ఏం భయపడొద్దు..

ABN , First Publish Date - 2020-07-08T11:05:38+05:30 IST

‘‘ప్రజలకు అందుబాటులో సచివాలయాన్ని నిర్మించాలని అడిగినందుకు టీడీపీ నాయకులు, సానుభూతిపరులపై తప్పుడు కేసులు ..

ఏం భయపడొద్దు..

 పార్టీ అండగా ఉంటుంది

టీడీపీ నేత కర్నాటి వెంకటరెడ్డి కుటుంబానికి చంద్రబాబు భరోసా

ఫోన్‌ ద్వారా జరిగిన ఘటనపై ఆరా


కడప, జూలై7(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజలకు అందుబాటులో సచివాలయాన్ని నిర్మించాలని అడిగినందుకు టీడీపీ నాయకులు, సానుభూతిపరులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మీరేమీ భయపడొద్దు, రాష్ట్ర పార్టీ మొత్తం మీ కుటుంబానికి అండగా ఉంటుంది’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాశినాయన మండలం నరసాపురం టీడీపీ నేత కర్నాటి వెంకటరెడ్డి కుటుంబానికి భరోసా ఇచ్చారు. సచివాలయాన్ని ఊరి బయట కాకుండా గ్రామంలో నిర్మించాలంటూ రెండురోజుల క్రితం మహిళలు, గ్రామస్తుల తో పాటు పలువురు ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసులు టీడీపీ నేత కర్నాటి వెంకటరెడ్డితో పాటు టీడీపీ సానుభూతిపరులు, ప్రజలపై కేసులు నమోదు చేశారు. మొత్తం 32 మందిపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందికి గురిచేస్తున్నారంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డిలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.


వెంటనే చంద్రబాబు కర్నాటి వెంకటరెడ్డి కోసం ఫోనులో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ఆయన సతీమణి శ్వేతశ్రీతో మాట్లాడి జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని అడ్డుకోలేదని గ్రామంలోనే సచివాలయం నిర్మించాలని మహిళలు విజ్ఞప్తి చేశారన్నారు. అయితే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడంతో మహిళలని కూడా చూడకుండా, కోవిడ్‌ నిబంధనలు పాటించకుండా ఒకే జీపులో మహిళా పోలీసులు లేకుండా తీసుకెళ్లినట్లు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. రాత్రి 10 వరకు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచినట్లు శ్వేతశ్రీ పేర్కొన్నారు. మీరేమీ భయపడొద్దు, పార్టీ మీకు అండగా ఉంటుంది, అవసరమైతే సీనియర్‌ నాయకులను పంపించి తప్పుడు కేసులను ఎండగడతామని హామీ ఇచ్చినట్లు రెడ్యం వెల్లడించారు. లోకేష్‌ కూడా జరిగిన సంఘటనపై ఆరా తీశారని, హైకోర్టులో కేసు వేస్తామని చెప్పినట్లు వివరించారు.

Updated Date - 2020-07-08T11:05:38+05:30 IST