కట్టిస్తామన్నారుగా.. మీరే కట్టివ్వండి!

ABN , First Publish Date - 2021-01-18T08:29:55+05:30 IST

‘‘మీరు ఎలాంటి ఇబ్బందీ పడాల్సిన అవసరం లేదు. మీ ఇళ్లన్నీ పూర్తిగా ప్రభుత్వమే కట్టించి అప్పగిస్తుంది. స్థలంతో పాటు ప్రతి పేద కుటుంబానికీ ప్రభుత్వమే దగ్గరుండి ఇల్లు కట్టిస్తుంది’’.

కట్టిస్తామన్నారుగా.. మీరే కట్టివ్వండి!

సర్కారు రాయితీ ఎందుకూ సరిపోదు

నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది

స్టీలు, సిమెంటూ కొనే పరిస్థితి లేదు

ఇళ్ల నిర్మాణాల్లో అందరూ 

మూడో ఆప్షన్‌కే ఓటు

70శాతం మంది ఎంపిక

పేదల నుంచి ఊహించని స్పందన

అంత ఖర్చుపెట్టి ఎలా కట్టగలం?

ఇరకాటంలో గృహనిర్మాణ శాఖ


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘‘మీరు ఎలాంటి ఇబ్బందీ పడాల్సిన అవసరం లేదు. మీ ఇళ్లన్నీ పూర్తిగా ప్రభుత్వమే కట్టించి అప్పగిస్తుంది. స్థలంతో పాటు ప్రతి పేద కుటుంబానికీ ప్రభుత్వమే దగ్గరుండి ఇల్లు కట్టిస్తుంది’’..  ఇవీ ఇటీవల వరకు ప్రభుత్వం పదే పదే చేసిన ప్రకటనలు. ఇప్పుడు ఆ ప్రకటనలే ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నాయి. ‘‘ఏదో ప్రకటించాం గానీ.. ప్రభుత్వం కట్టిస్తుంది అంటే ఎవరు ముందుకొస్తారు. వాళ్లే కట్టుకుంటారులే.. మనం రాయితీ ఇస్తే చాలు’’ అన్న ప్రభుత్వ ఆలోచనలను.. ఇళ్లు లేని పేదలు తలకిందులు చేశారు.  కట్టిస్తాం అని చెప్పారుగా.. అదేదో కట్టించి పుణ్యం కట్టుకోండని మొత్తం భారం సర్కారుపై నెట్టేస్తున్నారు. ఇది ఊహించని ప్రభుత్వం, గృహనిర్మాణ శాఖలు ఇప్పుడు తలలు పట్టుకొన్నాయి. వైసీపీ ప్రభుత్వం మొత్తం 30లక్షల ఇళ్లు నిర్మించాలనే లక్ష్యం పెట్టుకోగా అందులో ఇప్పుడు 15.1లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టారు.


అందులో ఇప్పటివరకూ 90,600 మంది నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. ఇందులో 60వేల మంది మూడో ఆప్షన్‌ అంటే ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలనేది ఎంచుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిర్మాణ సామగ్రిని తీసుకుని కట్టుకుంటాం అని 9400 మంది, ప్రభుత్వం ఇచ్చే రాయితీ తీసుకుని బయట సామగ్రి కొనుక్కుని కట్టుకుంటామని 15700 మంది మాత్రమే ఆప్షన్లు పెట్టారు. లబ్ధిదారులకు ఎలాంటి సంబంధం లేకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది అనే ఆప్షన్‌కే 70శాతం మంది మొగ్గు చూపారు. దీంతో ఇళ్లు కట్టించాల్సిన బాధ్యత ఇప్పుడు గృహనిర్మాణ శాఖపై పడింది.


