కరీంనగర్: బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు?

ABN , First Publish Date - 2022-01-03T16:37:08+05:30 IST

బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్దమైనట్లు సమాచారం.

కరీంనగర్: బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు?

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్దమైనట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం బండి సంజయ్‌ను రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. దీంతో విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలి వస్తున్నారు. ఇప్పటికే కూన శ్రీశైలం గౌడ్, తుల ఉమ సహా పలువురు బీజేపీ నేతలు పీటీసీకి చేరుకున్నారు.


ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 317ను సవరించాలనే డిమాండ్‌తో బండి సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరెంటు సరఫరాను నిలిపివేసి, కిటికీల నుంచి ఫైరింజన్‌తో నీళ్లు చల్లి, ఎంపీ కార్యాలయ ద్వారాన్ని బద్దలు కొట్టి సంజయ్‌ని అరెస్టు చేశారు. దీంతో కరీంనగర్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జ్యోతినగర్‌లోని ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి జాగరణ దీక్ష కోసం బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం నుంచే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్టు చేశారు. 

Updated Date - 2022-01-03T16:37:08+05:30 IST