Abn logo
Jan 3 2021 @ 00:19AM

కేసీఆర్‌ ఎత్తులు! జగన్‌ జిత్తులు!!

హైదరాబాద్‌కు వచ్చిన నాయకులు తనను కలవాల్సిందే గానీ, తాను వెళ్లి కలుసుకోవడం కేసీఆర్‌కు అలవాటు లేదు. కేంద్ర మంత్రులకు సైతం ఆయన ఫోన్లో అందుబాటులోకి వచ్చేవారు కాదు. అలాంటిది రెండు రోజుల క్రితం తన భార్యకు చికిత్స చేయించడానికి వచ్చిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను ఆయన బస చేసిన హోటల్‌కు వెళ్లి మరీ కేసీఆర్‌ కలవడం సంచలనాత్మక వార్తే అయింది. కేసీఆర్‌ ఏమిటి? బీజేపీకి చెందిన ఒక ముఖ్యమంత్రిని ఆయన బస చేసిన హోటల్‌కు వెళ్లి కలవడమేమిటి? అని రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. నిజానికి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కలవడం వల్ల కేసీఆర్‌కు కంటికి కనిపించే ప్రయోజనం ఏమీ లేదు. రెండు రాష్ర్టాల మధ్య వివాదాలు కూడా ఏమీ లేవు. అయినా వెళ్లి కలిశారంటే.. ఎందుకు? అన్నది ఊహించుకోవచ్చు. తాను బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నానన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికే కేసీఆర్‌ అలా చేసి ఉంటారు.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులకు ఫీజు కింద చెక్కుల ద్వారా ఇచ్చే మొత్తం కాకుండా, సొంతంగా నగదు చెల్లిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి సరికొత్త రికార్డ్‌ సృష్టిస్తున్నారు. రాజధానికి సంబంధించిన కేసులలో రైతుల తరఫున వాదించకుండా ఉండటానికై ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ న్యాయవాదికి రోజుకు కోటి వంతున, విచారణ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులకు చెల్లిస్తామని జగన్‌ తరఫు దూతలు ఆశ చూపడం నిజం కాదా? రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లోకి వందల కోట్లు జమ చేస్తున్నట్టు ఇచ్చిన ప్రకటన కూడా బోగస్‌ అని తెలిశాక జగన్‌ అండ్‌ కోను ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. నగదు బదిలీ చేయకుండా, బదిలీ చేస్తున్నట్లు కంప్యూటర్‌ మీటను నొక్కడం జగన్‌రెడ్డికే చెల్లుతుంది.


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా ఆయన ఎత్తుగడలు ఉంటాయి. రాష్ట్రంలో తన ప్రతిష్ఠ మసకబారుతోందని దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల తర్వాత గ్రహించిన కేసీఆర్‌.. తాజాగా తన రూట్‌ మార్చుకున్నట్లు అనిపిస్తోంది. కాంగ్రెస్‌ను బలహీనపరచడం వల్ల భారతీయ జనతాపార్టీ నుంచి ముప్పు ఏర్పడుతున్నందున ఆ పార్టీ విషయంలో ఆయన తన వైఖరి మార్చుకున్నారు. సొంత పార్టీలోని అసంతృప్తవాదులతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంతమంది బీజేపీ వైపు చూస్తుండటంతో కేసీఆర్‌ సరికొత్త రాజకీయ ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. కేంద్రంతో ఇక యుద్ధమే అని ప్రకటించిన 24 గంటల్లోనే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలు మోదీ, షాలను కలిసివచ్చిన తర్వాత ఆయన తన రూట్‌ మార్చుకున్నారు.