తెరపైకి కొత్త ఆప్షన్‌

పేదలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఇ ళ్లు కట్టించాలనేది వైసీపీ ప్రభుత్వం మొదటినుంచీ చెబుతున్న మాట. అందుకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన నాటినుంచీ రెండే ఆప్షన్లు పెట్టింది. ప్రభుత్వమే నిర్మాణ సామగ్రి సరఫరా చేస్తుందని, లబ్ధిదారులు కావాలంటే అవి తీసుకుని కట్టించుకోవచ్చని.. లేదంటే ప్రభుత్వమే కట్టించి ఇస్తుందని చెబుతూ వచ్చింది. కానీ కట్టించి ఇవ్వడం అంత సులభం కాదని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు.. కొద్దికాలం కిందట కొత్త ఆప్షన్‌ను తెరపైకి తెచ్చారు. గ త ప్రభుత్వంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీ ఇస్తే మిగతాది కలుపుకొని పేదలే ఇళ్లు కట్టుకునేవా రు. అధికారంలోకి వచ్చిన నాటినుంచీ ఆ ఆప్షన్‌ లే దంటూ ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని హైలెట్‌ చేస్తోంది. పేదలు కావాలంటే నిర్మాణ సామగ్రి బయట కొనుక్కోవచ్చని కొత్త పా ట పాడుతోంది. ఓవైపు ప్రభుత్వం తక్కువ ధరలకే సామగ్రి సరఫరా చేస్తుంటే పేదలు బయటికెళ్లి ఎక్కువ ధరకు ఎందుకు కొనుక్కుంటారనేది ఇక్కడ  ప్రశ్న. దానికి సమాధానం చెప్పని ప్రభుత్వం పేదలపై రెండో ఆప్షన్‌ ఎంచుకోవాలని ఒత్తిడి చేస్తోంది. ఇటీవల ఓ జిల్లాలో నేరుగా అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి.. కచ్చితంగా రెండో ఆప్షన్‌ పెట్టుకోవాలని, అప్పుడే ఇంటి స్థలం వస్తుందని లబ్ధిదారులను బెదిరించి కొంతమందితో రెండో ఆప్షన్‌ పెట్టించారు. ఇక హౌసింగ్‌ శాఖ అధికారులైతే ప్రభు త్వం ఇచ్చే నిర్మాణ సామగ్రి అంటే ఆలస్యం కావొచ్చని, అందువల్ల రెండో ఆప్షన్‌ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అయినా ఎక్కువ మంది మాత్రం భారాన్ని ప్రభుత్వం మీదకు నెట్టేశారు.


1.8లక్షలతో ఇంటి నిర్మాణం ఎలా?

ఒక్కో ఇంటికి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని మేనిఫెస్టోలో పెట్టిన వైసీపీ.. ఇప్పుడు మాటమార్చి రూ.1.80లక్షలు మాత్రమే ఇస్తామంటూ తేల్చేసింది. తెలుగుదేశం హయంలో ఎస్సీ, ఎస్టీలకు రూ.2.5లక్షలు, ఇతరుల కు రూ.2లక్షలు రాయితీ ఇవ్వగా దానికీ భారీగా కో త పెట్టింది. పైగా అది కూడా ఎక్కువగా ప్రభు త్వం ఇచ్చిన స్థలాల్లోనే ఇస్తుండటంతో ఆ చాలీచాలని స్థలాల్లో సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించుకోవ డం వృథా అని చాలా మంది భావిస్తున్నా రు. స్థ లం తీసుకుని కొన్నాళ్ల తర్వాత ఇల్లు కట్టుకుందాం అని భావించిన పేదలపై ఇప్పుడే కట్టాలనే నిబంధన పెట్టడంతో అయితే మీరే కట్టించి ఇవ్వండి అని ప్రభుత్వానికే ఝులక్‌ ఇస్తున్నారు.


స్టీలు క్వింటా రూ.70వేలు, సిమెంటు బస్తా రూ.400 కావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు కట్టడం చాలా భారంగా మారుతోంది. దీంతో కట్టిస్తే మీరే కట్టించండి అని పేదలు తెగేసి చెబుతున్నారు.  ‘‘ఏదో మాట వరుసకు ప్రభుత్వమే కట్టిస్తుంది అంటే.. ఇంత మంది భారమంతా మాపైనే పెడతారని ఊహించలేదు. ఇప్పుడున్న ధరలను చూ స్తే ఆకాశాన్నంటుతున్నాయి. అంత ఖర్చుపెట్టి ప్ర భుత్వం కట్టించాలంటే సాధ్యంకాదు’’ అని అధికారులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2021-01-18T08:29:55+05:30 IST