Abn logo
Nov 27 2020 @ 00:09AM

కార్తిక పరంజ్యోతి!

కార్తిక మాసం అనగానే దీప కాంతులు కళ్ళ ముందు మెదుల్తాయి.  ఈ మాసంలో దీపాలు పెట్టడం, దీపాలను దానం చెయ్యడం, దీపకాంతిని దర్శించడం పరమ పుణ్యప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపంలో తేజోరూపుడై ఉన్న పరమాత్మను ఆరాధన చేస్తూ,  అంతర్గత సంస్కారాన్ని పొందడానికీ, అంతటా ఈశ్వర దర్శనం చేయగలిగే  మహోన్నతమైన స్థితికి చేరుకోవడానికీ ప్రతీక కార్తిక దీపం. అదే ఈ దీపోత్సవాల్లోని అంతరార్థం. కార్తిక పౌర్ణమి నాడు వెలిగించే దీపం మనం చేసే దుష్కృతులనూ, మన  పాపాలనూ,అంతర తిమిరాన్నీ, బాహ్య తిమిరాన్నీ పోగొట్టి, లోకోపకారం చేసి, సమస్త జీవులనూ ఉద్థరించడానికి పెట్టే దీపం.


ఆధ్యాత్మిక నిర్వచనం

దీపం యథార్థంగా పరమేశ్వర స్వరూపం. మీరు ఏ సహస్ర నామమైనా చదవండి... ఎక్కడ చూసినా మీకో నామం ఉంటుంది- ‘పరంజ్యోతీ’ అని. పరంజ్యోతి నపుంసక నామం. విశ్వంలో ఈశ్వరుడు స్త్రీనా, పురుషుడా, నపుంసకుడా అని అడిగారనుకోండి. అసలు ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. ఈశ్వరుడు కాంతి స్వరూపి. ఆయన ఎప్పుడూ మన వెనుక వెలుగుతూ ఉంటాడు. 


పోతనగారు భాగవత రచన చేస్తూ ‘స్త్రీ, పురుష, నపుంసక ముక్తిలోకాక, క్రియ అక్రియ వరాహమూర్తియు కాక... వెనుక వుండు తాను విభుతలంపు’ అంటారు. వెనుక ఉండి ప్రకాశిస్తూ, మన శరీరాన్ని ఎంతకాలం నిలబడాలో అంత కాలం ఊపిరిని చిత్రంగా నిలిపి, గుప్తంగా నిలబెట్టి ఆ ఊపిరి అయిపోగానే బయటకు వెళ్ళి శివాన్ని శవం చేసి పడగొట్టగలిగిన పరమేశ్వర స్వరూపమే ఇక్కడ కూర్చుని ఉంది. అది ‘భా’... అంటే కాంతి. అందుకే పూజ అంతా అయిపోయిన తరువాత మంత్రపుష్పంలో చెప్తారు... ‘నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా’ అని. ఆయన అణువంత రూపంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ కాంతి పైకీ, కిందికీ, పక్కలకూ కొడుతోంది. దాన్ని ఏ పేరు పెట్టి పిలవాలి? బయట ఏమీ లేదు. ‘సబ్రహ్మ సశివః సహరిః సేంద్ర సోక్షర పరమః స్వరాట్‌’... నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా అది పలుకుతుంది.


యదార్థానికి అది రూపం కాదు అది ఒక కాంతి. ఒక పెద్ద వెలుగు ముద్ద ఒకటి ఇక్కడ కూర్చొని ఉంది. ఆ వెలుగుల ముద్ద పైకీ, పక్కలకూ, కిందికీ కాంతిని కొడుతోంది. ఆ కాంతి ఏదో అదే పరమేశ్వరుడు. నువ్వు సాకారం చేస్తే... నువ్వు ఎలా కావాలంటే అలా కనబడతాడు. నిజానికి ఆయనకొక ఆకారమెక్కడుంది? ‘ఆకారంచ నిర్గుణంచ, సాకారంచ గుణకరం తత్త్వం తత్త్వం...’ అంటారు శంకరాచార్యుల వారు. నిర్గుణం, సగుణం అని రెండు రకాలు. నిర్గుణంలోకి వెళ్ళాలన్నవాడు పరమ వైరాగ్యంలోకి వెళతాడు. సాధారణ ఉపాసన చేసేవాడు, బాహ్య ప్రయోజనం కావాలనుకొనేవాడూ మనస్సును నిలబెట్టాలి. కాబట్టి ఒక ఆకారానికి పూజ చేస్తాడు. యథార్థానికి అది ఒక కాంతి పుంజం. ఆ కాంతి పుంజమే దివ్వె. దీపం, అంటే ప్రకాశం. ఆ దీపమే పరమేశ్వర స్వరూపం.

