కరోనా.. నానాహైరానా...!

ABN , First Publish Date - 2021-04-21T05:13:49+05:30 IST

మార్కాపురం పట్టణంలో కరోనా కలకలం రేపుతోంది. మొదటిదశే కాదు రెండోదశలో కూడా వైరస్‌ శరవేగంగా విజృంభిస్తోంది. పట్టణంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు గతేడాది ఏప్రిల్‌ 4న నమోదుగాకా, తొలి మరణం మే 11న నమోదైంది. ఇంచుమించు ఈ ఏడాది కాలంలో అధికారిక లెక్కల ప్రకారం కరోనాతో 32 మంది మృతి చెందారు.

కరోనా.. నానాహైరానా...!

మార్కాపురం పట్టణంలో ఈ ఏడాది కాలంలో 1980 మందికి కరోనా

గతేడాది మే 11న తొలి మరణం

ఇప్పటికి 32 మంది మృతి

ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 190


మార్కాపురం, ఏప్రిల్‌ 20 : మార్కాపురం పట్టణంలో కరోనా కలకలం రేపుతోంది. మొదటిదశే కాదు రెండోదశలో కూడా వైరస్‌ శరవేగంగా విజృంభిస్తోంది. పట్టణంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు గతేడాది ఏప్రిల్‌ 4న నమోదుగాకా,  తొలి మరణం మే 11న నమోదైంది. ఇంచుమించు ఈ ఏడాది కాలంలో అధికారిక లెక్కల ప్రకారం కరోనాతో 32 మంది మృతి చెందారు. 

తర్లుపాడు రోడ్డులోని కరెంట్‌ ఆఫీస్‌ వెనుక నివాసం ఉండే యువకుడికి మొట్టమొదటగా కరోనా సోకినట్లు వైద్యాధికారులు గుర్తించారు. అప్పట్లో అతను ఢిల్లీ నుంచి వచ్చాడు. అతను ప్రయాణించిన రైలులో మత ప్రార్థనలకు ఢిల్లీ వెళ్లి వస్తున్న వారు ఉండటం కారణంగానే కరోనా సోకిందని, అలా మార్కాపురంలో తొలి కేసు నమోదైందని అధికారులు చెబుతున్నారు. తదనంతరం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది.

ప్రస్తుతం కరోనా రెండో దశలో దాని పీడితుల సంఖ్య ఎక్కువగానే ఉంది. రెండో దశ వ్యాప్తి మొదటి దశతో పోలిస్తే తీవ్రంగానే ఉంది. ఒక వైపు కరోనా వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ వాక్సినేషన్‌ ప్రక్రియలో పలు లోపాల వలన తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒక వైపు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలలో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నప్పటికీ దానిపట్ల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం, ప్రజలు ముందుకు వచ్చిన చోట వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడం, కొన్ని నిర్ధిష్టమైన ప్రదేశాలలో మాత్రమే వ్యాక్సినేషన్‌కు అనుమతులుండటం, వీటన్నిటికీ మించి వ్యాక్సినేషన్‌ చేయించుకున్నప్పటికీ ఫలితం పెద్దగా లేదన్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లడం కారణంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతం కాలేదని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ మార్కాపురం పట్టణంలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 1980 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో కరోనా కాటుకు 32 మంది మృత్యువాత పడ్డారు. 1758 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం మరో 190 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. అందులో కేవలం 40 మంది ఒంగోలులోని జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 


రావిపాడులోనే 35కు పైగా కేసులు..

అర్థవీడులో ఆర్టీసీ కండక్టర్‌ మృతి 

కంభం : కంభం, అర్థవీడు మండలాల్లో కరోనా రెండో దశ విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వైరస్‌ నియంత్రణకు కనీస జాగ్రత్తలు ప్రజలు తీసుకోకపోవడం అధికారుల్లో ఆందోళన పెంచుతోంది. ఇంటి నుంచి బయటకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. అత్యధికులు మాస్క్‌లు ధరించకుండానే వాహనాలలో, బయటకు వస్తున్నారు. పోలీసులు ఓ పక్క మాస్క్‌లు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నా ముఖ్యంగా యువత అసలు పట్టించుకోవడం లేదు. ఇక సినిమా హాళ్లు, మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, బస్టాండ్ల వద్ద జనాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం కంభం మండలంలోని రావిపాడులో అత్యధికంగా 35కు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కంభంలోనూ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. చాలామంది ఇళ్లల్లోనే ఉంటూ వైద్య సహాయం పొందుతున్నారు. అర్థవీడు మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని పలువురు చెబుతున్నారు. మిట్టమీదిపల్లె గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్‌ కరోనాతో ఆదివారం మృతిచెందడం వారి కుటుంబసభ్యుల్లో మరో ముగ్గురికి పాజిటివ్‌ సోకడం కలకలం రేపుతోంది. 


Updated Date - 2021-04-21T05:13:49+05:30 IST