Abn logo
Nov 28 2020 @ 01:15AM

బల్దియా బలిమి, కలిమి జనమే

ప్రజల క్షేమం, సంక్షేమం కోరేవారి మాటలు, బీజేపీ, ఎంఐఎం నాయకుల మాటల్లోని వ్యత్యాసాన్ని ప్రజలు పరిశీలిస్తున్నారు. పేదల కోసం, సమసమాజం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర ఈ నేలకు ఉంది. అంతటి మహోన్నతమైన త్యాగాల వెనుక, ప్రజలంతా క్షేమంగా, స్వేచ్ఛగా, సమానంగా జీవించాలని, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే ఆశయం ఉంది. ఓట్ల కోసం వారి త్యాగాలను కించపరచకూడదని ప్రజలు కోరుకుంటున్నారు.


ఉమ్మడి రాష్ట్రంలో సాగిన పాలనలో మోసపోయిన తెలంగాణ కోసం, గోసపడుతున్న తెలంగాణ బిడ్డల కోసం, ఆలోచనాపరుడైన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మేధస్సులోంచి పుట్టిన పార్టీ ‘తెలంగాణ రాష్ట్రసమితి’. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా, తెలంగాణవాదాన్ని గళంలో నింపుకుని, గులాబి జెండాను గుండెల మీద ఎత్తుకుని ప్రజలను మేల్కొల్పింది. తెలంగాణ కోసం జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను దేశానికి చాటి చెప్పింది తెలంగాణ ప్రజా చైతన్యం. 


ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఆలోచనే తప్పని, రాష్ట్రం సాధించటం అసాధ్యమని ప్రజలను నమ్మిస్తున్న తరుణంలో, రాజకీయ క్రీడలో తెలంగాణ నష్టపోతుందని, మోసపోతుందని గ్రహించిన కేసీఆర్‌, అహింసా మార్గంలో నిరాహార దీక్షకు పూనుకుని, అగాథంలోకి తోసేసాం అనుకున్న తెలంగాణ అంశాన్ని ఆకాశానికి లేపిన సందర్భం మన కళ్ళముందు నిలిచి ఉంది. భిన్న అభిప్రాయాలు భిన్న ఆలోచనలు, భిన్న ఆశయాలు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న సంఘాలు, ఒకే మాటై, ఒకే బాటై తెలంగాణ రాష్ట్ర సాధనలో నడవడం కళ్ళముందు కదులుతోంది. తెలంగాణ కోసం మన బిడ్డలు, వాళ్ళని వాళ్ళు ఆహుతి చేసుకుని, ఉధృతంగా సాగిన పోరాటానికి ఇంధనమయ్యారు తప్ప, అంతటి ఉద్వేగభరితమైన సమయంలో కూడా తెలంగాణయేతరులకు కష్టం కలిగించలేదు, నష్టం కలిగించలేదు, ఆ నష్టం, కష్టం ఏదో తెలంగాణానే భరించింది. గుండెల్లో విషాదాన్ని నింపుకుని, తెలంగాణ ఉద్యమాన్ని సంబరంలా నడిపింది. గమ్యాన్ని ముద్దాడటమే తన లక్ష్యంగా భావించిన కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను, కవులను, కళాకారులను, రాజకీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ‘జై తెలంగాణ’ అనిపించి, ఢిల్లీ కదిలేలా చేసి, సహనం, శాంతి, రాజకీయ వ్యూహాలతో తెలంగాణ రాష్ట్రం సాధించటం, మనం బతికుండగానే మనం చూసిన మనం చేసిన పోరాటం ఫలించటం, మనం మరవలేని ఒక అద్భుతం. 


ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అంటే కేసీఆర్‌, కేసీఆర్‌ అంటే తెలంగాణ అని, ఉద్యమ నాయకుడే మన కథానాయకుడు అని ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి, కేసీఆర్‌కు రక్షాబంధనం కట్టారు. గుడిని, మసీదును, చర్చిని, బుద్ధుడిని కలుపుకుని తెలంగాణను అభివృద్ధిపథంలో ముందడుగు వేయిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి అండగా ఉండాలని హైదరాబాదీలంతా భావించారు. అందువల్లే, గతంలో ఒక్క కార్పొరేటర్‌ సీటు కూడా లేని టీఆర్‌ఎస్‌ పార్టీకి 2016 జరిగిన బల్దియా ఎన్నికల్లో 99 సీట్లిచ్చి ఆశీర్వదించారు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తిరుగులేని పట్టం కట్టారు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనైనా, అన్ని పార్టీలు తమతమ ఆశయాలను, హామీలను హుందాగా చెప్పుకుని ప్రజల తీర్పును కోరాయి, పోటీలుపడి ప్రచారం చేసుకున్నాయి తప్ప, ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేయలేదు. ప్రజల తీర్పును శిరసావహించాయి తప్ప, వారి మధ్య చిచ్చు పెట్టలేదు. ఈ బల్దియా ఎన్నికల్లో రెండు రాజకీయ పార్టీలకు చెందిన కొద్దిమంది నాయకులు వాళ్ళ సంకుచిత స్వభావాన్ని బయటపెట్టుకుంటూ స్వలాభంతో, స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం, బీజేపీ నాయకులు ఓట్ల కోసం పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేస్తూ, అమాయకులను రెచ్చగొడుతూ మతసామరస్యానికి, ప్రజాస్వామ్యానికి సవాలు విసురుతున్నారు. దశాబ్దాలుగా భాగ్యలక్ష్మి అమ్మవారు, మక్కామసీదు ఉన్న దారుల్లోనే పీర్లు ఎగిరి దుంకినయి, బతుకమ్మలు బ్రహ్మాండంగా ఆడినయి. త్యాగాలకు గుర్తుగా మొహరం ఊరేగింపులు, సింహవాహిని మహంకాళీ బోనాల వేడుకలు ఘనంగా జరిగినాయి. దర్గాల్లో హిందువులు తాయత్తులు కట్టించుకుంటారు. గణేష్‌ నిమజ్జనం రోజు ముస్లిం సోదరులు షర్బతు పంచుతారు. బౌద్ధులు, జైనులు, సిక్కులు, గుజరాతీలు, మరాఠీలు, బెంగాలీలు, సింధీలు, మార్వాడీలు, తమిళులు, కన్నడిగులు, మళయాళీలు, సబ్బండ కులాలు, ఆంధ్ర, తెలంగాణ తేడాలు లేకుండా వాళ్ళ వాళ్ళ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకుంటూ, స్నేహపూర్వక వాతావరణంలో జీవిస్తున్నారు. ప్రజల క్షేమం, సంక్షేమం కోరేవారి మాటలను, ఆ రెండు పార్టీల నాయకులు మాట్లాడే మాటల్లోని వ్యత్యాసాన్ని ఈ ప్రజలు పరిశీలిస్తున్నారు. పేదల కోసం, సమసమాజం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర ఈ నేలకు ఉంది. అంతటి మహోన్నతమైన త్యాగాల వెనుక, ప్రజలంతా క్షేమంగా, స్వేచ్ఛగా, అందరూ సమానంగా జీవించాలని, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే ఆశయం ఉంది. ఓట్ల కోసం వారి త్యాగాలను కించపరచకూడదని ప్రజలు ఆ పార్టీల నేతలను కోరుకుంటున్నారు. గుడికి బడికి దూరమైన కులాలు ఇంకా హిందువుల్లో మిగిలే ఉన్నాయి. అభివృద్ధికి, సమానమైన విద్యకు నోచుకోని వారు ముస్లింలలో ఎందరో ఉన్నారు. రెండు పార్టీల నేతలు మనుషుల్ని మతాలుగా చీల్చి, మానవ మనుగడకు ముప్పు కలిగిస్తున్నారని ప్రజలు తెలుసుకుంటున్నారు. ముస్లింలంతా ఎంఐఎం పార్టీలో లేరని, హిందువులంతా బీజేపీతో లేరని నిరూపించాలనుకుంటున్నారు. మెరుగైన ప్రజా జీవనం కోసం, విలువైన రాజకీయాలు చేయండని చెప్పాలనుకుంటున్నారు. ప్రజాసంక్షేమం కోసం పేదలంతా ఒక్కటిగా ఉండాలనుకుంటున్నారు. కులం కంటే గుణం గొప్పదని, మతం కంటే మానవత్వం గొప్పదని వారికి గుర్తు చేయాలనుకుంటున్నారు. అనేక త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ, ఆ రెండు పార్టీల నేతలు గిరిగీసుకుని కొట్టుకోవడానికి కాదని, అభివృద్ధి వైపు నడిపించుకోవాలని, ఆ ఫలాలను సమానంగా పంచుకోవాలని కోరుకుంటున్నారు. అభివృద్ధిని కోరుకునేవాళ్ళు, ప్రజాస్వామ్యవాదులు, శాంతికాముకులు, కవులు కళాకారులు, మేధావులు, ఆటంక వాదులకు అర్థమయ్యేలా తమ ఓటుతో సమాధానం చెప్పాలనుకుంటున్నారు. బల్దియాలో బలం మనుషులదని, మనుషులంతా ఒక్కటై దిక్కులు పిక్కటిల్లేలా నినదించాలనుకుంటున్నారు. 


యన్‌. శంకర్‌

అధ్యక్షులు, తెలుగు సినిమా దర్శకుల సంఘం


Advertisement
Advertisement
Advertisement