పెట్రోలుపై పన్నులు తగ్గిస్తాం : కర్ణాటక సీఎం

ABN , First Publish Date - 2021-10-17T17:34:29+05:30 IST

పెట్రోలు ధరలు ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతుండటంతో కర్ణాటక

పెట్రోలుపై పన్నులు తగ్గిస్తాం : కర్ణాటక సీఎం

బెంగళూరు : పెట్రోలు ధరలు ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతుండటంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ ఓ శుభవార్త చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, పెట్రోలు, డీజిలుపై పన్నులను తగ్గించి, తద్వారా ధరలు తగ్గే విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 30న జరిగే ఉప ఎన్నికల అనంతరం సమీక్ష జరుగుతుందన్నారు.


కర్ణాటకలోని సిందగి, హంగల్ శాసన సభ నియోజకవర్గాలకు అక్టోబరు 30న ఉప ఎన్నికలు జరుగుతాయి. నవంబరు 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బసవరాజ్ బొమ్మయ్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. కర్ణాటకలో పెట్రోలుపై పన్నులను తగ్గించే ఆలోచన ఉందా? అని ప్రశ్నించినపుడు బొమ్మయ్ స్పందిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇది ఆధారపడి ఉంటుందని తాను ఇప్పటికే చెప్పానన్నారు. ఉప ఎన్నికల తర్వాత తాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష జరుపుతానని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే, పన్నులను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. ఆర్థిక శాఖను కూడా బొమ్మయ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


ఇదిలావుండగా, రెండు రోజుల విరామం అనంతరం వరుసగా నాలుగు రోజుల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఆదివారం కూడా స్వల్పంగా ధరలు పెరగడంతో బెంగళూరులో లీటరు పెట్రోలు రూ.109.37కు, లీటరు డీజిలు రూ.100.37కు చేరింది. 


పెట్రోలు, డీజిలు ధరలు తగ్గే విధంగా రాష్ట్ర పన్నులను తగ్గిస్తామని బసవరాజ్ బొమ్మయ్ ఈ నెల 10న కూడా చెప్పారు. 

Updated Date - 2021-10-17T17:34:29+05:30 IST