కాసులిస్తే చాలు.. ఆర్‌ఈసీ‘ఎస్‌’

ABN , First Publish Date - 2021-09-18T05:33:36+05:30 IST

గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌) అధికారుల రూటే సెపరేటు. కాసులిస్తే చాలు క్షణాల్లోనే పనులు జరిగిపోతాయి.

కాసులిస్తే చాలు.. ఆర్‌ఈసీ‘ఎస్‌’
రొయ్యల చెరువు వద్ద ఉన్న షెడ్డును కూల్చేసిన దృశ్యం (వృత్తంలో విద్యుత్‌ మోటారు)

ప్రభుత్వ స్థలంలో అక్రమంగా తవ్విన రొయ్యల చెరువులకు విద్యుత్‌ కనెక్షన్లు

నిబంధనలను పట్టించుకోని అధికారులు

విశాఖపట్నం, సెప్టెంబరు 17: గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌) అధికారుల రూటే సెపరేటు. కాసులిస్తే చాలు క్షణాల్లోనే పనులు జరిగిపోతాయి. సామాన్యుడు విద్యుత్‌ మీటరు కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం నిబంధనల పేరుతో నానా ఇబ్బందులు పెడతారు. ప్రభుత్వ స్థలంలో అడ్డగోలుగా తవ్విన రొయ్యల చెరువులకు మాత్రం ఆగమేఘాలపై విద్యుత్‌ సదుపాయం కల్పించి తమ విధేయతను చాటుకున్నారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. 

విద్యుత్‌ మీటర్‌ కోసం సామాన్యుడు దరఖాస్తు చేసుకుంటే సవాలక్ష కొర్రీలు పెట్టి కాలయాపన చేసే ఆర్‌ఈసీఎస్‌ అధికారులు ప్రభుత్వ భూమిలో అక్రమంగా రొయ్యల చెరువులు తవ్విన వారికి మాత్రం ఆగమేఘాలపై విద్యుత్‌ కనెక్షన్‌లు ఇచ్చేశారు. వాడచీపురుపల్లి పశ్చిమ రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 461/2లో గల 49.54 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి దర్జాగా రొయ్యల చెరువులు తవ్విన వారి కోసం రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో దర్జాగా రొయ్యల చెరువులు తవ్విన వ్యక్తులకు ఇక్కడ ఎలాంటి నిబంధనలు అడ్డురాలేదు. ఈ భూములకు ఆనుకుని వున్న మరో 83 ఎకరాల జిరాయితీ భూముల్లో కూడా అనధికారికంగా రొయ్యల చెరువులను నిర్వహిస్తుండగా వాటికి కూడా విద్యుత్‌ మీటర్లను ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే...

ఆర్‌ఈసీఎ్‌సలో కొంత మంది అధికారులు, సిబ్బంది మామ్మూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వీరి అక్రమాలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అడ్డగోలుగా రొయ్యల చెరువులు తవ్విన వ్యక్తులకు విద్యుత్‌ సదుపాయం ఏ ప్రాతిపదికన కల్పించారో వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ప్రయత్నించగా ఏఈ స్పందించలేదు.


Updated Date - 2021-09-18T05:33:36+05:30 IST