కట్టా మృతి సాహిత్య, చారిత్రక రంగాలకు తీరని లోటు

ABN , First Publish Date - 2021-05-17T04:54:41+05:30 IST

చరిత్ర పరిశోధకులుగా, అవధానిగా, కవిగా, కైఫియత్తుల పరిష్కర్తగా విద్వాన్‌ కట్టా నరసింహులు ప్రసిద్ధులని... ఆయన మృతి సాహిత్య, చారిత్రక రంగాలకు తీరనిలోటని యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగాల సూర్యకళావతి పేర్కొన్నారు.

కట్టా మృతి సాహిత్య, చారిత్రక రంగాలకు తీరని లోటు

వైవీయూ ఉపకులపతి సూర్యకళావతి


కడప మారుతీనగర్‌ / నాగరాజుపేట / వేంపల్లె, మే 16: చరిత్ర పరిశోధకులుగా, అవధానిగా, కవిగా, కైఫియత్తుల పరిష్కర్తగా విద్వాన్‌ కట్టా నరసింహులు ప్రసిద్ధులని... ఆయన మృతి సాహిత్య, చారిత్రక రంగాలకు తీరనిలోటని యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మునగాల సూర్యకళావతి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక యర్రముక్కపల్లెలోని సీపీబ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో విద్వాన్‌ కట్టా నరసింహులు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సూర్యకళావతి మాట్లాడారు. కట్టా నరసింహులు సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులుగా, సలహామండలి సభ్యుడిగా భాషా పరిశోధన కేంద్రం అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. కడప జిల్లాకు సంబంధించిన కైఫియత్తులు పరిశోధన కేంద్రం పక్షాన వెలుగు చూడడంలో  ప్రముఖపాత్ర పోషించారన్నారు. ముఖ్యంగా ఆయన ఒంటిమిట్ట గురించి సమగ్రంగా పరిశోధించి రచించిన వ్యాసాల ఆధారంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒంటిమిట్టను రెండవ భద్రాద్రిగా అధికారికంగా గుర్తించి, శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు. ఆయన మరణం సీపీ బ్రౌన్‌ గ్రంథాలయానికి తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సలహా మండలి సభ్యుడు ఆచార్య దుర్భాక విజయరాఘవప్రసాద్‌, జానమద్ది విజయభాస్కర్‌, ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఎన్‌.ఈశ్వర్‌రెడ్డితో పాటు పలువురు కట్టా మృతికి సంతాపం తెలియజేశారు.  కాగా తెలుగు సాహితీ దిగ్గజం కట్టా నరసింహులు మృతి సమాజానికి, సాహితీ రంగానికి తీరని లోటని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి ప్రసాదించాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటనలో తెలియజేశారు. అలాగే కవితా విద్యా సేవా సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అలపర్తి పిచ్చయ్యచౌదరి, తెలుగుభాషా పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయికుమార్‌, ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్‌ కొండయ్య, ప్రముఖ సాహితీవేత్త గానుగపెంట హనుమంతరావు తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-05-17T04:54:41+05:30 IST