్ఛత పట్ల అవగాహన కార్యక్రమాల నిర్వహణతో స్వచ్ఛత-సుస్థిరత మెరుగుపర్చుటకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ అంకిత్‌, ఎస్‌బీఎం-యూనిసెఫ్‌ ప్రతినిధులు కిషన్‌స్వామి, రమేశ్‌, వేణు, వెంకటేశ్‌, వలంటీర్లు, సత్తినేని శ్రీనివాస్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T05:37:58+05:30 IST