Abn logo
Dec 1 2020 @ 00:44AM

కార్తీక శోభ

సంగారెడ్డి పట్టణంలోని పార్వతీ సంగమేశ్వరాలయంలో పూజలు నిర్వహిస్తున్న కలెక్టర్‌ హన్మంతరావు

ఆలయాలకు పోటెత్తిన భక్తులు 

పూజల్లో పాల్గొన్న సంగారెడ్డి, కామారెడ్డి కలెక్టర్లు హన్మంతరావు, శరత్‌, ప్రజాప్రతినిధులు

సంగారెడ్డి రూరల్‌, నవంబరు 30 : సంగారెడ్డి పట్టణంలోని శివాజీనగర్‌లో పార్వతీ సంగమేశ్వరాలయం, రాజంపేటలోని రాజరాజేశ్వరాలయం, మండలంలోని కలబ్‌గూర్‌లో గల త్రికుటాలయం, పోతిరెడ్డిపల్లిలోని సంగమేశ్వరాలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు ఉదయం 6 నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరారు. ఆలయాల్లో మహిళలు మర్రిచెట్టు వద్ద దీపాలు వెలిగించి తమ కుటుంబాల్లో సుఖశాంతులు నింపాలని వేడుకున్నారు. పట్టణంలోని పార్వతీ సంగమేశ్వరాలయంలో కలెక్టర్‌ హన్మంతరావు సతీసమేతంగా పూజలు నిర్వహించి శివలింగానికి అభిషేకం చేశారు. సంగారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజలయక్ష్మి ఆలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్‌, ప్రధానార్చకులు సతీ్‌షశర్మ, వైస్‌ చైర్మన్‌ నక్క నాగరాజుగౌడ్‌ కలెక్టర్‌ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. 

కేతకీలో కార్తీకమాస పూజలు 

ఝరాసంగం, నవంబరు 30 : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఆలయ ఆవరణలో పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని వేద మంత్రోశ్ఛరణల మధ్య నిర్వహించారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌ ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేకం పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను  అందజేశారు. 

నారాయణఖేడ్‌ : పట్టణంలోని కాశీనాథ్‌ ఆలయంలో ఆధ్యాత్మిక సేవకులు విజయ్‌బుజ్జి ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. 

జహీరాబాద్‌ : జహీరాబాద్‌, కోహీర్‌, ఝరాసంగం, న్యాల్‌కల్‌, మొగుడంపల్లి, రాయికోడ్‌ మండలాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని సోమేశ్వరాలయం, సిద్ధేశ్వరాలయం, శివాలయం, యిబాబా ఆలయం, దత్తగిరి ఆశ్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన వేడుకల్లో కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌, సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. 

నాగల్‌గిద్ద : నాగల్‌గిద్ద శివాలయంతో పాటు కర్‌సగుత్తిలో గల పాండురంగ ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. మహిళలు ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. 

వట్‌పల్లి : మండలంలోని ఆయా గ్రామాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. 

గుమ్మడిదల : జిల్లాలో శైవక్షేత్రాల్లో ఒకటైన బొంతపల్లి వీరన్నగూడెం వీరభద్రస్వామి ఆలయాల్లో కార్తీకశోభ సంతరించుకున్నది. పలువురు దంపతులు పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. 

హత్నూర : మండల కేంద్రమైన హత్నూర ఐటీఐ కాలనీలో నిర్మించిన శివాలయంలో శివలింగం ప్రతిష్టాపన, పూర్ణాహుతి హోమం, దీపారాధన, అభిషేకం నిర్వహించారు. సుందరమ్మదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మాధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రంలో దత్తాత్రేయస్వామికి, దౌల్తాబాద్‌లోని స్ఫటిక లింగేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. 

Advertisement
Advertisement