మోదీ, షా ద్వయానికి ఏమి చెప్పి వచ్చారో స్పష్టంగా తెలియకపోయినా, అప్పటివరకు తాను వ్యతిరేకించిన రైతు చట్టాలకు జై కొట్టడంతో పాటు ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకంలో తెలంగాణ కూడా చేరుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కేంద్రానికి చెప్పించారు. బీజేపీ పెద్దలకు భయపడి కేసీఆర్‌ యూటర్న్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు చేస్తున్నవారు ఉన్నప్పటికీ, ఆయన ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనుక మరో పరమార్థం కూడా దాగిఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీని ప్రత్యర్థిగా పరిగణించి యుద్ధం చేస్తే నష్టం తప్పేలా లేదని గ్రహించడం వల్లనే కేసీఆర్‌ రూట్‌ మార్చినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో ఉద్యోగులు, నిరుద్యోగులలో తన ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతను అధిగమించడానికై ఉద్యోగులకు వేతనాల పెంపు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి చర్యలకు కూడా శ్రీకారం చుట్టారు. వివిధ వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడంతో గతంలో తీసుకున్న నిర్ణయాలను కూడా ఉపసంహరించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎల్‌ఆర్‌ఎస్‌ వంటి పథకాలను ఉపసంహరించుకున్నారు.


కేసీఆర్‌ వైఖరిలో వచ్చిన ఈ మార్పు చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. అయితే రాజకీయంగా లాభం వస్తుందనుకుంటే కేసీఆర్‌ ఎన్ని యూటర్న్‌లైనా తీసుకుంటారని ఆయన గతం చెబుతోంది. ఢిల్లీ పర్యటన తర్వాత తమ అధినేతలో చాలా మార్పు వచ్చిందని టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఈ మార్పు ఎందుకో ఇప్పుడు చూద్దాం. భారతీయ జనతాపార్టీపై ఇప్పటివరకు ఒంటికాలిపై ఎగిరిపడుతూ వచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు ఆ పార్టీతో కలిసి పని చేయడానికి సైతం సిద్ధపడుతున్నారా? ఈ మేరకు బీజేపీ కేంద్ర పెద్దలకు ఆయన హామీ ఇచ్చి వచ్చారా? వంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపి నష్టపోవడానికి కేసీఆర్‌ సిద్ధపడడం ఏమిటి? అన్న సందేహం కూడా సహజంగానే కలుగుతోంది. అయితే ఈ ప్రశ్నలు, సందేహాలు ప్రజల్లో కలగాలని కేసీఆర్‌ బలంగా కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. బీజేపీకి దగ్గరైతే కేసీఆర్‌కు నష్టం కదా అని భావించాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఇటువంటి అనుమానం ఏర్పడడం కేసీఆర్‌కు చాలా అవసరం. గడిచిన కొన్ని రోజులుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో ఇప్పటికే ఈ దిశగా అనుమానం ఏర్పడింది. బీజేపీతో చేతులు కలపడానికి ఢిల్లీ పెద్దలకు కేసీఆర్‌ హామీ ఇచ్చారట కదా? అని ఇప్పటికే రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ఇలాంటి వాతావరణాన్ని సృష్టించగలిగితే కేసీఆర్‌కు రాజకీయంగా లాభమే తప్ప నష్టముండదు.