అరుణగిరిపై కృత్తికా దీపం

కార్తిక మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడిన పౌర్ణమి ఉండే మాసం కాబట్టి దీన్ని ‘కార్తిక మాసం’ అన్నారు. ఈ మాసంలో ఎక్కడ చూసినా దీపమే కనిపిస్తుంది. సాధారణంగా అన్ని ఆలయాల్లో అన్ని తిథులకూ ప్రాశస్త్యం ఉండదు. కానీ కార్తిక మాసంలో శివాలయాల్లో, విష్ణు ఆలయాల్లో, అంబికా ఆలయంలో, మఠాల ప్రాంగణాల్లో... ఇలా నాలుగు చోట్లా దీపాలు పెడతారు. ఏడాదిలో పన్నెండు నెలలున్నా ఏ నెలలో పెట్టే దీపానికి ఆ నెల పేరు లేదు. ఒక కార్తిక మాసంలో పెట్టే దీపానికే ‘కార్తికదీపం’ అని పేరు. ఈ మాసంలో పెట్టే ఒక్కొక్క దీపానికీ ఒక్కొక్క ప్రాధాన్యం ఉంది.


ఇంట్లో కార్తిక దీపం పెడితే పౌర్ణమి తిథి ప్రధానం. దేవాలయ ప్రాంగణాల్లో అయితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ తమిళనాడులోని అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. ఆ కృత్తికా దీపోత్సవం చూసేందుకు కొన్ని లక్షల మంది వస్తారు. ఆ రోజున గిరి ప్రదక్షిణ చేయడానికి అక్కడ అవకాశమే ఉండదు. కొండ చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తం జనంతో నిండిపోతుంది. అందరూ వెలుగుతున్న దీపం ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కరిస్తారు. భగవాన్‌ రమణ మహర్షి అంతటివారు కూడా అసురసంధ్యవేళ అయ్యేసరికి బయటకు వచ్చి, చెక్క సోఫాలో పడుకొని, అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఆయనే మహా జ్యోతి స్వరూపుడు. అయినా సరే, ఆయన ఆ జ్యోతిని చూసేందుకు అక్కడికి వచ్చి నిలబడేవారు. జ్యోతిని చూసి నమస్కరిస్తూ ఉండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండే అగ్నిలింగం. కాబట్టి అక్కడ కొండ మీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి.

ఉపనిషత్తుల్లో...

దీపం గురించి ఉపనిషత్తు ఒక మాట చెబుతుంది. ఆ దీపమే పరమేశ్వరుడు. ‘న సూర్యోభాతి న చంద్రతారకం నేమా ద్యుతోభాతి కుతో... త్వమేవ భాంతి మనుభాత సర్వం ఇతి భాసా సర్వమితవ్య భాసం’ అంటుంది. ఆయన... ఆ పరమేశ్వరుడు ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్య చంద్రులు ప్రకాశించరు. ఎందుకంటే ఆ వెలుగు ముందు ఈ వెలుగు పని చెయ్యదు. కాబట్టి ఆయన ఒక్కరే ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రకాశిస్తున్న ఆ కాంతిపుంజం... అదొక్కటే పరమేశ్వర స్వరూపం.


కార్తిక పౌర్ణమి నాడు 365 దీపాలు ఎందుకు?

కార్తిక పౌర్ణమి రోజున ప్రతి వాళ్ళూ తమ ఇళ్ళలో దీపం పెట్టుకుంటారు. ఆ రోజు గుత్తి దీపాలు కూడా పెడతారు. దీనికి కారణాలు రెండు. ఒక ఇల్లు కడితే ఆ ఇంట దీపం లేకుండా ఒక్క రోజూ ఉండకూడదు. మనం కట్టుకున్న ఇంటికి తాళం పెట్టి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఇంటి పురోహితుణ్ణి పిలిచి- ‘‘మా పూజామందిరంలో దీపం వెలిగించి, స్వామికి నైవేద్యం పెట్టండి’’ అని చెప్పి. ఇంటి తాళం ఇచ్చి వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది.


ఇంట దీపం వెలగలేదు అంటే అది పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. ‘స్వగృహే’ అని ఎక్కడ కూర్చొని సంకల్పం చెప్పుకుంటామో అక్కడ అన్ని చోట్లా దీపం వెలగాలి. మనకు అలా దీపం వెలగకపోతే దోషం మనకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా లభించిన అద్భుతమైన తిథి కార్తిక పౌర్ణమి. అందుకే కార్తిక పౌర్ణమి నాడు 365 వత్తులను ‘గుత్తిదీపం’ అని ఆవునేతిలో ముంచి వెలిగిస్తారు. పది రోజులో, పదిహేను రోజులో, అంతకుముందెప్పుడో తప్పు చేసిన రోజులు ఎన్ని ఉన్నాయో... ఈ ఏడాదంతా దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో... అదంతా పోవాలని ఆ 365 దీపాలు వెలిగిస్తారు.

శివకేశవాద్వైత కాంతి!

కార్తిక మాసం హరిహరులకు ప్రియమైన మాసం. ఈ మాసంలో చేసే నిత్య దీపారాధన పరమ శుభప్రదం. అది అనంతమైన ఫలాలను ఇస్తుందన్నది శాస్త్రవచనం.


