కేంద్రానికి అప్రతిష్ట తేవాలని కేసీఆర్‌ కుట్ర

ABN , First Publish Date - 2021-11-29T06:44:17+05:30 IST

కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయాలనే కుట్రతోనే ధాన్యం కొనుగోలు చేయడం లేదని సీఎం కేసీఆర్‌ ప్రచారం చేస్తున్నారని, ఆయన కు తగిన గుణపాఠం తప్పదని బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

కేంద్రానికి అప్రతిష్ట తేవాలని కేసీఆర్‌ కుట్ర
చౌటుప్పల్‌ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌


చౌటుప్పల్‌ టౌన్‌, నవంబరు 28: కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయాలనే కుట్రతోనే ధాన్యం కొనుగోలు చేయడం లేదని సీఎం కేసీఆర్‌ ప్రచారం చేస్తున్నారని, ఆయన కు తగిన గుణపాఠం తప్పదని బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కేసీఆర్‌ ఆహంకారానికి, రాచరికపోకడలకు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ప్రజలు చెంపఛెల్లుమనిపించారన్నారు. ఈ కోపాన్ని కేసీఆర్‌ రైతుల మీద చూపిస్తున్నారని ఆరోపించారు. 2014 కంటే ముందు ధాన్యం కొనుగోలుకు కేంద్రం రూ.3,404 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందని, దాన్ని 2020-21కి కేంద్ర ప్రభుత్వం రూ.26,600కోట్లకు పెంచిందన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రతీ పైసా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. ఉప్పుడు బియ్యం దిగుమతి చేసుకునే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వరి సాగు పెరిగిందని, దీంతో ఉప్పు డు బియ్యాన్ని తగ్గించి మామూలు బియ్యాన్ని ఇవ్వాలని కేంద్రం సూచించిందన్నారు. కేంద్రం సూచనను పట్టించుకోకుండా, తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం కేసీఆర్‌ రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ప్రభుత్వం నిషేధించిన ధర్నా చౌక్‌లోనే కేసీఆర్‌ ధర్నా చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ధాన్యం కొనుగోలుపై దృష్టి పెట్టాలని సూచించారు. రైతులు నెల రోజులుగా ధాన్యాన్ని కల్లాల్లో ఆరబోసి ఎదురుచూస్తున్నారని, వర్షాలకు తడిసి మొలకలు వస్తుంటే బాధతో గుండె ఆగి చనిపోతున్నారని ఆన్నరు. మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25వేల మిల్లులు ఉండగా అందులో 1200 మాత్రమే పని చేస్తున్నాయని, అవి కూడా తక్కువ సామర్థ్యంతో ఉన్నవేనన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా అవి అప్‌గ్రేడ్‌ కాలేదని, దీనిపై దృష్టి సారించాలని నాలుగేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంతో పాటు ఎఫ్‌సీఐ సూచించినా సీఎం కేసీఆర్‌ పెడచెవిన పెట్టారన్నారు. రైతుల బాధలను తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటించే ప్రతిపక్షాల నాయకులపై రాళ్లు, కర్రలతో కేసీఆర్‌ దాడులు, దౌర్జన్యాలు చేయించడం దారుణమన్నారు. పోలీసులతో ఎంతకాలం అధికారాన్ని చెలాయిస్తారని, ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు. అనంతరం లింగోజీగూడలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యామ్‌సుందర్‌, నాయకులు దూడల భిక్షంగౌడ్‌, రమనగోని శంకర్‌, జి.సురేందర్‌రెడ్డి, బండమీది మల్లేశం, పి.శ్రీధర్‌బాబు, బి.సత్యం, కాయితీ రమేష్‌, వెంకటేశం, రిక్కల సుధాకర్‌రెడ్డి, ఆర్‌.దీపిక, బత్తుల జంగయ్య, చినుకని మల్లేశం, భిక్షమాచారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T06:44:17+05:30 IST