దుబ్బాక, గ్రేటర్‌ ఫలితాల తర్వాత మంచి ఊపు మీదున్న బీజేపీ నేతలను కూడా కేసీఆర్‌ అయోమయానికి గురిచేయగలిగారు. ఢిల్లీలో ఏం జరిగింది? మనతో దోస్తానా చేయబోతున్నట్లుగా కేసీఆర్‌ ప్రవర్తిస్తున్నారు. ఏంటి కథ? అని బీజేపీ నాయకులు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. దీంతో కేసీఆర్‌ ఢిల్లీలో ఏం చెప్పి వచ్చినా ఆయన మాటలను మోదీ, షా నమ్మరని బీజేపీ నాయకులు సంజాయిషీ ఇచ్చుకోవాల్సివస్తోంది. కేసీఆర్‌ సరిగ్గా ఇదే కోరుకుంటున్నారు. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందేమోనన్న అనుమానం బీజేపీ శ్రేణులలో ఏర్పడడాన్ని కేసీఆర్‌ కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. రెండేళ్ల క్రితం బీజేపీ నాయకులలో ఇటువంటి అభిప్రాయమే ఉండేది. అప్పట్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ వంటి వారు సైతం పార్టీ ఢిల్లీ పెద్దలను కలిసి టీఆర్‌ఎస్‌తో పార్టీ వైఖరి ఎలా ఉండబోతున్నదని అడిగి తెలుసుకునేవారు. రాష్ట్రంలో తాము కేసీఆర్‌పై ఎంత యుద్ధం చేసినా తమ పెద్దలు చివరకు ఆయనతో పొత్తు పెట్టుకుంటే ఎలా? అన్న సందేహం వారిని పీడించేది. ఈ నేపథ్యంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తమకు మూడంటే మూడు సీట్లు కేటాయిస్తే చాలని అమిత్‌ షా విజ్ఞప్తి చేసినప్పటికీ కేసీఆర్‌ ఖాతరు చేయలేదు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన బీజేపీ అధిష్ఠానం కేసీఆర్‌ విషయంలో దూకుడుగా వెళ్లాలని దిశా నిర్దేశం చేసింది. సీన్‌ కట్‌ చేస్తే టీఆర్‌ఎస్‌, బీజేపీ సంబంధాల విషయంలో రెండేళ్ల క్రితం ఎటువంటి అనుమానం ఉందో ఇప్పుడు మళ్లీ అటువంటి అనుమానం ఏర్పడింది.


ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన తర్వాత కేసీఆర్‌ అనుసరిస్తున్న వైఖరే ఇందుకు కారణం. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోకుండా కట్టడి చేయడానికే ఆయన ఈ స్కెచ్‌ వేసుకుంటున్నట్లు భావించవచ్చు. గతంలో బీజేపీలో నెలకొన్న అనుమానాలన్నీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సృష్టించడమే కేసీఆర్‌ లక్ష్యంగా చెబుతున్నారు. తన పార్టీ నుంచి బీజేపీలోకి వలసలను అరికట్టడానికై ఆయన ఈ సరికొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నట్టుగా ఉంది. మంత్రి కేటీఆర్‌ కూడా నూతన సంవత్సరం తొలి రోజున తనను కలిసిన పార్టీ నాయకులతో సంభాషిస్తూ ‘‘పార్టీ నాయకులు తొందరపడవద్దు. రాజకీయాల్లో ఓపిక అవసరం. భవిష్యత్‌లో అందరికీ మంచి అవకాశాలు వస్తాయి’’ అని సూచించడం గమనార్హం. హైదరాబాద్‌కు వచ్చిన నాయకులు తనను కలవాల్సిందే గానీ, తాను వెళ్లి కలుసుకోవడం కేసీఆర్‌కు అలవాటు లేదు. కేంద్ర మంత్రులకు సైతం ఆయన ఫోన్లో అందుబాటులోకి వచ్చేవారు కాదు. అలాంటిది రెండు రోజుల క్రితం తన భార్యకు చికిత్స చేయించడానికి వచ్చిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను ఆయన బస చేసిన హోటల్‌కు వెళ్లి మరీ కేసీఆర్‌ కలవడం సంచలనాత్మక వార్తే అయింది. కేసీఆర్‌ ఏమిటి? బీజేపీకి చెందిన ఒక ముఖ్యమంత్రిని ఆయన బస చేసిన హోటల్‌కు వెళ్లి కలవడమేమిటి? అని రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.


