కటీక విషం

ABN , First Publish Date - 2021-11-24T05:42:01+05:30 IST

రంగు, రుచి వాసన ఉన్నదంతా సరైన తేనీరు(టీ)గా అనుకుంటాం.. కానీ ప్రస్తుత కల్తీ ప్రపంచంలో కంటికి కనిపించేది ఏదీ కూడా కల్తీ కాదనేందుకు అవకాశం లేకుండా పోతోంది..

కటీక విషం
సూర్యాపేటలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

 జిల్లాలో జోరుగా కల్తీ టీ పొడి విక్రయాలు 

తాజాగా 45 క్వింటాళ్లు స్వాధీనం

అనారోగ్యాల పాలవుతున్న ప్రజలు 

అధికారుల చోద్యం 

రంగు, రుచి వాసన ఉన్నదంతా సరైన తేనీరు(టీ)గా అనుకుంటాం.. కానీ ప్రస్తుత కల్తీ ప్రపంచంలో కంటికి కనిపించేది ఏదీ కూడా కల్తీ కాదనేందుకు అవకాశం లేకుండా పోతోంది.. జిల్లా కేంద్రంలో బయటపడ్డ కల్తీ టీ పొడి వ్యాపారం వినియోగదారులను విస్మయపరుస్తోంది. రసాయనాలతో తయారు చేస్తున్న టీ పొడి బహిరంగ మార్కెట్‌లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. తెలియని ప్రజలు వాటితో తయారు చేసిన  తేనీటిను  తాగి అనారోగ్యం పాలవుతున్నాడు. 

సూర్యాపేటక్రైం, నవంబరు 23 : జిల్లాలో కల్తీ టీ పొడి విక్రయం జోరుగా సాగుతోంది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఈ దందా వర్ధిల్లుతోంది. తాజాగా పోలీసులకు చిక్కిన ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న 45 క్వింటాళ్ల టీ పొడి వ్యాపారస్థాయిని చెబుతోంది. కల్తీని నిరోధించాల్సిన ఆహార నియంత్రణ శాఖ అధికారులు చుట్టపు చూపుగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో కల్తీ వ్యాపారం దర్జాగా సాగుతోంది.

పది కిలోల్లో కిలో కల్తీ...

ప్రాణాంతక రసాయనాల రంగుల పొడి (టార్టాజైన్‌)ని ఉపయోగించి కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నారు. 225 గ్రాముల చొప్పున లెమన్‌, ఆరెంజ్‌ రసాయన రంగు, 50గ్రాముల చాక్లెట్‌ రంగు, అరకిలో రసాయన టీ పొడిని రెండులీటర్ల నీటిలో పోసి అరగంట మరిగిస్తారు. అనంతరం ఆ ద్రావణాన్ని ఐదు కిలోల సాధారణ టీ పొడికి కలుపుతారు. దీంతో ఆరు కిలోల కల్తీ టీ పొడి తయారవుతుంది. ఈ రసాయన పొడిని తొమ్మిది కిలోల సాధారణ టీ పొడికి కిలో చొప్పున కలిపి ప్లాస్టిక్‌ కవర్లలో లేబుల్‌ లేకుండా ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తారు. ఈ నకిలీ టీ పొడి సూర్యాపేటలోని కొత్తబస్టాండ్‌, శంకర్‌విలాస్‌ సెంటర్‌, తాళ్లగడ్డ, పొట్టిశ్రీరాములు సెంటర్‌, వాణిజ్యభవన్‌ సమీపం లోని దుకాణాల్లో జోరుగా విక్రయిస్తున్నారు.

మూడేళ్ల కిందట 

మూడేళ్ల కిందట ప్రముఖ టీ బ్రాండ్‌ కంపెనీల పేరుతో సూర్యాపేటలో నకిలీ టీ ప్యాకెట్ల విక్రయం వెలుగుచూసింది.ఆ కంపెనీ ప్రతినిధులు పోలీసుల సహకారంతో తనిఖీ చేసి తమ బ్రాండ్ల పేరుతో ఉన్న 90 నకిలీ టీ పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో పోలీ సులు కేసులు నమోదు చేశారు.  

మూడు జిల్లాలకు ఒక్కరే అధికారి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు కలిపి ఒక్కరే ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు. సిబ్బంది సైతం తక్కువగానే ఉన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే తనిఖీలు చేస్తారు. అధికారుల నిర్లక్ష్యం వ్యాపారులకు ఆసరాగా మారింది. దీంతో నకిలీ, కల్తీ వ్యాపారాలు యదేచ్ఛగా సాగుతున్నాయి. 


కల్తీ టీ పొడి విక్రయ ముఠా అరెస్టు

సూర్యాపేటక్రైం: సాధారణ టీ పొడికి రసాయన రంగులు కలిపి కల్తీ టీ పొడిని తయారు చేసి, విక్రయాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. అదనపు ఎస్పీ రితిరాజ్‌తో కలిసి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి పట్టణంలోని తాళ్లగడ్డ, కొత్తబస్టాండ్‌ ప్రాంతాల్లోని దుకాణాల్లో దాడులు చేసి, టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ పొడిని ఆహార కల్తీ నియంత్రణ అధికారులు పరిశీలించగా కల్తీగా తేలింది. దీంతో కల్తీ టీపొడిని విక్రయిస్తున్న రాచకొండ అనిల్‌, పోకల రమేష్‌, బూర్ల వినయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు ఏపీలోని రాజమండ్రి, విజయవాడ, రావులపాలెం పట్టణాలకు చెందిన ముగ్గురు వ్యక్తుల నుంచి ఆ కల్తీ టీ పొడిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఏపీకి వెళ్లి కల్తీ టీ పొడి విక్రయిస్తున్న కృష్ణచైతన్య, కామేశ్వరరావు, జగన్నాథవెంకటరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తయారీ కేంద్రాల వద్ద ఉన్న సుమారు 44 క్వింటాళ్ల టీ పొడితో పాటు తయారీకి ఉపయోగించే రసాయనాలను, రంగులు, మిషన్లను స్వాధీనం చేసుకుని సూర్యాపేటకు తరలించారు. వీరిని విచారించగా సూర్యాపేటలో మరో ఆరుగురు వ్యాపారులకు కూడా కల్తీ టీ పొడిని విక్రయించినట్లు చెప్పారు. పోలీసులు ఆయా దుకాణాలపై దాడులు చేసి క్వింటాన్నర కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. తయారీదారులు, విక్రయదారులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు.  


Updated Date - 2021-11-24T05:42:01+05:30 IST