మైసూరు ఘటనపై కర్ణాటక సీఎం స్పందన

ABN , First Publish Date - 2021-08-26T18:37:36+05:30 IST

కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఓ విద్యార్థినిపై సామూహిక

మైసూరు ఘటనపై కర్ణాటక సీఎం స్పందన

బెంగళూరు : కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ గురువారం మీడియాకు చెప్పారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టారని, ఇది అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 


కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర మీడియాతో మాట్లాడుతూ, నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. బాధితురాలిని ఓ ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. ఆమె స్టేట్‌మెంట్‌ను నమోదు చేయవలసి ఉందన్నారు. గురువారం సాయంత్రం తాను మైసూరు వెళ్తానన్నారు. 


ఎంబీఏ చదువుతున్న ఓ విద్యార్థిని (23) తన స్నేహితునితో కలిసి మైసూరు శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్ళి, తిరిగి వస్తూండగా మంగళవారం రాత్రి దాదాపు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థినిపై వారు సామూహికంగా అత్యాచారం చేశారని, ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టారని సమాచారం. బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆమె స్నేహితుడి  స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మైసూరు ప్రాంతంలోని లలితాద్రిపుర, తిప్పయ్యనకెరే సమీపంలో మంగళవారం రాత్రి 8 గంటలకు ఈ దారుణం జరిగింది. బాధితురాలు వేరొక రాష్ట్రం నుంచి వచ్చి మైసూరులో చదువుతున్నట్లు గుర్తించారు. ఈ సంఘటనపై అలనహళ్ళి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.



Updated Date - 2021-08-26T18:37:36+05:30 IST