కర్మానుబంధీని మనుష్యలోకే

ABN , First Publish Date - 2020-05-28T08:26:21+05:30 IST

అని గీతా వాక్యం. ‘‘చిత్తశుద్ధికి కారణమైన సత్కర్మానుష్ఠానమును చేసి సకల పాపములను నశింపజేసుకొన్న మహానుభావులు, రాగద్వేషముల వలన కలిగిన అవివేకం చేత విడువబడిన వారు...

కర్మానుబంధీని మనుష్యలోకే

  • యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్‌
  • తే ద్వన్ద్వ మోహ నిర్ముక్తా భజన్తే మాం ధృఢవ్రతాః


అని గీతా వాక్యం. ‘‘చిత్తశుద్ధికి కారణమైన సత్కర్మానుష్ఠానమును చేసి సకల పాపములను నశింపజేసుకొన్న మహానుభావులు, రాగద్వేషముల వలన కలిగిన అవివేకం చేత విడువబడిన వారు, నిశ్చయమైన నియమము గలవారై నన్ను పొందుచున్నారు’’ అని దీని అర్థం. సమస్త ప్రాణులూ తమ తమ ప్రకృతులను..  అనగా స్వభావాన్ని అనుసరించి కర్మలు చేస్తాయి. ఆ కర్మలను సత్కర్మలుగా తీర్చిదిద్దేందుకే జీవితం సాగించాలని భగవానుడి బోధ. ‘‘కర్మానుబంధీని మనుష్యలోకే’’ అన్న శాస్త్రవచనం ప్రకారం సకల ప్రాణులూ  కర్మలను ఆచరించక తప్పదు. సుఖదుఃఖాలకు కారణం కర్మలు కనుక ఈ ప్రపంచమంతా సుఖ, దుఃఖ దశలనే ఉయ్యాలపై ఎక్కి ఉన్నది. రాగద్వేషాదులనే ఊపుల చేత ఊరేగింపబడుతోంది. జనులు గుణాలకు వశులై కర్మలు చేస్తున్నారు. సత్వగుణం వల్ల సాత్విక కర్మను, రజోగుణం వల్ల రాజకర్మను, తమో గుణం వల్ల తామస కర్మను చేస్తూనే ఉంటారు. కానీ.. పరమేశ్వరుని ప్రీత్యర్థం చేసిన కర్మతో జ్ఞాన నిష్ఠకు యోగ్యులవుతారు. ఇదే కర్మయోగం యొక్క కీలకం అంటారు శ్రీ కృష్ణపరమాత్మ. నిష్కామ బుద్ధితో, స్వార్థచింతన లేకుండా లోక హితాన్ని కోరుకుని చేసే కర్మలన్నింటినీ యజ్ఞాలనే అంటారు. కర్మలు చేయగా చేయగా జ్ఞానం అనే ఫలం లభిస్తుంది. అందుచేతనే జ్ఞాని కర్మలపై ఆసక్తి లేనివాడై ఉంటాడు. కర్మలను ధర్మమార్గం వైపు మరల్చి, దైవానుగ్రహ సాధనాలుగా మలుచుకుంటాడు.

దేవుని రుణం, సద్గురువుల రుణం, తల్లిదండ్రుల రుణం, పశుపక్ష్యాదుల రుణాన్ని తీర్చడానికి సత్కార్యాలను చేయాలి. సత్కర్మ ఫలం అక్షయమైనది. కూడబెట్టే కొద్దీ అది ఇహ పరాల్లో, ఆపదల్లో, బాధల్లో, సంఘర్షణల్లో, మనోంధకారంలో, భయంలో, నిరాశనిస్పృహల్లో అక్కరకు వస్తుంది. ఏ మానవునికి పాప కర్మలు నశించి, పుణ్యకర్మలు మాత్రమే మిగిలి ఉంటాయో అతడు ద్వంద్వ వ్యామోహాల నుంచి విముక్తుడవుతాడు. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి, ఆత్మజ్ఞానం పొందవచ్చు. ‘‘పక్షి ఆకాశ మార్గంలో రెండు రెక్కల చేత మాత్రమే ఎగరగలిగినట్లు, మానవుడు జ్ఞానం, కర్మ అనే రెండింటి వల్లనే పరమ పదాన్ని చేరగలుగుతున్నాడు.’’ అని యోగవాసిష్ఠం చెబుతోంది. మనుషులు చేసే తప్పులు అనే విషవృక్షాల ఫలాలే రోగం, దుఃఖం, పరితాపం, బంధనం, వ్యసనం. మానవుడు కర్మను నవ్వుతూ చేసి, దాని ఫలితాన్ని ఏడుస్తూ అనుభవిస్తాడు. మన పనుల మూలాన్నే మనకు దుఃఖం, సుఖం కలుగుతాయి. కాబట్టి మన సుఖదుఃఖాలకు కారణం ఎవరో అనుకోకూడదు. మన కర్మలే అందుకు కారణాలు. కాబట్టి సత్కార్యాలను చేస్తూ.. ఆ కర్మ ఫలితాన్ని పరమాత్మకే అర్పించడం ద్వారా సద్గతులు సాధించాలి. అప్పుడే మనకు లభించిన ఉత్కృష్టమైన మానవజన్మను సార్థకం చేసుకున్నట్టు.

- మేఘశ్యామ (ఈమని), 8332931376

Updated Date - 2020-05-28T08:26:21+05:30 IST