రేపు టీఆర్ఎస్‌లో చేరనున్న Kaushik Reddy

ABN , First Publish Date - 2021-07-20T13:55:45+05:30 IST

కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి బుధవారం నాడు కారెక్కనున్నారు.

రేపు టీఆర్ఎస్‌లో చేరనున్న Kaushik Reddy

హైదరాబాద్ : కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి బుధవారం నాడు (జూలై-21) కారెక్కనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సమక్షంలో కౌశిక్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నేతలు, ద్వితియశ్రేణి నేతలు, ముఖ్య కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. కాగా.. కౌశిక్ రెడ్డి ఆడియో టేపు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం విదితమే. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను వివరణ కోరడం.. ఆ తర్వాత కౌశిక్ పార్టీకి గుడ్ బై చెప్పేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి.


అయితే.. కౌశిక్ టీఆర్‌ఎస్‌లో చేరితే ఉపఎన్నికలో ఆయనకు హుజురాబాద్ టికెట్ ఇస్తారా..? ఇవ్వరా..? అనే విషయం తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ టికెట్ ఎవరికో ఇప్పటికే తేలిపోయిందని.. అయితే కౌశిక్‌కు మాత్రం ఇవ్వట్లేదని గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ క్రమంలో వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్‌టీపీ నుంచి పోటీ చేయడానికి కౌశిక్ ప్రయత్నాలు చేశారని కూడా పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని ఇవాళ్టితో తేలిపోయింది.


అభ్యర్థి ఈయనేనా..!?

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు అభ్యర్థే లేడని, ఈటలను ఢీకొనే సత్తా కలిగిన అభ్యర్థి ఎవరని వెదుకుతూ అధికార పార్టీ ఇతర పార్టీలవైపు చూస్తున్నదని ప్రచారం జరుగుతున్న తరుణంలో కొత్తపేరు తెరపైకి వచ్చింది. గతంలో కరీంనగర్‌ ఎస్పీగా పనిచేసిన, ప్రస్తుతం రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఇంకా సర్వీస్‌ ఉండగానే తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా సోమవారం సాయంత్రం ఆయన రాజీనామా చేశారు. ఆయనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని, అందుకే కేసీఆర్‌ మాస్టర్‌ స్కెచ్‌లో భాగంగా ఆయన ముందస్తు రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2021-07-20T13:55:45+05:30 IST