కార్తిక మాస విధులు

ABN , First Publish Date - 2020-12-01T09:23:48+05:30 IST

పుష్కర, కురుక్షేత్ర, హిమాలయాల్లో నివసించడం వల్ల కలుగు పుణ్యం, సమస్త తీర్థాల దర్శనం వల్ల, సర్వ యజ్ఞాల వల్ల లభించు పుణ్యాన్ని త్రాసులోని ఒక పళ్లెంలో ఉంచి..

కార్తిక మాస విధులు

పుష్కర, కురుక్షేత్ర, హిమాలయాల్లో నివసించడం వల్ల కలుగు పుణ్యం, సమస్త తీర్థాల దర్శనం వల్ల, సర్వ యజ్ఞాల వల్ల లభించు పుణ్యాన్ని త్రాసులోని ఒక  పళ్లెంలో ఉంచి.. వేరొక పళ్లెంలో కార్తిక మాసమునందు భక్తులు ఆచరించే విధుల పుణ్యాన్ని ఉంచితే.. ఆ పుణ్యాల రాశి కార్తిక పుణ్యంలోని పదహారో వంతుకు కూడా సమానం కాదట. అటువంటి పుణ్యాన్ని ఇచ్చే విధులు కార్తికంలో ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన విధులు ప్రస్తావించుకోదగినవి.


స్నానం దీపో జపశ్చైవ నియమ వ్రత ధారణమ్‌

ఉపవాసశ్శమో దమః పూజనం వన సేవనమ్‌

ధర్మాచారౌ చ దానం చ నియతాహారపాలనమ్‌

పురాణ పఠనం చేతి కార్తికే విధిమాలికా  


అని స్మృతుల్లో, పురాణాల్లో చెప్పబడింది. వీటిలో స్నానం.. సర్వవిధాలైన బాహ్య మాలిన్యాలను పోగొడుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అయితే ఆ స్నానం చేసే సమయం, స్థలాలను బట్టి దాని ప్రభావం అంతరంగ శోధనకు కూడా ఉపకరిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతాయి. అందునా కార్తిక మాసంలో ప్రాతః కాలంలో.. అంటే సూర్యుడు ఉదయించడానికి మునుపే స్నానం చేస్తే అది మనస్సును శుద్ధం చేస్తుంది. బుద్ధి వికాసానికి తోడ్పడుతుంది. జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుందని స్మృతులు చెబుతున్నాయి. ఆ స్నానం కూడా నదీ జలాలలో చేయాలిట. కుదరకపోతే చెరువుల్లో, తటాకాల్లో, బావినీటితో చేయడం మంచిది. ఇవేవీ లేకపోతే ఇంటిలో కుళాయి ద్వారా వచ్చే చన్నీటితో స్నానం చేయడం శ్రేయస్కరం. రెండోది.. దీపం వెలిగించడం. దీపాన్ని సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపంగా భావించి వెలిగించుకోవాలి. కార్తికమాస ప్రధాన విధుల్లో మూడోది.. జపం. ఇష్ట దేవతారాధనకు గురువు నుండి పొందిన మంత్రాలతో అనునిత్యం స్మరించుకోవడమే జపం.


ఈ జపం మూడు రకాలు. వాటిలో మొదటిది వాచికం. అంటే మంత్రాన్ని పైకి చదువుతూ జపించడం. రెండోది ఉపాంశువు.. అంటే వినబడీ వినబడనట్లు పలకడం. మూడోది మానసికం. అంటే మనస్సులో మంత్రాన్ని జపించుకోవడం. జపం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. అలాగే కార్తిక మాసంలో ఆచరించే నియమ వ్రత ధారణం, ఉపవాసం, దమము, శమము.. మనిషిలోని నిష్ఠను పెంచుతాయి. ఇక పూజనం అంటే దేవతలను పూజించడం. వనసేవనం అంటే వనంలో ఉండే రావిచెట్టును విష్ణువుగా, వటవృక్షాన్ని పరమశివునిగా, పాలాశమును (మోదుగు చెట్టును) బ్రహ్మదేవునిగా, ధాత్రీ వృక్షమును సకలదేవతా స్వరూపంగా భావించి పూజించి ఈ ఉత్సవాన్ని చేసుకోవాలి.


ధర్మాన్ని, ఆచారాలను పాటించడం ధర్మలక్షణంగానే చెప్పారు. అలాగే ఈ మాసంలో నియతంగా ఆహారాన్ని తీసుకోవాలి. అంటే హితవైన ఆహారాన్ని మితంగా స్వీకరించడం. ఇక పురాణ పఠనం.. అంటే పురాణ ప్రవచనం చేసే పండితుని వేదవ్యాసుడిగానే భావిస్తూ కార్తిక మాసం గురించి ఆ పండితుడు చెప్పే విషయాలను పాటిస్తే మనో, బుద్ధి, అహంకార, చిత్తముల వికాసం ఏర్పడుతుంది.




ఆచార్య రాణి సదాశివ మూర్తి

Updated Date - 2020-12-01T09:23:48+05:30 IST