జవాన్ల ఇలాకా కట్కూర్‌

ABN , First Publish Date - 2022-01-14T05:30:00+05:30 IST

ఒకప్పుడు పీపుల్స్‌వార్‌ ఖిల్లాగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు ఆర్మీ జవాన్ల ఇలాకాగా మారింది. ఒకే ఊరి నుంచి దాదాపు వంద మందికిపైగా యువకులు సైన్యంలో తమ సేవలను అందిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్‌కు చెందిన యువత. ఉగ్రవాదుల దాడిలో తమ గ్రామానికి చెందిన ఒక జవాన్‌ వీరమరణం పొందినా వారిలో పట్టుసడలలేదు. ఆ జవాన్‌ చనిపోయిన తర్వాత మరో 25 మంది సైన్యంలో చేరి తమ దేశభక్తిని చాటుకున్నారు.

జవాన్ల ఇలాకా కట్కూర్‌

వంద మందికిపైగా సైనికులున్న గ్రామం

నాటి పీపుల్స్‌వార్‌ ఖిల్లా నుంచి నేడు దేశరక్షణకు సరిహద్దుల్లో యువకులు


అక్కన్నపేట, జనవరి 14: ఒకప్పుడు పీపుల్స్‌వార్‌ ఖిల్లాగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు ఆర్మీ జవాన్ల ఇలాకాగా మారింది. ఒకే ఊరి నుంచి దాదాపు వంద మందికిపైగా యువకులు సైన్యంలో తమ సేవలను అందిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్‌కు చెందిన యువత. ఉగ్రవాదుల దాడిలో తమ గ్రామానికి చెందిన ఒక జవాన్‌ వీరమరణం పొందినా వారిలో పట్టుసడలలేదు. ఆ జవాన్‌ చనిపోయిన తర్వాత మరో 25 మంది సైన్యంలో చేరి తమ దేశభక్తిని చాటుకున్నారు. 


ప్రస్తుతం 130 మంది సైనికులు

రాష్ట్రంలో ఎక్కడ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ జరిగినా కట్కూర్‌ గ్రామ యువత పోటీ పడాల్సిందే. ఈ ఊర్లో 900 కుటుంబాలు, 3,500 జనాభా. వీరిలో 170 మంది వరకు ఆర్మీ ఉద్యోగులు. వీరిలో 40 మంది విరమణ పొందారు. ప్రస్తుతం 130 మంది సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. కట్కూరు నుంచి 40 ఏళ్ల క్రితం జెర్రిపోతుల డేనియల్‌ మిలిటరీలో జవాన్‌గా చేరాడు. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది యువకులు దేశరక్షణలో భాగస్వాములవుతున్నారు. ఆర్మీలో రిక్రూట్‌మెంట్‌ అయిన వారిలో జవాన్‌, లాంచ్‌నాయక్‌, నాయక్‌, హావల్దార్‌, నాయక్‌ సుబేదార్‌ పోస్టుల వరకు పనిచేస్తున్నారు. కట్కూర్‌కు చెందిన పంజా సదయ్య తన గడువు పూర్తయినా ఇంకా సేవలందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన నాయక్‌ సుబేదార్‌స్థాయిలో హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. 


వీరమరణం పొందిన నరసింహనాయక్‌

కట్కూరు గ్రామపరిధిలోని రాజుతండాకు చెందిన గిరిజన యువకుడు నరసింహనాయక్‌ మిలటరీలో జవానుగా పని చేస్తూ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందాడు. ఛత్తీ్‌సఘడ్‌లోని సుక్మా జిల్లాలో 2014లో తీవ్రవాదులకు, సైనికులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నరసింహనాయక్‌ మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత గ్రామంలో తీవ్ర విషాదం అలుముకున్నా ఆ గ్రామ యువత మనోధైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేదు. ఆయన మరణానంతరం గ్రామానికి చెందిన యువకులు మరో 25 మందికి పైగా యువత మిలటరీలో చేరారు. 


ప్రతి దసరాకు స్వగ్రామానికి జవాన్ల రాక

దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లు ప్రతి దసరా పండుగకు సొంత ఊరైన కట్కూర్‌కు వస్తుంటారు. సుమారు 40 నుంచి 50 మంది జవాన్లు నెల రోజులు సెలవుపై వచ్చి వెళ్తుంటారు. ఆ సమయంలో ఇక్కడి యువతకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. 


ఆర్మీలో అన్నదమ్ములు

రాయపోల్‌ :ఆర్మీలోకి పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. అలాంటిది ఉన్న ఇద్దరు కొడుకులనూ సైన్యంలోకి పంపించారు ఆ దంపతులు. రాయపోల్‌ మండలంలోని మంతూరు గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఆర్మీలో చేరి దేశ సేవచేస్తున్న అన్నదమ్ములు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మంతూరుకు చెందిన పడిగె నర్సింహులు, జనమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఆంజనేయులు, నందీశ్వర్‌. జనమ్మ సోదరుడైన నీల చంద్రం పదిహేనేళ్లుగా ఆర్మీలో సేవలందిస్తున్నారు. మేనమామను స్ఫూర్తిగా తీసుకున్న ఆంజనేయులు, నందీశ్వర్‌ కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులకు విషయం చెప్పగా ఆ దంపతులు అడ్డు చెప్పలేదు. మేనమామ ప్రోత్సాహంతో ఆజాద్‌ డిఫెన్స్‌ అకాడమీ గజ్వేల్‌లో కోచింగ్‌ తీసుకున్నారు. సోదరులిద్దరూ 2018లో ఆర్మీకి సెలక్టయ్యారు. ఆంజనేయులు ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లోని అక్నూర్‌ సెక్టార్‌లో లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. నందీశ్వర్‌ ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నాడు. 

Updated Date - 2022-01-14T05:30:00+05:30 IST