Abn logo
Sep 22 2021 @ 14:48PM

పుట్టినరోజున దేవుడి దర్శనం.. రూ 23వేల జరిమానా!

బెంగళూరు: కుమారుడి పుట్టినరోజు సందర్భంగా దేవుడిని దర్శించుకోవడానికి వెళ్లిన ఆ తండ్రికి రూ. 23 వేల జరిమానా విధించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా హనుమసాగర్ సమీపంలోని మియాపుర గ్రామంలో ఈ ఘటన జరిగింది.


మియాపుర గ్రామంలోని దళిత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తన రెండేళ్ల కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకోవాలని అనుకున్నాడు. అయితే ఈ గ్రామంలో దళితులను గుడిలోకి రానివ్వరు. ఈ విషయం తెలిసిన ఆ తండ్రి ఆలయం వెలుపల నుంచే దేవుడిని ప్రార్థించాలని తన కుమారుడిని తీసుకుని వెళ్లాడు. అయితే గుడిలోకి వెళ్లకూడదన్న విషయం తెలియని ఆ బాలుడు ఉత్సాహంతో లోపలికి వెళ్లి దేవుడిని దర్శించుకుని వచ్చాడు. ఈ నెల 4న జరిగిన ఈ ఘటన ఆ గ్రామంలో పెద్ద దుమారం రేపింది. దళిత వర్గానికి చెందిన బాలుడు ఆలయంలోకి ప్రవేశించడంతో దేవాలయం అపవిత్రం అయిందని గ్రామంలోని అగ్రవర్ణల వారు భావించారు. దీనిపై ఈ నెల 11న అగ్రవర్ణ పెద్దలు ఒక సమావేశం నిర్వహించారు. అపవిత్రం అయిన ఆలయాన్ని శుద్ధి చేయాలని, అందుకు అయ్యే ఖర్చును లెక్కించి ఆ బాలుడి తల్లిదండ్రులకు రూ. 23 వేల జరిమానా విధించారు. ఈ విషయం ప్రభుత్వాధికారుల దృష్టికి వెళ్లడంతో పోలీసులతో పాటు రెవెన్యూ, సాంఘిక సంక్షేమశాఖ అధికారులు కూడా మియాపుర గ్రామానికి వచ్చారు. గ్రామస్థులందరికీ అంటరానితనం గురించి అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దళిత బాలుడి తల్లిదండ్రులకు జరిమానా విధించినందుకు అగ్రవర్ణ పెద్దలను పిలిచి మాట్లాడారు. గ్రామంలో ఇలాంటి ఘటన పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వారిని వదిలిపెట్టారు.


ఈ ఘటనపై కొప్పల్ జిల్లా ఎస్పీ టి. శ్రీధర్ మాట్లాడుతూ.. తాను స్వయంగా మియాపుర గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించినట్లు చెప్పారు. కులం పేరుతో అవమానించి, జరిమానా విధించిన అగ్రవర్ణ పెద్దలపై ఫిర్యాదు చేయమని బాధితులకు చెబితే.. వారు అందుకు నిరాకరించినట్లు ఎస్పీ తెలిపారు. శత్రుత్వం పెంచుకోవడం తమకు ఇష్టం లేదని, అందుకే తాము ఎలాంటి కేసు పెట్టడం లేదని చెప్పినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇక అగ్రవర్ణాల వారు దళిత బాలుడి కుటుంబానికి క్షమాపణలు చెప్పారని ఎస్పీ వివరించారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...