Karnataka: మరో మూడు రోజులే గడువు.. రూ.60 వేల జరిమానా కట్టాల్సిందేనంటూ ఒత్తిడి.. ఇంతకీ ఆ దళిత కుటుంబం చేసిన తప్పేంటంటే!

ABN , First Publish Date - 2022-09-27T21:49:00+05:30 IST

అక్టోబ‌ర్ ఒక‌టో తేదీలోగా ఆ సొమ్ము చెల్లించ‌క‌పోతే గ్రామ బ‌హిష్కారం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. గ్రామ పెద్దల తీర్పు తీవ్ర వివాదాస్పదమైంది.

Karnataka: మరో మూడు రోజులే గడువు.. రూ.60 వేల జరిమానా కట్టాల్సిందేనంటూ ఒత్తిడి.. ఇంతకీ ఆ దళిత కుటుంబం చేసిన తప్పేంటంటే!

`అక్టోబర్ 1వ తారీఖునకు మరో మూడు రోజులే గడువు ఉంది.. రోజూ పనికి వెళ్తే కానీ పూటగడవని పరిస్థితి.. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా అరవై వేల రూపాయలు.. ఎక్కడి నుంచి తేవాలి.. అసలు ఎందుకు కట్టాలి..? జరిమానా కట్టకపోతే ఏం చేస్తారు..? ఇప్పుడు మనమేం చేయాలి..?` ఇదీ.. ఆ కుటుంబ సభ్యులు కొద్ది రోజులుగా పడుతున్న ఆవేదన. ఇంతకీ ఆ పేద దళిత కుటుంబం అంత భారీ జరిమానా కట్టాల్సి రావడానికి కారణమేంటంటే.. ఆ కుటుంబానికి చెందిన బాలుడు గ్రామ దేవ‌త ఊరేగింపులో దేవత‌ విగ్ర‌హాన్ని తాకడమే. క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఈ అమానుష ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.


ఇది కూడా చదవండి..

ఈ యువతి ఓ డాక్టర్.. ప్రాణాలు నిలబెట్టాల్సింది పోయి.. తన ప్రాణాన్నే తీసుకుంది.. స్నేహితుడి భార్య వచ్చి తిట్టడంతో..


కర్ణాటకలోని కోలార్ జిల్లా ఉల్లేరహళ్లి గ్రామానికి చెందిన శోభ‌మ్మ అనే దళిత మహిళ త‌న కుటుంబంతో కలిసి ఊరి చివ‌ర‌ నివ‌సిస్తోంది. ఆమె కుమారుడు స్థానిక పాఠ‌శాల‌లో పదో త‌ర‌గ‌తి చ‌దువుకుంటున్నాడు. అనారోగ్యం కారణంగా శోభమ్మ భర్త ఏ పనీ చేయడం లేదు. శోభ‌మ్మ ప్ర‌తిరోజు ఉద‌యం బెంగ‌ళూరు వెళ్ళి అక్క‌డ ఇంటి పనులు చేస్తూ నెల‌కు రూ.13 వేలు సంపాదిస్తుంటుంది. ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల జరిగిన గ్రామ దేవత ఊరేగింపులో పాల్గొన్న శోభమ్మ కొడుకు దేవత విగ్రహాన్ని ముట్టుకున్నాడు. దీంతో గ్రామపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారంగా రూ.60 వేల జ‌రిమానా విధించారు. అక్టోబ‌ర్ ఒక‌టో తేదీలోగా ఆ సొమ్ము చెల్లించ‌క‌పోతే గ్రామ బ‌హిష్కారం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. గ్రామ పెద్దల తీర్పు తీవ్ర వివాదాస్పదమైంది. 


గ్రామ పెద్దల తీర్పుతో శోభమ్మ తీవ్ర మనస్థాపానికి గురైంది. `దేవుడు మమ్మ‌ల్ని ఇష్టపడకపోతే, మేము ఆయనను ప్రార్థించము. ఇకపై అంబేడ్కర్‌కి ప్రార్థనలు చేస్తాం` అని శోభ‌మ్మ పేర్కొంది. `దేవుడికి మా స్పర్శ నచ్చకపోతే,  మేం ప్రార్థనలు చేయడంలో అర్థం ఏముంది? ఇతర వ్యక్తుల్లాగే, నేను కూడా పండుగకు విరాళాలు ఇచ్చాను. ఇకపై, నేను అలాంటి పని చేయను. బీఆర్ అంబేడ్కర్‌కు మాత్రమే ప్రార్థనలు చేస్తాను` అని ఆమె స్ప‌ష్టం చేసింది. విషయం తెలుసుకున్న కోలార్ డిప్యూటీ కమిషనర్ వెంకట్ రాజా.. శోభమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. `ఇల్లు నిర్మించడానికి వారికి స్థలం, కొంత డబ్బు ఇచ్చాం. శోభ‌మ్మకు సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఉద్యోగం కల్పిస్తాం. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తాం` అని రాజా చెప్పారు. 

Updated Date - 2022-09-27T21:49:00+05:30 IST