కాశీ విశ్వనాథ్, మధుర దేవాలయాలు కూడా విముక్తి పొందాలి : కర్ణాటక మంత్రి

ABN , First Publish Date - 2020-08-06T00:21:17+05:30 IST

అయోధ్యలో రామాలయానికి భూమి పూజ వైభవంగా జరగడంతో బీజేపీ నేతలు

కాశీ విశ్వనాథ్, మధుర దేవాలయాలు కూడా విముక్తి పొందాలి : కర్ణాటక మంత్రి

శివమొగ్గ : అయోధ్యలో రామాలయానికి భూమి పూజ వైభవంగా జరగడంతో బీజేపీ నేతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపై కాశీ విశ్వనాథుని దేవాలయం, మధురలోని శ్రీకృష్ణ దేవాలయాలను విముక్తి చేయడం కోసం పోరాటం జరుగుతుందనే సంకేతాలు ఇస్తున్నారు. 


కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప బుధవారం మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథుని దేవాలయం, కృష్ణ జన్మస్థానం దేవాలయాలను కూడా విముక్తి చేయవలసి ఉందన్నారు. 


రామాలయానికి శంకుస్థాపన చేసిన ఈ రోజు చాలా శుభ దినమని చెప్పారు. అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామాలయం నిర్మితమవుతుందని చెప్పారు. అయితే  విముక్తి చేయవలసినవాటిలో కాశీ విశ్వనాథుని దేవాలయం, కృష్ణ జన్మస్థానం దేవాలయాలు కూడా ఉన్నాయన్నారు. 


మధురలోని కృష్ణ దేవాలయంలోనూ, వారణాసిలోని కాశీ విశ్వనాథుని దేవాలయంలోనూ బానిసత్వ సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. ఈ రెండు దేవాలయాల కోసం యావత్తు దేశం కలలు కంటోందని చెప్పారు. తాను ఈ రెండు దేవాలయాలను సందర్శించినట్లు తెలిపారు. అవి బానిసత్వంలో ఉన్నట్లు, అక్కడి మసీదులు పవిత్ర ప్రదేశంలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. మధురలోని దేవాలయంలో గోడను చూసినపుడు మనం ఇంకా బానిసలుగానే బతుకుతున్నట్లు అనిపిస్తుందన్నారు. అయోధ్య విషయంలో హిందువుల కల నెరవేరిందని చెప్పారు. ఏదో ఓ రోజు కాశీ, మధుర విషయంలో కూడా కలలు సాకారమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడు, కాశీ విశ్వనాథుడు విముక్తి పొందుతారని, దేవాలయాలు నిర్మితమవుతాయని అన్నారు.


Updated Date - 2020-08-06T00:21:17+05:30 IST