కొవిడ్‌ గేమ్‌!

ABN , First Publish Date - 2021-04-19T05:30:00+05:30 IST

కొవిడ్‌ - 19తో ప్రపంచం అల్లకల్లోలంగా మారింది. ఈ మహమ్మారితో ప్రపంచ దేశాలు నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాయి. అదే తరహా ఎత్తుగడలు, ప్రణాళికలతో పిల్లల కోసం ఓ గేమ్‌ డిజైన్‌ చేశారు ట్రిపుల్‌ ఐటి ప్రొఫెసర్‌ కవిత వేమూరి...

కొవిడ్‌ గేమ్‌!

కొవిడ్‌ - 19తో ప్రపంచం అల్లకల్లోలంగా మారింది. ఈ మహమ్మారితో ప్రపంచ దేశాలు నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాయి. అదే తరహా ఎత్తుగడలు, ప్రణాళికలతో పిల్లల కోసం ఓ గేమ్‌ డిజైన్‌ చేశారు ట్రిపుల్‌ ఐటి ప్రొఫెసర్‌ కవిత వేమూరి. వసుధైక కుటుంబం అర్థాన్ని, పరమార్థాన్ని తలపించే ఆ గేమ్‌ రూపకల్పన గురించి, ఆటలతో సాధ్యమయ్యే సామాజిక మార్పుల గురించి ఆమె నవ్యతో సంభాషించారు.


‘‘కొవిడ్‌ మీద విజయం కోసం ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా పాటుపడుతున్నాయి. అవసరమైన వనరులను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. కొవిడ్‌ను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. అయితే పిల్లలకు ఈ విషయాలు, కొవిడ్‌  వైరస్‌ గురించిన అవగాహన అంతంత మాత్రమే! కాబట్టి ఈ రెండు అంశాల పట్ల ఆసక్తి రేకెత్తించేలా, అదే సమయంలో సమస్యలకు సరికొత్త పరిష్కారాలు, ఆవిష్కరణలకు ఆస్కారం ఉండేలా రెండు గేమ్స్‌ డిజైనింగ్‌ కోసం అగస్త్య ఫౌండేషన్‌ నన్ను సంప్రతించింది. అయితే మన జీవితాలతోనే గేమ్‌ ఆడేస్తున్న కొవిడ్‌ గురించి నేను గేమ్‌ డిజైన్‌ చేయడమేంటి? అని ప్రారంభంలో అనుకున్నాను. కానీ ఆలోచిస్తే ఈ వైరస్‌ పట్ల, ప్రపంచదేశాలు చేస్తున్న పోరాటం పట్ల పిల్లలకు అవగాహన ఏర్పరిచి, ఆ పోరాటంలో పిల్లలను భాగస్వాములను చేయడం అవసరం అనిపించింది. అలా రూపొందిన కొవిడ్‌ ట్రేడింగ్‌ గేమ్‌ ఇది. వ్యాపార ధోరణితో సాగే ఈ గేమ్‌ను ఐదు పిల్లల బృందాలు వేర్వేరు ప్రదేశాల నుంచి జూమ్‌ ద్వారా ఆడే వీలుంటుంది. దేశాల పేర్లు మార్చి, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వాస్తవిక కొవిడ్‌ డాటా, వనరుల ఆధారంగా గేమ్‌ సాగుతుంది. ముగ్గురు లేదా నలుగురితో కూడిన ఐదు పిల్లల బృందాలు, ఆన్‌లైన్‌లో ఈ ఆటలో పాల్గొని, తమ దగ్గర ఉన్న టెస్ట్‌ కిట్స్‌, డాక్టర్స్‌, మందులు, ఐసియు బెడ్స్‌, వెంటిలేటర్లు మొదలైన వనరుల ఆధారంగా కొవిడ్‌ కట్టడి కోసం ప్రణాళికాబద్ధంగా పోరాటం సాగించాలి. దీన్లో భాగంగా దేశాలు పరస్పరం సహాయం చేసుకోవలసి ఉంటుంది. వ్యాపార లావాదేవీలు కొనసాగించవలసి ఉంటుంది. ఇలా 12 నెలల కొవిడ్‌ పాండమిక్‌కు తగ్గట్టు డిజైన్‌ చేసిన 12 సెషన్ల ద్వారా, ఏ దేశం ఎక్కువ వ్యాపార లావాదేవీలు జరిపితే అంతిమంగా ఆ బృందం విజేతగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ దేశం ఎంత ఎక్కువ డబ్బు సంపాదించిందనేది ప్రధానం కాదు. ఎంత సమర్థంగా కొవిడ్‌ను కట్టడి చేయగలిగింది? ఎంత చురుగ్గా పరాయి దేశాలకు చేయూతను ఇవ్వగలిగింది అనేది ప్రధానం. ఇలాంటి ఆట ద్వారా వేర్వేరు దేశాలకు ప్రాతినిధ్యం వహించే క్రమంలో, పిల్లలు వసుధైక కుటుంబంగా మారి, కలిసికట్టుగా కొవిడ్‌ మీద పోరాటం సాగించడంలో ఉండే ప్రయోజనాలను తెలుసుకోగలుగుతారు. ఈ గేమ్‌ డిజైన్‌ ఉద్దేశం ఇదే! ఈ మొత్తం ప్రక్రియలో నాతో పాటు అగస్త్య ఫౌండేషన్‌, గోలివ్‌ గేమింగ్‌ సొల్యూషన్స్‌ కలిసి పని చేశాయి.


భవిష్యత్తులో మరిన్ని గేమ్స్‌!

