Abn logo
Mar 1 2021 @ 23:50PM

కట్టమైసమ్మ జాతరలో ఇష్టారాజ్యం

యథేచ్ఛగా అశ్లీల నృత్యాలు, గాంబ్లింగ్‌ ఆటలు

రూ.లక్షల్లో వసూలు చేసిన నిర్వాహకులు

ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులు

అశ్వారావుపేట, మార్చి 1: మండలంలోని నారాయణపురంలో జరుగుతున్న కట్టమైసమ్మ అమ్మవారి జాతర అశ్లీల నృత్యాలు, గాంబ్లింగ్‌ ఆటలతో హోరెత్తింది. అశ్లీల నృత్యాలు, గాంబ్లింగ్‌, ఇతర జూదాలకు ఉర్రూతలూగిన యువత జేబును గుల్ల చేసుకున్నారు. వీటిని నిరోధించాల్సిన పోలీసులే చూసిచూడనట్లు వ్యవహరించారననే విమర్శలున్నాయి. గాంబ్లింగ్‌, రంగుల రాట్నాల వంటి కార్యక్రమాలకు జాతర నిర్వాహకులు రూ.లక్షల్లో వసూలు చేసి అనుమతి ఇచ్చినట్టు సమాచారం. మండలం నడిబొడ్డున ఉన్న ఈ జాతరకు అశ్వారావుపేట, కుకునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, దమ్మపేట మండలాలతో పాటు ఏపీ సరిహద్దు ప్రాంతాల నుంచి  భారీగా భక్తులు వచ్చారు. భక్తికోసం వచ్చే భక్తుల జేబులు చిల్లు పెట్టేందుకు నిర్వాహకులు రకాల గాంబ్లింగ్‌ ఆటలు, జూదాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆశ్లీల నృత్యాలు అడ్డూఅదుపు లేకుండా సాగాయి. దీంతో జాతరకు వచ్చిన కొందరు భక్తులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. అమ్మవారికి శాంతి కలిగేందుకు ఏర్పాటు చేసే ఇలాంటి జాతరలో ఆదాయం రావడమే లక్ష్యంగా గాంబ్లింగ్‌ ఆటలు, అశ్లీల నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేయడంపట్ల పలు రకాల విమర్శలు వ్యక్తం అవుతున్నారు. 

దీనిపై సీఐ ఉపేందరరావు వివరణ కోరగా ‘జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అందులో అశ్లీల నృత్యాలు ఏమీ లేవు. గాంబ్లింగ్‌ ఆటలు జరుగలేదని, కేవలం కొన్ని రకాల స్కిల్‌ గేమ్స్‌ మాత్రమే జరిగాయని వివరించారు.

Advertisement
Advertisement