Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాదాద్రిలో ‘కార్తీక’ ఏర్పాట్లు

 ఆలయ వేళల్లో మార్పు 

బాలాలయంలో అన్నకూటోత్సవం  

యాదాద్రి టౌన్‌, నవంబరు 18: యాదాద్రీశుడి సన్నిధిలో కార్తీక పౌర్ణమికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీకమాసం, పౌర్ణమి తిథి రోజున హరిహరులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థాన అధికారులు క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. కార్తీక పౌర్ణమి నుంచి మరో మూడురోజులపాటు క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తుల సౌకర్యార్థం బాలాలయంలో కవచమూర్తుల దర్శన వేళలు, నిత్యారాధనల సమయాల్లో మార్పులు చేశారు. శుక్రవారం వేకువజామున మూడు గంటలకే ఆలయాన్ని తెరిచి గంట ముందుగానే నిత్యవిధి కైంకర్యాలు ప్రారంభించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. బాలాలయంలో మధ్యాహ్నం అన్నకూటోత్సవం, మధ్యాహ్న రాజభోగం, రాత్రి 7గంటల వరకు భక్తులకు ఉభయదర్శన సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణ సేవలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిధిగా కొనసాగుతాయన్నారు. బాలాలయం వెనుక భాగంలో మహిళా భక్తులు కార్తీక దీపారాధనలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ హరిహరుల దర్శనాలు, ఆర్జిత సేవోత్సవాల్లో పాల్గొనాలని సూచించారు. కొండపైన ఆలయ పునర్నిర్మాణ పనులు కారణంగా తగినంత పార్కింగ్‌ సౌకర్యాలు లేవని, కొండకిందే వాహనాలను పార్కింగ్‌ చేయాలని అధికారులు సూచించారు. భక్తులకు సరిపడా పులిహోర, లడ్డూ, వడ ప్రసాదాలు అందుబాటులో ఉంటాయని, భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాల కౌంటర్లను కొండకింద పాతగోశాల ప్రాంతంలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యాదాద్రీశుడి సన్నిధిలో కార్తీక పౌర్ణమి రాత్రివేళ ఆకాశ దీపోత్సవం సంప్రదాయరీతిలో నిర్వహించనున్నారు. బాలాలయం వెనుక మహిళా భక్తులు కార్తీక దీపారాధనలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు.  


పాతగోశాలలో వ్రతపూజల ఏర్పాట్లు

తెలంగాణ అన్నవర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రిక్షేత్రంలో పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. ఆలయ విస్తరణ పనుల కారణంగా వ్రతపూజలను కొండకింద పాతగోశాల వద్దనున్న రెండు హాళ్లలో నిర్వహించనున్నారు. వ్రతపూజల టిక్కెట్టు కౌంటర్లు, పూజా సామగ్రి అందజేసే కౌంటర్లను ఏర్పాటు చేశారు. సుమారు 3వేల వ్రతపూజలకు సరిపడా సామగ్రిని అధికారులు సిద్ధంచేసినట్లు తెలిపారు.


మత్స్యగిరీశుడికి అలంకారోత్సవం

 వలిగొండ మండలం వెంకటాపురంలో కొలువైన శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహుడి కల్యాణం తదుపరి ఘట్టం అలంకారోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి ప్రత్యేకపూజలు చేశారు. నూతన ధృవమూర్తికి 108కలశాలతో పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు  నిర్వహించారు. ఉత్సవ మండపంలో స్వామి, లక్ష్మీదేవిని ముత్యాల పల్లకిలో అధిష్ఠింపజేశారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో స్వామివారిని అందంగా అలంకరించారు. అర్చకులు ముందు నడుస్తుండగా పురవీధుల్లో పల్లకిలో ఊరేగించారు.  శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన ఉగ్రరూపంలో స్వామివారు అవతరించారని, ఉగ్రరూపుడిని సమస్త దేవతలు స్తుతించి చతుర్విద పారాయణాలు చేసి శాంతింపజేశారని అర్చకులు తెలిపారు. దుష్ట శక్తులను సంహరించి భక్తుల కోర్కెలు తీర్చేందుకు స్వామివారు మత్స్యగిరి కొండపైన కొలువుదీరాడని అర్చకులు వివరించారు. 


నృసింహక్షేత్రంలో భక్తుల సందడి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం కార్తీక భక్తుల సందడి నెలకొంది. పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు హరిహరులను దర్శించుకుని ఆర్జిత సేవోత్సవాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి సన్నిధిలో సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో సుమారు 394 మంది దంపతులు పాల్గొన్నారు. స్వామికి వ్రతపూజల ద్వారా రూ.1.97లక్షల ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. యాదాద్రీశుడికి నిత్యవిధి కైంకర్యాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. బాలాలయంలో కవచమూర్తులకు హారతి నివేదించిన అర్చకులు ఉత్సవమూర్తులను అభిషేకించి అర్చించారు. అనంతరం హోమం నిత్య తిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. కొండపైన రామలింగేశ్వరుడికి, దర్శన క్యూకాంప్లెక్స్‌లో కొలువుదీరిన చరమూర్తులకు నిత్యారాధనలు స్మార్త సంప్రదాయరీతిలో కొనసాగాయి. స్వామికి వివిధ విభాగాల ద్వారా రూ.11,29,682 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. విమాన గోపురం బంగారు తాపడంకోసం దేవస్థాన ఈఈ ఊడెపు రామారావు రూ.50వేల చెక్కును ప్రధానకార్యాలయంలో ఈవో గీతారెడ్డికి అందజేశారు. యాదాద్రీశుడిని ఉత్తరాఖండ్‌ హైకోర్టు జడ్జి నారాయణసింగ్‌ ధనిక్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఇరిగేషన్‌ ఈఎన్‌సీ హరిరామ్‌, డిప్యూటీ ఈఎన్‌సీ అనితలు స్వామివారిని దర్శించుకున్నారు.  వీరి వెంట ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ వేణుగోపాల్‌రావు తదిరులున్నారు. ఉమ్మడి జిల్లా సెషన్స్‌ జడ్జీ జగ్జీవన్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు.  

Advertisement
Advertisement