కార్తికేయుని క్రౌంచగిరి!

ABN , First Publish Date - 2021-03-19T05:30:00+05:30 IST

చుట్టూ కొండలు, వన్యప్రాణులు యథేచ్ఛగా సంచరించే దట్టమైన అడవి. ఖనిజ నిక్షేపాలకు పెట్టింది పేరైన ప్రాంతం. అదే కర్ణాటకలోని క్రౌంచగిరి. ఆ కొండ మీద కొలువైన సుబ్రహ్మణ్యస్వామి భక్తులకు అభయప్రదాతగా నిలుస్తున్నాడు

కార్తికేయుని క్రౌంచగిరి!

చుట్టూ కొండలు, వన్యప్రాణులు యథేచ్ఛగా సంచరించే దట్టమైన అడవి. ఖనిజ నిక్షేపాలకు పెట్టింది పేరైన ప్రాంతం. అదే కర్ణాటకలోని క్రౌంచగిరి. ఆ కొండ మీద కొలువైన సుబ్రహ్మణ్యస్వామి భక్తులకు అభయప్రదాతగా నిలుస్తున్నాడు.


ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మహిళలకు, దళితులకు ప్రవేశంపై నిషేధం కొనసాగింది.  పంతొమ్మిదివందల ముప్ఫైల్లో దళితులకూ, పంతొమ్మిదివందల తొంభై ఆరులో మహిళలకూ ఆలయ ప్రవేశాన్ని సండూర్‌ రాజవంశీకులు అనుమతించారు.

 

కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలోని క్రౌంచగిరి ఆలయానికి పన్నెండువందల ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. సందూరుకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో... స్వామిమలై అటవీ ప్రాంతంలో నెలకొన్న ఈ ఆలయం ఆధ్యాత్మికతకూ, ప్రకృతి సంపదకూ ఆలవాలంగా నిలుస్తోంది. ‘క్రౌంచ దారణుడు’ అంటే కుమారస్వామి. ఆయన పేరుతో దీనికి ‘క్రౌంచగిరి’ అనే పేరు వచ్చింది. దీర్ఘ వృత్తాకారంలో కనిపించే ఈ కొండల మధ్య కార్తికేయుడు కొలువయ్యాడు. దక్షిణాదిలో ఇదే మొదటి సుబ్రహ్మణ్య ఆలయం అనే విశ్వాసం ఉంది. చాళుక్యుల కాలంలో దీన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. 


కొండ మధ్య నుంచీ ఇరుకైన దారిలో సందర్శకులు ప్రయాణించాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామికీ, తారకాసురుడికీ యుద్ధం జరిగిన ప్రదేశం ఇదేననీ, పాతాళంలో దాక్కొని ఉన్న రాక్షసులను సంహరించడానికి కార్తికేయుడు బాణాన్ని వదిలాడనీ, ఆ బాణం దూసుకువెళ్ళిన మార్గమే ఈ ఇరుకైన దారిగా ఏర్పడిందనీ పురాణ కథనం. మరో పురాణ గాథ ప్రకారం... శూరపద్ముడు అనే రాక్షసుడి తమ్ముడు క్రౌంచుడు. 


అతను తారకాసురుడి అనుచరుడు. క్రౌంచుడు కొండ రూపంలోకి మారేవాడు. ఆ కొండకు ఎన్నో దారులు ఉండేవి. మునులు, సాధువులు, సామాన్య జనం ఆ దారుల్లో ప్రయాణించినప్పుడు, వారిని క్రౌంచుడు పట్టుకొని తినేవాడు. ఒకసారి ఆగస్త్య మహాముని ఆ కొండ దగ్గరకు వచ్చాడు. అది నిజమైన కొండ కాదనీ, అంతా రాక్షసమాయ అనీ ఆయన గ్రహించాడు. శాశ్వతంగా కొండలా మిగిలిపోతావనీ, రాక్షస శక్తులు కోల్పోతావనీ క్రౌంచుణ్ణి శపించాడు. అగస్త్యుణ్ణి క్రౌంచుడు వేడుకోగా, సుబ్రహ్మణ్యస్వామి బాణం తగిలినప్పుడు అతనికి ముక్తి లభిస్తుందని చెప్పాడు. తారకాసురుణ్ణి, శూరపద్ముణ్ణి సంహరించడానికి దక్షిణాపథానికి దేవతల సైన్యంతో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి తన బాణాన్ని ఆ కొండ మీదకు వదిలాడు. దీనితో క్రౌంచుడికి శాపవిముక్తి కలిగింది. ఈ ఘటనకు గుర్తుగా ఆ కొండ క్రౌంచగిరిగా ప్రాచుర్యంలోకి వచ్చిందని ఆ కథ వెల్లడిస్తోంది. ఈ ఆలయ ఆవరణలోనే పార్వతీదేవి, వినాయకుల ఆలయాలు ఉన్నాయి. వీటిలో పార్వతి ఆలయం అత్యంత పురాతనమైనదని విశ్వాసం. దాదాపు వెయ్యేళ్ళకు పైగా ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మహిళలకు, దళితులకు ప్రవేశంపై నిషేధం కొనసాగింది. 1930ల్లో దళితులకూ, 1996లో మహిళలకూ ఆలయ ప్రవేశాన్ని సండూర్‌ రాజవంశీకులు అనుమతించారు.

Updated Date - 2021-03-19T05:30:00+05:30 IST