కవి గారి ఇల్లు

ABN , First Publish Date - 2021-09-13T06:00:06+05:30 IST

కన్నీటి నదిలో పూల పడవలు పయనిస్తుంటాయి ఉచ్ఛ్వాశ నిశ్వాసల క్రీడ జఠరాగ్ని హోమం నిర్వహిస్తుంటుంది...

కవి గారి ఇల్లు

కన్నీటి నదిలో

పూల పడవలు పయనిస్తుంటాయి

ఉచ్ఛ్వాశ నిశ్వాసల క్రీడ

జఠరాగ్ని హోమం నిర్వహిస్తుంటుంది

కిటికీ తెరవటం ఆలస్యం

ఊహల గువ్వల బిలబిలా కువకువ.

ఒక ఆలోచనల రైలు పరిగెడుతుంది

టేబుల్‌ జీవితంపైన కట్టాల్సిన కరెంటు బిల్లు.

ఓ నాలుగు టర్మ్‌ ఫీజుల స్కూలు నోటీసులు

కొత్త రేఖా చిత్రం గీస్తూ ఆగిన కాలమూ

చివరి శ్వాశల్లో అయిదారు కలాలు

వంటింట్లో వినిపించే కర్ణాట సంగీత కచ్చేరి

బతుకు పాటకు పల్లవిగా అమరిన గానలహరి

రవివర్మ గీసిన చిత్రాలు కాకపోవచ్చు కానీ

గది గోడల నిండా ఫ్రేములు కట్టిన తైలవర్ణ గౌరవాలు

పత్రికల పుటల్లోకి జారుకున్న చెదలా

పుస్తకంగా మారలేకపోయిన కవితా కపోతాలు

పాపం సిగ్గుబిళ్ళ కట్టుకోవటం మరచిన పాపాయిలా

సొట్టపడ్డ గిన్నెకి కవిగారి యాష్‌ ట్రే బిరుదు 

నాన్నగారి వీలునామాలో దక్కిన అద్దాలు 

బద్దలైన బీరువాలో

తిష్ట వేసుకు కూర్చున్న

కవిత్రయం కాళిదాసు పాణిని పరవస్తు

బీరువా తలపైన కిరీటంలా అమరిన

ఉగాది కవి సమ్మేళనంలో 

మంత్రిగారు శాలువా కప్పుతున్న ఫోటో

ఓడ పైన నడిసంద్రంలో ఒంటరి కాకిలాగా

ఇవతలి గోడ మీద కాలం చేసిన గడియారం ఒకటి

అది కవిగారి ఇల్లు అని తెలిసిన మిత్రుల వాదన 

నాకు మాత్రం అది ప్రాణంలేని కొండపల్లి బొమ్మల కొలువు.

ఈతకోట సుబ్బారావు

94405 29785


Updated Date - 2021-09-13T06:00:06+05:30 IST