మనలో కొన్ని దృఢమైన అభిప్రాయాలు, స్థిరమైన నమ్మకాలు పాతుకుపోయి ఉంటాయి. పెరిగిన వాతావరణం, పరిసరాలు, సినిమాలు... ఇలా ఎన్నో అంశాలు మన వ్యక్తిత్వం, ధృక్కోణం, ఆలోచనా విధానాలకు రూపం పోస్తాయి. ఫలితంగా... ప్రవర్తించే తీరు, పరిస్థితుల పట్ల స్పందన కూడా సమాజంలో ఇంచుమించు ఒకేలా ఉంటుంది. సినిమాల్లో హీరోను ‘నాకు ఎదురే లేదు’ అన్న చందంగా చూపించడం పరిపాటిగా మారినప్పుడు, పిల్లలు అదే తరహా స్వభావం అలవరుచుకోవడం సహజం. అలాగే భిన్న వృత్తుల్లో ఉన్న ఇద్దరు మహిళల పట్ల బలాత్కారం జరిగినప్పుడు సమాజం స్పందించే తీరులోనూ తేడాలు ఉంటూ ఉంటాయి. రేప్‌కు గురైన ఆ ఇద్దర్లో ఒకరు ఉపాధ్యాయురాలు, మరొకరు బార్‌ డ్యాన్సర్‌ అయితే.... వారిలో ఉపాధ్యాయురాలి పట్ల సమాజం ఎక్కువ తీవ్రతతో స్పందిస్తుంది. ఇలాంటి ఆలోచనా ధోరణి, ధృక్కోణాలు మనందర్లో నాటుకుపోయి ఉంటూ ఉంటాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే అలాంటి ఆలోచనా విధానం నాటుకునే బాల్యం మీద దృష్టి పెట్టాలి. ఆసక్తికరమైన ఆటల ద్వారా వారి మెదళ్లలో రొటీన్‌కు భిన్నంగా ఆలోచించే నైజాన్ని నాటాలి. ఇందుకోసమే రేప్‌ బాధితుల కోణంలో ఆలోచించి, వారి పట్ల మన వ్యవహారశైలిలో మార్పు తీసుకురాగలిగే గేమ్స్‌ తయారీలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్నాను. 


ఆటలతో మార్పు సాధ్యమే!

ఒక దృశ్యం లేదా సంఘటనను చూసే సమయంలో మెదడులో కొన్ని ప్రదేశాలు ఉత్తేజితమవుతాయి, ప్రేరణకు గురవుతాయి. భావోద్వేగాలకు రూపం పోస్తాయి. ఈ వివరాలను విశ్లేషించడం ద్వారా మెదళ్లలో నాటుకుపోతున్న నెగటివ్‌ ఆలోచనలు, అభిప్రాయాల ప్రభావాలను అంచనా వేయడం, ఆ ఆధారాలతో ప్రజలను చైతన్యవంతులను చేయడం, తద్వారా మెరుగైన సమాజం దిశగా వారిని నడిపించడం నా ధ్యేయం. ఈ క్రమంలో భాగంగా మెదడును పాజిటివ్‌ ఆలోచనలతో ప్రేరేపించగలిగే గేమ్‌ల డిజైనింగ్‌ మొదలుపెట్టాను. అయితే పుట్టుకతో సంక్రమించిన మనస్తత్వం ఆటలతో మారుతుంది అని రూఢిగా చెప్పలేం.  కాని ఇప్పటి తరాల పిల్లలకు ఆటల ద్వారా కాలక్షేపాన్ని అందించడంతో పాటు, తర్కంతో ఆలోచించే ధోరణి అలవరచగలిగితే మున్ముందు తరాలు మరింత విశ్లేషణాత్మకమైన ఆలోచనా ధృక్పథంతో నడుచుకుంటాయనేది నా నమ్మకం. నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం. అలాంటప్పుడు నాటుకుపోయిన, జీర్ణించుకుపోయిన, ఓ పరిధి మేరకే పరిమితమైపోయిన స్థిరాభిప్రాయాలు, నమ్మకాలను ఆటల ద్వారా వదిలించవలసిన బాధ్యత తీసుకోక తప్పదు. చిన్న అడుగు సుదూర ప్రయాణానికి నాంది. ఇది అలాంటి తొలి అడుగే!’’

- గోగుమళ్ల కవిత







మా పూర్వీకులు వృత్తిపరంగా ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరుకు వలస వెళ్లారు. నేను బెంగళూరులోనే పుట్టి పెరిగాను. కాలేజీ చదువు హైదరాబాద్‌లో సాగింది. తర్వాత అమెరికా వెళ్లి ఎలక్ట్రికల్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదివి, అక్కడే ఓ కంపెనీలో పని చేసి 2004 చివర్లో తిరిగి ఇండియాకు వచ్చేశాను. ఇక్కడ కాగ్నిటివ్‌ న్యూరో సైన్సె్‌సలో పిహెచ్‌డి చేసి, మొదట డెహ్రాడూన్‌, తర్వాత చెన్నై, అంతిమంగా హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాను. 2008లో ఇక్కడి ట్రిపుల్‌ ఐటిలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టాను. వృత్తిలో భాగంగా విద్యార్థులకు కాగ్నిటివ్‌ న్యూరోసైన్స్‌, గేమ్‌ డిజైనింగ్‌, ఇంజనీరింగ్‌ నేర్పుతాను. పనులు చేసే క్రమంలో మెదడులో జరిగే మార్పులు, ఫలితంగా నాటుకుపోయే అభిప్రాయాలు, మెదడు స్పందనలు... ఈ విభాగాల మీద నా పని ఆధారపడి ఉంటుంది. వీటిలో మెరుగైన మార్పులు చోటుచేసుకునేలా చేయడానికి తోడ్పడే గేమ్స్‌ డిజైన్‌ చేయడమే నా వృత్తి.


Updated Date - 2021-04-19T05:30:00+05:30 IST