Abn logo
Sep 24 2021 @ 13:08PM

మీ పార్టీకి ఏమైందీ... స్పీకర్‌ ఆగ్రహం

బెంగళూరు: మీ పార్టీకి ఏమైందీ అంటూ జేడీఎస్‌ ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్‌ విశ్వేశరహెగ్డే కాగేరి మండిపడ్డారు. గురువారం జీరోఅవర్‌లో జేడీఎస్‌ సభ్యుడు సురేష్‌గౌడ 2021- 22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక అభివృద్ది గ్రాంటు కింద వెనుకబడిన తాలూకాలకు కేటాయించిన రూ.979 కోట్ల నిధులను ఇతర విభాగాలకు కేటాయించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో జేడీఎస్‌ సభ్యులు ఒక్కసారిగా లేచి గందరగోళం కలిగించేలా ప్రయత్నించారు. దీంతో ఆగ్రహానికి లోనైన స్పీకర్‌ కాగేరి మీ పార్టీకు ఏమైందని ప్రశ్నించారు. మీకు క్రమశిక్షణ నేర్పేవారు లేరా సభలో ఎలా వ్యవహరించాలో తెలుసుకోరా అంటూ మాజీ మంత్రి బండెప్పకాశంపూర్‌ను ఉద్దేశించి నిలదీశారు. జీరో అవర్‌లో ప్రశ్నలకు మంత్రుల వద్ద సమాధానం ఉంటే చెబుతారు లేదా తర్వాత వివరిస్తామనేది సంప్రదాయాన్ని మరిస్తే ఎలాగన్నారు. పార్టీ సభాపక్షనేత ఎమ్మెల్యేలకు నిబంధనలు నేర్పకుంటే శాసనసభా కార్యకలాపాలు ఎలా నడిపేది అనడంతో కాసేపటికి అందరూ మౌనంగా కూర్చొన్నారు. ప్రతి పక్షనేత సిద్దరామయ్యను ఉద్దేశించి స్పీకర్‌ మాట్లాడుతూ సభలో సీనియర్‌ సభ్యులు మీరు మౌనంగా ఉంటే ఎలాగన్నారు. చివరకు సర్దిచెప్పడంతో సభ శాంతించినట్లు అయ్యింది. కాగా సభా కార్యకలాపాలు అరంభమైన తర్వాత ఇటు మంత్రులు, అటు సభ్యులు లేకపోవడంపై స్పీకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.