కర్మయోగి

ABN , First Publish Date - 2021-05-22T07:30:57+05:30 IST

ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్‌ బహుగుణ మృతి పర్యావరణ ఉద్యమాలకు తీరని లోటు. ఆయన లేరన్న వార్త సామాన్యుల నుంచి...

కర్మయోగి

ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్‌ బహుగుణ మృతి పర్యావరణ ఉద్యమాలకు తీరని లోటు. ఆయన లేరన్న వార్త సామాన్యుల నుంచి పర్యావరణ ప్రేమికులవరకూ అందరినీ నిర్ఘాంతపరుస్తున్నది. ఆయా రంగాల్లో తమ విశేషమైన కృషితో విస్తృత ప్రభావం నెరపిన అనేకమంది మహానుభావులను కరోనా కమ్మేస్తున్న పాడుకాలం ఇది. రిషికేష్‌లోని ఎయిమ్స్‌లో చికిత్సపొందుతున్న ఈ ఉద్యమకారుడు క్షేమంగా బయటకు రావాలన్న అభిమానులు ప్రార్థనలు నెరవేరలేదు. 


ప్రతిచెట్టునూ ఆలింగనాలతో రక్షించుకొనే ‘చిప్కో’ ఉద్యమాన్ని నిర్వహించడం ఈ వనప్రేమికుడికి మరింత పేరు తెచ్చినమాట నిజమేకానీ, పుట్టుకతోనే ఆయన ఉద్యమకారుడు. గాంధేయవాదిగా ఆదిలో ఆయన అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి, గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లో దళితులకు ప్రవేశాన్ని కల్పించారు. తెహ్రీలో హాస్టల్‌ ఏర్పాటు చేసి, అన్ని కులాల విద్యార్థులనూ అందులో ఉంచారు. పిన్న వయసులో తన గురువు, మార్గదర్శి, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన శ్రీదేవ్‌ సుమన్‌ గర్వాల్‌ సైనికుల చేతుల్లో హింసకు గురైమరణించడం బహుగుణమీద విశేష ప్రభావం చూపింది. ఆయన మార్గంలో కొనసాగడమే కాక, తాను కృషిచేసే రంగాలను మరింత విస్తరించుకున్నారు. షిలియారలో అరంభించిన ‘పర్వతీయ నవజీవన ఆశ్రమం’ అనేక భవిష్యత్‌ ఉద్యమాలకు కార్యక్షేత్రం. కాంగ్రెస్‌ రాజకీయాలకు పూర్తిగా దూరమై, సంఘసేవకే అంకితమై, వినోబా బాటలో సర్వోదయని సర్వస్వంగా స్వీకరించారు. ఉత్తరాంచల్‌ పర్వతసానువుల్లో విస్తృతంగా పర్యటించి, పల్లెల్లో నాటుసారా విషాదాలను చూశారు. ఆదివాసీ గిరిజన మహిళలతో కలసి ఏళ్ళపాటు ఉద్యమించిన ఫలితంగా ప్రభుత్వం పలు పర్వతప్రాంత జిల్లాల్లో మద్యాన్ని నిషేధించింది. ఈ ఉద్యమం స్థానికుల్లో తమ సమర్థతపట్ల విశ్వాసాన్ని పెంచింది. అటవీ ఉత్పత్తుల దోపిడీని అనాదిగా నిరసిస్తున్న వారికి పోరాటం తప్ప మరోమార్గం లేదన్న సత్యాన్ని తెలియచెప్పింది. 1960ల నాటికి రోడ్ల నిర్మాణం కూడా జోరందుకోవడంతో, భారీ ఎత్తున కలప ఎగరేసుకుపోవడం కూడా పెరిగింది. కాగితం తయారీ, ఇతరత్రా అవసరాలకోసం ఏటా 20వేల టన్నుల కలప తరలిపోయేది. ఈ కొండప్రాంతాలపై రాజకీయ నాయకులనుంచి, అధికారుల వరకూ అందరి కన్నూ ఉండేది. ప్రకృతివనరుల దోపిడీకి ప్రభుత్వాలే భారీ ఒప్పందాలతో వరుస అనుమతులు ఇచ్చేస్తున్న ధోరణిని బహుగుణ భరించలేకపోయారు. రిజర్వుఫారెస్టు పరిధులను విస్తరించి, స్థానికులను అక్కడనుంచి తరిమేయడం, ఆ తరువాత అక్కడి వనరులను కొల్లగొట్టడం వంటి విన్యాసాలు అనేకం జరిగేవి. మొక్కలు నాటడం, పచ్చదనాన్ని పెంచడం కంటే వందలేళ్ళుగా ఉన్న చెట్లను కాపాడుకోవడం ప్రధానమని ఆయన నిర్ణయించుకున్నారు. బిష్ణోయీల అడుగుజాడలో చెట్టును పూర్తిగా చేతులతో చుట్టి ఆలింగనం చేసుకొనే ‘చిప్కో’ ఉద్యమం ప్రజలను కదిలించింది, ప్రభుత్వాలను వొణించింది, ప్రపంచాన్ని ఆకర్షించింది. అటవీచట్టాలు, ఫారెస్టు కాంట్రాక్టర్ల ఆగడాలకు వ్యతిరేకంగా పలుమార్లు ఆయన చేసిన నిరాహారదీక్షలు అంతిమంగా మొండి ప్రభుత్వాల మెడలు వంచాయి. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా కొన్ని మినహాయింపులతో కొత్తచట్టాలు వచ్చాయి. అటవీ ఉత్పత్తులు, వనరులపై స్థానికులకు అనేక హక్కులు దఖలుపడ్డాయి. దాదాపు ఐదువేల కిలోమీటర్ల పాదయాత్రతో కశ్మీర్‌ నుంచి నాగాలాండ్‌ వరకూ చిప్కో ఉద్యమ స్ఫూర్తిని విస్తరించారు ఆయన. తెహ్రీడ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం భారీ డ్యామ్‌ల మంచిచెడ్డలపై విస్తృతమైన చర్చ రేపింది.


వనరుల దోపిడీ వేగం పుంజుకుంటున్న కాలంలో హిమాలయాల రక్షణకూ, పర్యావరణ పరిరక్షణకు బహుగుణ నెరపిన యుద్ధంతో చాలా రాష్ట్రాల్లో అడవుల సంరక్షణకోసం కొత్తచట్టాలు వచ్చాయి. అనేక అవార్డులూ రివార్డులను కాదనుకొని జీవితపర్యంతం గాంధీమార్గంలో నడిచిన బహుగుణ మరణం దేశానికి తీరని లోటు. పర్యావరణహితంగా జీవించాలన్న ఆయన సందేశానికి ఎంతో విలువ, ప్రాధాన్యం ఉన్నాయని మహమ్మారులు కమ్మేసిన ఈ పాడుకాలం మరోమారు గుర్తుచేస్తున్నది.

Updated Date - 2021-05-22T07:30:57+05:30 IST