కర్ణాటక బీజేపీలో మళ్ళీ అసమ్మతి?

ABN , First Publish Date - 2021-08-10T20:58:38+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ తన సొంత

కర్ణాటక బీజేపీలో మళ్ళీ అసమ్మతి?

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ తన సొంత పార్టీ నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఆయన మంత్రివర్గంలో మంత్రి పదవుల కేటాయింపుపై పెల్లుబికిన అసంతృప్తిని చల్లార్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్ళి, బీజేపీ అధిష్ఠానంతో మాట్లాడబోతున్నట్లు సమాచారం. 


మెకెదతు అంశంపై వచ్చే వారం ఢిల్లీ వెళ్తానని బసవరాజ్ బొమ్మయ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే బీజేపీ వర్గాలు చెప్తున్న వివరాల ప్రకారం, ఆయన ఎజెండాలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉందని తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిపై బీజేపీ అధిష్ఠానం పెద్దలతో ఆయన చర్చించబోతున్నట్లు సమాచారం. పార్టీ నేతల అసంతృప్తిని రాష్ట్ర స్థాయిలో చల్లార్చలేమని, కేంద్రం జోక్యం చేసుకోవడం తప్పనిసరి అని బొమ్మయ్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. 


తాను కోరుకున్న పోర్టుఫోలియో రాలేదని పురపాలక శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్ బహిరంగంగానే చెప్తున్నారు. తన స్థాయిని బీజేపీ ప్రభుత్వం దిగజార్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్పు రాకపోతే, తన నిర్ణయం తాను తీసుకుంటానని అంటున్నారు. ఆయనతో బసవరాజ్ బొమ్మయ్ మాట్లాడారు. 


అదేవిధంగా పర్యాటక శాఖను పొందిన ఆనంద్ సింగ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని భావిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. 


వెనుకబడిన వర్గాల నేత బీ శ్రీరాములు మాట్లాడుతూ, మంత్రి పదవుల కేటాయింపుపై తనకు సంతృప్తి లేదని, అదేవిధంగా నిరాశ కూడా లేదని అన్నారు. 

Updated Date - 2021-08-10T20:58:38+05:30 IST