పన్నెండింటికి ఖాళీ

ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST

ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నగరంలో కర్ఫ్యూ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలకల్లా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు సంస్థలన్నీ మూతపడ్డాయి.

పన్నెండింటికి ఖాళీ
కర్ఫ్యూ సమయంలో వాహన చోదకులను ప్రశ్నిస్తున్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి

నగరంలో మూతపడిన వాణిజ్య సముదాయాలు

ఆర్టీసీ సర్వీసుల నిలిపివేత

బోసిపోయి దర్శనమిచ్చిన రోడ్లు

అత్యవసరసేవలకు మాత్రమే అనుమతి


గుంటూరు, మే 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నగరంలో కర్ఫ్యూ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలకల్లా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు సంస్థలన్నీ మూతపడ్డాయి. అత్యవసర సర్వీసులకు మాత్రమే ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచే మార్కెట్లు, దుకాణాలు, మాల్స్‌ కిటకిటలాడాయి. ఉదయం 11గంటల వరకు రద్దీ కనిపించింది. అలానే మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. 12గంటలకు వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశారు. గుంటూరు బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారులు కర్ఫ్యూ సమయానికంటే రెండు గంటల ముందుగానే బస్సులు నిలివేసారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కనీసం బస్సులు నిలిపేస్తున్నట్లు సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి గుంటూరు నగరానికి వైద్యానికి వచ్చిన రోగులు, వారి సహాయకులు నానా ఇబ్బంది పడ్డారు.  

స్వయంగా పరిశీలించిన అర్బన్‌ ఎస్పీ

తొలి రోజు నగరంలో కర్ఫ్యూ తీరును అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి స్వయంగా పరిశీలించారు.  నిబంధనలను అతిక్రమించి మధ్యాహ్నం 12 గంటల తరువాత రోడ్డుపైకి వచ్చిన వాహన చోదకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 తరువాత దుకాణాలు తెరిచినా, వాహనాల్లో తిరిగినా అటువంటి వారిపై కేసులు నమోదు చేయటంతోపాటు, వాహనాలు సీజ్‌ చేయటం జరుగుతుందన్నారు. గత నెల 11 నుంచి ఇప్పటివరకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కింద 444 కేసులు నమోదు చేసి 500 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మాస్క్‌లు ధరించని వారిపై 43,318 కేసులు నమోదు చేశామన్నారు. కర్ఫ్యూ నేపథ్యంలో అత్యవసరమైన వారు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద 15 ఆటోలకు, రైల్వేస్టేషన్‌కు ఇరువైపుల పలు ఆటోలకు ట్రాఫిక్‌ డీఎస్పీ ద్వారా పాసులు ఇవ్వనున్నారు. ఆపదలో ఉన్న రోగుల కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST