కర్ణాటక ముఖ్యమంత్రిని మళ్లీ మార్చనున్న బీజేపీ!

ABN , First Publish Date - 2021-11-29T23:33:39+05:30 IST

మా నాయకుడు నిరాని తొందరలోనే కర్ణాటకకు ముఖ్యమంత్రి అవుతారు. అయితే బస్వారాజ్ బొమ్మై ఎప్పుడు వైదొలగుతారని కానీ నిరాని సీఎం ఎప్పుడు అవుతారని కానీ స్పష్టంగా చెప్పలేను. కానీ నిరాని తొందరలోనే ముఖ్యమంత్రి అవుతారు...

కర్ణాటక ముఖ్యమంత్రిని మళ్లీ మార్చనున్న బీజేపీ!

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిని మరోసారి మార్చనున్నట్లు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. అయితే ఆ ముఖ్యమంత్రి ఎవరో కూడా ఆయనే చెప్పారు. కర్ణాటక మంత్రి మురుగేష్ నిరాని తొందరలోనే సీఎం అవుతారని, అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది తాను స్పష్టంగా చెప్పలేనని అన్నారు. బస్వరాజ్ బొమ్మై కేబినెట్‌లో కేఎస్ ఈశ్వరప్ప గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక నిరాని భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే బీఎస్ యడియూరప్పను కర్ణాటక ముఖ్యమంత్రిగా తప్పించి ఆ స్థానంలో బొమ్మైని కూర్చోబెట్టిన బీజేపీ అధిష్టానం తాజాగా మరోసారి మార్పుకు సిద్ధమైనట్లు కేఎస్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.


‘‘మా నాయకుడు నిరాని తొందరలోనే కర్ణాటకకు ముఖ్యమంత్రి అవుతారు. అయితే బస్వారాజ్ బొమ్మై ఎప్పుడు వైదొలగుతారని కానీ నిరాని సీఎం ఎప్పుడు అవుతారని కానీ స్పష్టంగా చెప్పలేను. కానీ నిరాని తొందరలోనే ముఖ్యమంత్రి అవుతారు. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. అంతే కాకుండా రాష్ట్రంలో వెనుకబడిన తరగతికి చెందిన వర్గాల సంక్షేమం కోసం ఆయన ముఖ్యమంత్రి కావాల్సి ఉంది’’ అని కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. యడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా పేరు ఉన్న కేఎస్ ఈశ్వరప్ప ప్రస్తుత బొమ్మై కేబినెట్‌లోనూ మంత్రిగా ఉన్నారు. అయితే బొమ్మై సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం కేఎస్‌కే వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ అసలు డిప్యూటీ సీఎం పదవిని ఎవరితో భర్తీ చేయకపోవడం గమనార్హం.

Updated Date - 2021-11-29T23:33:39+05:30 IST