గుంటూరులో పెరుగుతోన్న కరోనా

ABN , First Publish Date - 2021-08-02T05:57:32+05:30 IST

గుంటూరు నగరంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగర పరిధిలో కొత్తగా 62 మందికి ఈ వైరస్‌ సోకినట్లు తేలింది.

గుంటూరులో పెరుగుతోన్న కరోనా
అరండల్‌పేటలో బండ్ల వద్ద గుంపులు, గుంపులుగా జనాలు

జిల్లాలో 231 నగర పరిధిలో 62 కేసులు

గుంటూరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగర పరిధిలో కొత్తగా 62 మందికి ఈ వైరస్‌ సోకినట్లు తేలింది. కళాశాలలు తెరిచిన కారణంగా విద్యార్థులు వేల సంఖ్యలో వెళుతుండటంతో కేసుల సంఖ్యలో హెచ్చుదల కనిపిస్తున్నది. అలానే సినిమా థియేటర్లు కూడా తెరిచారు. మరో రెండు వారాల తర్వాత పాఠశాలలు కూడా తెరుస్తామని ప్రభుత్వం చెబుతున్నది. ఈ నేపథ్యంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఆదివారం ఉదయం వరకు 8,927 శాంపిల్స్‌ టెస్టింగ్‌ చేయగా, 231 మందికి వైరస్‌ సోకినట్లు తేలిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. కొవిడ్‌తో దుగ్గిరాలలో ఒకరు చనిపోయారు. నరసరావుపేటలో 15, చెరుకుపల్లిలో 15, చిలకలూరిపేటలో 9, తుళ్లూరులో 8, ఈపూరులో 7, పెదనందిపాడులో 7, బెల్లంకొండలో 7, గుంటూరు రూరల్‌లో 6, కొల్లిపరలో 6, నిజాంపట్నంలో 6, రేపల్లెలో 6, వినుకొండలో 6, సత్తెనపల్లిలో 6, తాడేపల్లిలో 6, అమరావతిలో 4, మంగళగిరిలో 4, అచ్చంపేటలో 3, క్రోసూరులో 3, ప్రత్తిపాడులో 2, ముప్పాళ్లలో 1, ఫిరంగిపురంలో 1, తాడికొండలో 1, వట్టిచెరుకూరులో 1, దాచేపల్లిలో 3, బాపట్లలో 3, చేబ్రోలులో 3, పిడుగురాళ్లలో 2, రెంటచింతలలో 1, బొల్లాపల్లిలో 2, నాదెండ్లలో 4, నూజెండ్లలో 2, నకరికల్లులో 4, శావల్యాపురంలో 1, అమర్తలూరులో 1, దుగ్గిరాలలో 1, పిట్టలవానిపాలెంలో 1, పొన్నూరులో 1, తెనాలిలలో 3 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఎక్కడా వ్యాక్సిన్లు వేయలేదు. 

72 శాతం తగ్గిన కేసులు

జూలై నెలలో నమోదైన కరోనా కేసుల గణాంకాలను ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. జూలై నెలలో 5,755 మందికి వైరస్‌ సోకింది. అదే జూన్‌లో 12,419 మందికి పాజిటివ్‌ వచ్చింది. జూన్‌తో పోల్చి చూస్తే జూలైలో కేసులు తగ్గాయి. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం జూన్‌లో 144 మంది చనిపోగా జూలైలో 55 మంది మాత్రమే చనిపోయారు. 

Updated Date - 2021-08-02T05:57:32+05:30 IST