Prime minister కోసం..

ABN , First Publish Date - 2021-11-26T13:05:41+05:30 IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదిన వేడుకలను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మాజీ జోన్‌ చైర్మన్‌, మద్రాసు హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వి.గిరినాథ్‌ విభిన్న తరహాలో సేవాధృక్పథంతో నిర్వహిస్తున్నారు.

Prime minister కోసం..

                 - కాశీ యాత్రకు బయల్దేరిన మూడవ బృందం


ప్యారీస్‌(చెన్నై): భారత ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదిన వేడుకలను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మాజీ జోన్‌ చైర్మన్‌, మద్రాసు హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వి.గిరినాథ్‌ విభిన్న తరహాలో సేవాధృక్పథంతో నిర్వహిస్తున్నారు. ‘ఇంటింటికి వెళదాం...మనసులు దోచుకుందాం’ అనే కార్యక్రమానికి బలం చేకూర్చేలా ఇప్పటివరకు స్థానిక హార్బర్‌, ట్రిప్లికేన్‌ శాసనసభ నియోజకవర్గాలకు చెందిన 142 మంది నిరుపేదలను రెండు విడతలుగా దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీకి సొంత ఖర్చులతో పంపించారు. మూడవవిడతగా గురువారం థౌజండ్‌లైట్స్‌ నియోజకవర్గానికి చెందిన 71 మంది భక్తులు నుంగంబాక్కం లేక్‌ ఏరియాలో ఉన్న మేయర్‌ సంబంధం హాలులో ప్రత్యేక పూజలు నిర్వహించి కాశీ యాత్రకు బయల్దేరి వెళ్లారు. వారికి గిరినాథ్‌ రుద్రాక్ష మాల, బెడ్‌షీట్‌, మందులు తదితరాలతో కూడిన కిట్లు పంపిణీ చేశారు. యాత్రలో భాగంగా ఈనెల 27వ తేదీ కాశీ పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధిచెందిన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు జరుపుకుంటారు. అనంతరం గంగాహారతి, స్థానిక ఆలయాల సందర్శన అనంతరం మరుసటిరోజు 28న తిరుగుముఖం పడతారు. కాశీకి వెళ్లి రావాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటూ ఆర్ధికలేమి వల్ల ఆ కోరిక నెరవేరని పేద కుటుంబాల్లోని పురుషులు, మహిళలకు గిరినాథ్‌ పెద్ద మనసుతో మూడు విడతలుగా కాశీని సందర్శించేందుకు అవకాశం కల్పించడం అభినందనీయమని రాష్ట్ర బీజేపీ నాయకులు చంద్రన్‌, ఎ.వెంకట్రావు తదితరులు అభినందించారు.

Updated Date - 2021-11-26T13:05:41+05:30 IST