వలస కార్మికులతో కరీంనగర్‌ చేరిన శ్రామిక్‌ రైలు

ABN , First Publish Date - 2020-05-31T10:55:07+05:30 IST

ముంబాయి నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులతో శ్రామిక్‌ స్పెషల్‌ రైలు

వలస కార్మికులతో కరీంనగర్‌ చేరిన శ్రామిక్‌ రైలు

కరీంనగర్‌ చేరిన 46మంది

నగరానికి చెందిన వారు 11మంది

వైద్యసిబ్బంది పరీక్షలు

పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణ


కరీంనగర్‌ రూరల్‌/సుభాష్‌నగర్‌, మే 30: ముంబాయి నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులతో శ్రామిక్‌ స్పెషల్‌ రైలు శనివారం సాయంత్రం కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ చేరుకుంది. ఈ రైలు 46మంది ప్రయాణికులతో కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ చేరుకుంది. 46మందిలో 41మంది పెద్దలు కాగా, ఐదుగురు పిల్లలున్నారు. వీరిలో 11మంది నగరానికి చెందిన వారు ఉన్నారు. శ్రామిక్‌ రైలులో వచ్చిన ప్రయాణికులందరికీ వైద్యబృందాలు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. వారికి హోం క్వారంటైన్‌ స్టాంపులు వేసి పలు జాగ్రత్తలు, సూచనలను చేశారు.  స్ర్కీనింగ్‌ పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపించక పోవడంతో వారి స్వస్థలాలకు ప్రత్యేకబస్సుల్లో పంపించారు. వచ్చిన ప్రయాణికులందరికీ మంచినీటి ప్యాకెట్లతో పాటు, భోజనాల ప్యాకెట్లను అధికారులు అందించారు.


అధికారుల పర్యవేక్షణలో స్టేషన్‌..

శ్రామిక్‌ స్పెషల్‌ రైలు వస్తున్నందున ఉదయం నుంచే అధికారులు కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌లో పర్యవేక్షించారు. ప్రత్యేక వైద్యసిబ్బందితో పాటు, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది స్టేషన్‌లో ఉదయం నుంచే ఏర్పాట్లలో మునిగి తేలారు. ముంబాయిలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు బయలు దేరిన శ్రామిక్‌ రైలు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాలో ప్రయాణికులను దింపుతూ శనివారం సాయంత్రం వరకు కరీంనగర్‌ చేరుకుంది. ఉదయం 8.45 నిమిషాలకు కరీంనగర్‌ చేరాల్సిన రైలు సాయంత్రం 5.51నిమిషాలకు ఆలస్యంగా చేరుకుంది.


Updated Date - 2020-05-31T10:55:07+05:30 IST