‘న కార్తిక సమో మాసః న దేవః కేశాత్పరమ్‌

న చ వేద సమం శాస్త్రం నతీర్థం గంగాయాన్వయమ్

అని స్కాంద పురాణంలో ప్రస్తుతించాడు వ్యాసమహర్షి. కార్తిక మాసంతో సమానమైన మాసం కానీ, శ్రీహరితో సముడైన దైవం కానీ, వేదాలతో సమానమైన శాస్త్రం కానీ, గంగకన్నా పుణ్యప్రదమైన నది కానీ లేవని దీని అర్థం. అంతేకాదు, ముప్ఫై అధ్యాయాల్లో కార్తిక మాస మహిమాదిక విశేషాలను వివరించాడు. 


ఈ మాసంలోని ముప్ఫై దినాల్లో... ఉభయ సంధ్యల్లో కోట్లాది భక్తులు యథాశక్తిగా ఇళ్లలో, దేవాలయాల్లో, వనాల్లో, నదీ తీరాల్లో దివ్యమైన కార్తిక దీపాలను వెలిగిస్తారు. ‘ఓం దీప లక్ష్మీ నమోస్తుతే’, ‘దీపం జ్యోతిః మహేశ్వరః, దీపం జ్యోతిః జనార్దనః’ అని ప్రార్థిస్తారు. తమలోని అజ్ఞానపు చీకట్లను తొలగించి, పారమార్థిక భక్తి, జ్ఞాన కాంతులను హృదయాల్లో నింపాలని కోరుకుంటారు. ఈ మాసంలోని ప్రతి దినమూ పుణ్య, మోక్షదాయకమైన పర్వదినమే! 


‘మాసానాం కార్తికం శ్రేయంః...’ ఎంతో శ్రేయోదాయకమైన కార్తిక మాసంలో దీపాలను వెలిగించడం అనాది సంప్రదాయం.


దీపం త్రిమూర్తి స్వరూపమనీ, త్రిశక్తి స్వరూపమనీ శాస్త్రాలు పేర్కొన్నాయి. దీపకాంతుల్లోని నీలం రంగు కాంతి శ్రీ మహావిష్ణువుకూ, తెల్ల రంగు కాంతి శివునికీ,  పసుపు పచ్చరంగు కాంతి బ్రహ్మకూ చిహ్నాలనీ, అలాగే గౌరి, సరస్వతి, లక్ష్మి అనే ముగ్గురమ్మలకు ప్రతీకలనీ చెబుతారు.


దీపారాధన శివ కేశవులకు ప్రీతిప్రదమైనది. అది శివకేశవాద్వైత భావనను హృదయాల్లో ప్రకాశింపజేస్తుంది. 


‘శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే’...

‘శివస్య హృదయం విష్ణుంః విష్ణోశ్చ హృదయం శివః’...

అంటే శివుడే కేశవుడు. కేశవుడే శివుడు. ఆ ఇద్దరి హృదయాలూ శివకేశవాత్మక అద్వైతామృతమయాలు. అలాంటి శివకేశవాత్మక అద్వైత కాంతిమయమైన మాసం కార్తికం. 

- ‘కళ్యాణశ్రీ’ జంధ్యాల వేంకట రామశాస్త్రి

ధ్వజస్తంభం మీద ఆకాశదీపం

కార్తిక మాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశ దీపాలు? వాటిని మనం వెలిగించనక్కరలేదు. ఆకాశదీపాలను వెలిగించిన వాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు... ఇవి ఆకాశ దీపాలు. కార్తిక మాసంలో ఆకాశ దీపాలను దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి, ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి, గాలికి అది ఆరిపోకుండా రంధ్రాలు ఏర్పాటు చేసి, జాగ్రత్తగా, భగవంతుడి నామాలు చెబుతూ, ఆ దీపాన్ని పైకెత్తుతారు. భక్తులు తమ శక్తి మేరకు చమురో, వత్తులో ఇస్తూ ఉంటారు.


దీపాన్ని పైకి ఎత్తడానికి కారణం ఏమిటంటే... ధ్వజస్తంభం మీద ఉండే దీపం అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదికి ఏదైనా లాగితే పతాకాన్ని ఆరోహణ చేసినట్టు. అంటే ఈశ్వరుడి ఉత్సవం జరుగుతోందని గుర్తు. కార్తిక మాసంలో మనకు మనమే ఉత్సవం చేసుకుంటున్నాం. ‘ఉత్‌’ అంటే తల పైకెత్తడం. తల పైకెత్తి చూశాం కాబట్టి ఉత్సవం. దీపాన్ని గదిలో పెడితే కొంతే ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి పెడితే విశేష పలితం. అందుకే కార్తిక పౌర్ణమి రోజున గుత్తి దీపాలు పెడతారు. ఆ రోజు ప్రదోష వేళ... ‘దామోదరమావాహయామి’ అని కానీ, ‘త్రయంబకమావాహయామి’ అని కానీ చెబుతూ దీపం వెలిగించాలి.

‘కార్తిక మాస వైభవం’ పుస్తకం నుంచి...బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ

Advertisement
Advertisement
Advertisement