నిజానికి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కలవడం వల్ల కేసీఆర్‌కు కంటికి కనిపించే ప్రయోజనం ఏమీ లేదు. రెండు రాష్ర్టాల మధ్య వివాదాలు కూడా ఏమీ లేవు. అయినా వెళ్లి కలిశారంటే.. ఎందుకు? అన్నది ఊహించుకోవచ్చు. తాను బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నానన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికే కేసీఆర్‌ అలా చేసి ఉంటారు. అంతేకాదు, ‘‘బీజేపీని టార్గెట్‌గా చేసుకోవద్దు. భవిష్యత్‌లో ఆ పార్టీతో కలిసి పోటీ చేయాల్సి రావొచ్చు’’ అని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నుంచి ఆ పార్టీ ముఖ్యులకు సందేశాలు కూడా వెళ్లాయి. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నిలదొక్కుకోవడానికీ టీఆర్‌ఎస్‌ పరోక్ష సహకారం అందించబోతున్నదన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కె.జానారెడ్డి బీజేపీలో చేరి నాగార్జునసాగర్‌ నుంచి పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగిన విషయం విదితమే. దీంతో కాంగ్రెస్‌ పార్టీ తరఫునే నాగార్జునసాగర్‌ నుంచి పోటీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయనకు మేలు చేకూరుస్తామని టీఆర్‌ఎస్‌ పెద్దల నుంచి రాయబారం నడిచినట్లుగా కూడా చెబుతున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమైంది. కేసీఆర్‌ సృష్టిస్తున్న అయోమయానికి స్వస్తి చెప్పని పక్షంలో తమ పార్టీ ఎదుగుదలకు బ్రేకు పడుతుందని, వలసలు కూడా ఆగిపోతాయని ఆందోళన చెందిన ఆ పార్టీ నాయకులు దూకుడు పెంచారు. టీఆర్‌ఎస్‌కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తాజాగా ప్రకటన చేయడం గమనార్హం. ఈ రెండు పార్టీల మధ్య ఆట ఇలా సాగుతుండగా, తమ పార్టీ నుంచి వలసలు పెరగకుండా అడ్డుకోవడానికై కాంగ్రెస్‌ నాయకులు సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టారు.


వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని ఓడించడానికి టీఆర్‌ఎస్‌కు సొంత బలం సరిపోదని, తమ పార్టీతో పొత్తు కోరుకుంటుందని, అకారణంగా ఇప్పుడు తొందరపడి బీజేపీ వైపు చూడొద్దని కాంగ్రెస్‌ పెద్దలు తమ నాయకులకు సూచిస్తున్నారు. ఈ రాజకీయ క్రీడ ఏ మలుపు తిరుగుతుంది? ఏ పార్టీల మధ్య పొత్తులు పొడుస్తాయన్నది తేలాలంటే కొంత కాలం వేచి చూడాలి.


జగన్‌ మాటలకు అర్థాలు వేరయా!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వద్దాం. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి మాయామశ్చీంద్రను తలపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు కేటాయిస్తే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని తెలుగుదేశం వాళ్లు హైకోర్టులో పిటిషన్‌ వేయడం, దానిపై హైకోర్టు స్టే ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందంటూ ఇటు తెలుగుదేశం పార్టీని, అటు న్యాయవ్యవస్థను బోనులో నిలబెట్టడానికి ముఖ్యమంత్రి ప్రయత్నించారు. జగన్‌ రెడ్డి ప్రస్తావించిన డెమోగ్రాఫికల్‌ ఇంబాలెన్స్‌ అన్న పదానికి కులాల మధ్య సమతుల్యత దెబ్బతినడం అన్న సూటి అర్థం ఏ డిక్షనరీలో కూడా కనిపించదు. నిజానికి రైతులు వేసిన పిటిషన్లలో డెమోగ్రాఫికల్‌ ఇంబాలెన్స్‌ అన్న ప్రస్తావనే లేదు. ముఖ్యమంత్రి సొంత నిర్వచనం ఇచ్చుకుని, అదే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం మొదలెట్టారు. సీఆర్డీఏ మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా జోన్లను మార్చి మళ్లీ ఇళ్లస్థలాలుగా కేటాయించాలనుకున్నందున హైకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టులో జగన్‌ నమ్ముతున్న న్యాయమూర్తులు ఎవరైనా ఉండి ఉంటే వారు కూడా ఇలాంటి కేసులో ఇందుకు భిన్నంగా తీర్పు ఇవ్వలేరు.


పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వనివ్వకుండా కోర్టుల నుంచి స్టేలు తెస్తున్నారని జగన్‌ అండ్‌ కో పదే పదే ఆరోపిస్తుంటారు. ఇందులో కూడా వాస్తవం లేదు. పేదలకు కేటాయించే ఇళ్ల స్థలాలను ఐదేళ్ల తర్వాత అమ్ముకోవడానికి వీలుగా కన్వేయన్స్‌ డీడ్‌లు ఇవ్వాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. అమలులో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు ఇది విరుద్ధం. ఈ కారణంగా సదరు నిర్ణయం చెల్లబోదని హైకోర్టు స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు కూడా ఇందుకు భిన్నంగా చెప్పలేదు. కేంద్రప్రభుత్వం ఆమోదం పొందదని తెలిసి కూడా దిశా చట్టం చేయడం, కేంద్రం దాన్ని తిరుగు టపాలో పంపడం చూశాం. అమలులో లేని దిశా చట్టం గురించి జగన్‌ మద్దతుదారులు ప్రచారం మాత్రం చేసుకుంటున్నారు. న్యాయసమీక్షకు నిలబడని నిర్ణయాలు తీసుకోవడం, కోర్టులలో ఎదురుదెబ్బ తగిలితే న్యాయమూర్తులను దోషులుగా చిత్రించడం జగన్‌ అండ్‌ కోకు ఫ్యాషన్‌గా మారింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరి అండదండలతో న్యాయవ్యవస్థతో చెలగాటమాడటానికి జగన్‌ రెడ్డి సాహసించగలుగుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు తాత్కాలిక విజయం లభించవచ్చు గానీ అంతిమంగా న్యాయం, ధర్మమే గెలుస్తాయి.


రెండురోజుల క్రితం పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి చివరిగా వెలువరించిన తీర్పులో ముఖ్యమంత్రిని కడిగిపారేయడంతో పాటు సుప్రీంకోర్టుకు కూడా, రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా పరోక్షంగా సూచించారు. ఈ తీర్పును ఒక వర్గం స్వాగతిస్తుండగా, మరో వర్గం తీవ్రంగా తప్పుబట్టింది. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ స్వార్థంతో సదరు తీర్పు ఇవ్వలేదని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకు ఎటువంటి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు లేవు. జరుగుతున్న పరిణామాలకు మనసున్న మనిషిగా హృదయంతో స్పందించే ఆయన కొన్ని సందర్భాల్లో పరిధి దాటినట్లు అనిపించినా, తన మనస్సాక్షి ప్రకారం తీర్పులు ఇచ్చారు. పదవీ విరమణ చేసిన రోజు సాయంత్రం హైకోర్టులో వీడ్కోలు తీసుకున్న జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ అర్ధగంటలోనే రాష్ట్రం విడిచి బిహార్‌ వెళ్లిపోయారు. దీన్ని బట్టి ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలవారో తెలుసుకోవచ్చు. తెలుగునాట ఎంతో మంది న్యాయమూర్తులు పదవీ విరమణ చేశారు. కానీ ఏ న్యాయమూర్తికీ లభించని రీతిలో జస్టిస్‌ రాకేశ్‌కు వీడ్కోలు సత్కారం లభించింది. సహచర న్యాయమూర్తులు సైతం హైకోర్టు బయటకు వచ్చి మరీ ఆయనకు వీడ్కోలు పలికారు. ఒక న్యాయమూర్తికి ఇంతకంటే గౌరవం ఏం కావాలి? జగన్‌రెడ్డి వంటి వాళ్లు నిందలు వేసినంత మాత్రాన జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌కు మరక అంటదు. అరాచకాలకు మారుపేరుగా మనం చెప్పుకొనే బిహార్‌కు చెందిన జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అంతకంటే ఘోరంగా ఉన్నాయని భావించి ఉండవచ్చు. న్యాయవ్యవస్థను మేనేజ్‌ చేయడంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు దిట్ట అని జగన్‌ అండ్‌ కో తరచుగా విమర్శిస్తుంటారు. ఆయన సంగతేమో గానీ అదేపని చేయడానికి జగన్‌ రెడ్డి గతంలోనూ, ఇప్పుడూ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థను మేనేజ్‌ చేయడానికి లేదా లొంగదీసుకోవడానికి జగన్‌ రెడ్డి ఏమేమి చేస్తున్నారో, ఎవరెవరు అందుకు సహకరిస్తున్నారో త్వరలోనే చెప్పుకుందాం.


రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులకు ఫీజు కింద చెక్కుల ద్వారా ఇచ్చే మొత్తం కాకుండా, సొంతంగా నగదు చెల్లిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి సరికొత్త రికార్డ్‌ సృష్టిస్తున్నారు. రాజధానికి సంబంధించిన కేసులలో రైతుల తరఫున వాదించకుండా ఉండటానికై ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ న్యాయవాదికి రోజుకు కోటి వంతున, విచారణ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులకు చెల్లిస్తామని జగన్‌ తరఫు దూతలు ఆశ చూపడం నిజం కాదా? దీన్ని ఏ తరహా మేనేజ్‌మెంట్‌ అంటారో జగన్‌ అండ్‌ కోనే చెప్పాలి. ఆయన చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. రాజకీయాల్లో అవి సహజమనుకుందాం. ముఖ్యమంత్రిగా కూడా ప్రజలను మాయ చేయాలనుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లోకి వందల కోట్లు జమ చేస్తున్నట్టు ఇచ్చిన ప్రకటన కూడా బోగస్‌ అని తెలిశాక జగన్‌ అండ్‌ కోను ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. నగదు బదిలీ చేయకుండా, బదిలీ చేస్తున్నట్లు కంప్యూటర్‌ మీటను నొక్కడం జగన్‌రెడ్డికే చెల్లుతుంది. ఈ చర్యను కూడా జగన్‌ మద్దతుదారులు సమర్థించుకుంటారేమో చూడాలి. మొత్తమ్మీద జగన్‌ చేసే ప్రకటనలు, చెప్పే మాటలకు ప్రత్యేక అర్థాలు ఉంటాయని మనమే తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుందాం!


సినీ రాజకీయం!

ఇది ఇలా ఉంచితే చిత్ర పరిశ్రమలో సూపర్‌ స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం, నిష్క్రమణ జరిగిన తీరు హాస్యాస్పదంగా ఉంది. రజనీ తన చర్యల ద్వారా సినీ రంగానికి చెందిన ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకున్నా, వారిపై ప్రజలకు విశ్వాసం కలగకుండా చేశారు. రాజకీయాల్లో నెట్టుకురావడం ఆషామాషీ కాదు. తమిళనాడులో ఎంజీ రామచంద్రన్‌, తెలుగునాట ఎన్టీ రామారావు మాత్రమే రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రులయ్యారు. ఆ తర్వాత ఎంతో మంది రాజకీయ ప్రవేశంపై ప్రకటనలు చేసి తోకముడిచారు. తెలుగునాట దాసరి నారాయణరావు సొంత పార్టీని ప్రారంభించి వెంటనే మూసేశారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి స్వయంకృతాపరాధంతో విఫలమయ్యారు. చివరికి ఆయన పార్టీని నడపలేక కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇప్పుడు సినిమాల్లో నటించడమే మేలు అనుకుంటున్నారు. ఆయన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన స్వయంగా రెండు చోట్ల ఓడిపోయారు. అయినా జనసేనపార్టీని కొనసాగిస్తున్నారు. దీన్నిబట్టి రాజకీయరంగం వేరు.. సినిమా రంగం వేరు అని సినీనటులు తెలుసుకుంటే మంచిది. రాజకీయాలు పూలపాన్పు కాదు. 70 ఏళ్ల వయసులో పార్టీ పెట్టాలనుకోవడమే అవివేకమైతే, పార్టీని ప్రారంభించకముందే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించిన రజనీకాంత్‌ మరింత నవ్వులపాలయ్యారు!


ఆర్కే


యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code scan చేయండి

Advertisement
Advertisement
Advertisement