కవిలేనివూరు

ABN , First Publish Date - 2021-10-18T08:35:16+05:30 IST

ఇవాళ కవిలేని ఒక వూరుకు వెళ్ళాను. కవి అంటే పంటచేను కదా కవి అంటే పిల్ల కాలవ కదా కవి అంటే పచ్చని చెట్టు కదా కవి అంటే వెచ్చని పలకరింపు కదా...

కవిలేనివూరు

ఇవాళ

కవిలేని ఒక వూరుకు వెళ్ళాను.

కవి అంటే పంటచేను కదా 

కవి అంటే పిల్ల కాలవ కదా

కవి అంటే పచ్చని చెట్టు కదా

కవి అంటే వెచ్చని పలకరింపు కదా

ఇవాళ కవిలేని ఒక కవివూరుకు వెళ్ళాను

అందరూ వున్నారు గుంపు గుంపులుగా 

అన్నీ వున్నాయి కుప్ప తెప్పలుగా

కానీ కోతకొచ్చిన పంటచేను లాంటి

కవి మాత్రం లేడు.


అతను తిరుగాడిన వీధుల్లోనే 

నేను తిరిగాను

చిత్తడి నేలలో కాలు వేసి కాలు తీసేలోపు

పాదముద్రల్లో నీరు ఊరినట్టు

అంతటా అతని కవితా వాక్యాలే

ఊపిరాడని ఉక్కపోతలో 

చొక్కా విప్పితే ఛాతీని తాకిన

చల్లని శీతగాలిలా

శరీరమంతా అతని కావ్య పరిమళం

అగరు ధూపంలా ఆవహించింది.

ఇవాళ కవిలేని ఒక కవి వూరుకు వెళ్లాను


ఒక కవి కవితను

మనసులో చదువుకుంటామా

ఆ కవే వచ్చి మన ఎదురుగా నిలబడి

కవిత చదివి వినిపిస్తున్నట్టు

అతను ఎక్కడినుండో లీలగా వినబడుతుంటాడు.


కవి ఏమిస్తాడు ఈ లోకానికి

ప్రాణవాయువులాంటి ఒక అమృత వాక్యం తప్ప

మనకు తెలియదు గానీ

మాటలు మనకు తెలియకుండానే 

మనుషుల్ని బ్రతికిస్తాయి.


విత్తనాల్ని మట్టి బతికించుకున్నట్టు

ఇవాళ కవిలేని

ఒక కవివూరుకు వెళ్లాను.

కవిలేని కవిగారి ఇంటికి వెళ్లాను.


వెళ్లగానే ఇంట్లోవాళ్లు

కాళ్లకు నీళ్లిచ్చారు. 

వాటిని కాళ్లమీద దిమ్మరబోసుకున్నానో లేదో

అవి గోరువెచ్చని స్పర్శనిచ్చాయి.

బహుశా అవి 

ఆ కవి కార్చిన కన్నీళ్లు అయివుంటాయి.


ఇక రేపటినుండి 

లోకం పరిశుభ్రమవుతుందనుకుంటాను.


ఇవాళ కవిలేని

ఒక వూరుకు వెళ్లాను

ఆ వూరు తణుకు

ఆ కవి తిలకు.

(నేతల ప్రతాప్‌ కుమార్‌ స్మృతికి)

శిఖామణి


Updated Date - 2021-10-18T08:35:16+05:30 IST