కర్ణాటక డ్రగ్స్‌.. తెలంగాణలో డొంక!

ABN , First Publish Date - 2021-04-04T06:51:46+05:30 IST

కర్ణాటక డ్రగ్స్‌ కేసు మలుపులు తిరుగుతోంది. తొలుత సినీ ప్రపంచానికే పరిమితమైందనుకున్న ఈ కేసు.. రాజకీయ నేతల

కర్ణాటక డ్రగ్స్‌.. తెలంగాణలో డొంక!

  • నలుగురు ఎమ్మెల్యేలపై సీసీబీ నజర్‌..
  • అప్పుడే ఏం చెప్పలేమన్న పోలీసులు


బెంగళూరు, హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక డ్రగ్స్‌ కేసు మలుపులు తిరుగుతోంది. తొలుత సినీ ప్రపంచానికే పరిమితమైందనుకున్న ఈ కేసు.. రాజకీయ నేతల చుట్టూ తిరుగుతోంది. ప్రధానంగా తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఈ రాకెట్‌తో సంబంధాలున్నాయని గుర్తించిన బెంగళూరు సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే సినీ తారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్టయిన విషయం తెలిసిందే. వారు దాదాపు 100 రోజులుగా పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో అండర్‌ ట్రయలర్స్‌గా ఉంటున్నారు.


ఈ కేసు మాదక ద్రవ్యాలతో ముడిపడడం వల్ల.. వారికి బెయిల్‌ రాకుండా సీసీబీ పోలీసులు కోర్టులో ఎప్పటికప్పుడు బలమైన కౌంటర్లు వేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు.. ఇప్పుడు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, పలువురు బిల్డర్లు, ఒక పారిశ్రామిక వేత్త చుట్టూ తిరుగుతోంది. అయితే.. ఇప్పుడప్పుడే ఏ వివరాలు వెల్లడించలేమని, ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని సీసీబీ అధికారులు చెబుతున్నారు. ప్రముఖ కన్నడ సినీ నిర్మాత శంకరగౌడ ఏర్పాటు చేసిన ఓ విందులో తెలుగు నటుడు తనీశ్‌ పాల్గొన్నట్టు.. అందులో మాదకద్రవ్యాల సరఫరా జరిగిందని గుర్తించామన్నారు. ఇటీవల తనీశ్‌ను పిలిపించి, విచారించామన్నారు. తనీశ్‌ విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్టు వివరించారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ఎమ్మెల్యేల పాత్ర ఇంకా తేలాల్సి ఉందన్నారు. 



గొలుసుకట్టుగా ముఠాలు!

తొలుత ముంబైలో బాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్‌ రాకెట్‌ కలకలం.. ఆ వెంటనే శాండల్‌వుడ్‌కు షాకిచ్చింది. మార్చి 6న బెంగళూరు పోలీసులు 8 మంది విదేశీయులతోపాటు వారికి సహకరిస్తున్న మరో ఇద్దరిని డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేశారు. వారి నుంచి 350 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్స్‌, 4 గ్రాముల కొకైన్‌, 82 గ్రాముల ఎక్ట్ససీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.


వారిచ్చిన సమాచారంతో మరో ఇద్దరు నైజీరియన్‌ల నుంచి 200 గ్రాముల కొకైన్‌, 2710 గ్రాముల ఎండీఎంఏ, 576 ఎల్‌ఎ్‌సడీ స్ట్రిప్స్‌, 1939 ఎక్ట్ససీ పిల్స్‌, రూ. 2.75 లక్షల నగదును సీజ్‌ చేశారు. వారిని విచారిస్తే మార్చి 24న ఇంకో డ్రగ్స్‌ ముఠా పట్టుబడింది. ఈ రెండు కేసుల్లో నైజీరియన్‌ల మొబైల్‌ ఫోన్లు, లాప్‌టా్‌పలను బెంగళూరుపోలీసులు విశ్లేషించారు. అందులో.. తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, బిల్డర్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన సందీ్‌పరెడ్డి, కలహర్‌రెడ్డి బెంగళూరులో పబ్‌లను నిర్వహిస్తున్నట్లు తేలింది. వీరిద్దరూ తెలంగాణకు చెందిన ప్రముఖులతో పార్టీల్లో పాల్గొన్నట్లు గుర్తించారు.




గతంలోనూ బెంగళూరు లింకులు

గతంలో హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసుల్లోనూ బెంగళూరు లింకులు బయటపడ్డాయి. ఇక్కడ డ్రగ్స్‌ సరఫరాదారులు గోవా లేదా బెంగళూరు నుంచి మత్తుపదార్థాలను తీసుకువచ్చారని తేలింది. ఈ ముఠాలన్నీ ఒకదానికొకటి ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాయని అప్పట్లో ఎక్సైజ్‌ పోలీసులు గుర్తించారు. గోవా-కర్ణాటక-హైదరాబాద్‌ మధ్య రోడ్డుమార్గంలో మత్తు పదార్థాలను తరలిస్తున్నారని తేల్చారు.

Updated Date - 2021-04-04T06:51:46+05:30 IST