NRIల ద్వారా తెలంగాణకు కోట్ల ఆదాయం ఉన్నా.. వారంటే ప్రభుత్వానికి చిన్న చూపేనా!?

ABN , First Publish Date - 2021-08-16T17:34:30+05:30 IST

రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐ పాలసీ.. హామీగానే మిగిలిపోయింది. 2014 ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ రూపొందించిన మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చడమే కాకుండా, పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ సైతం దీని

NRIల ద్వారా తెలంగాణకు కోట్ల ఆదాయం ఉన్నా.. వారంటే ప్రభుత్వానికి చిన్న చూపేనా!?

ఏడేళ్లైనా అమలు కాని కేసీఆర్‌ హామీ

‘గల్ఫ్‌’ బాధిత కుటుంబాల ఎదురుచూపులు

జగిత్యాల, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐ పాలసీ.. హామీగానే మిగిలిపోయింది. 2014 ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ రూపొందించిన మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చడమే కాకుండా, పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ సైతం దీని గురించి ప్రస్తావించారు. కానీ, ఏడేళ్లు గడుస్తున్నా ఆ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ప్రత్యేక పాలసీ వస్తే తమ బతుకులు బాగుపడుతాయని ఆశించిన గల్ఫ్‌ బాధిత కుటుంబాలు ఎదురుచూపులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. సౌదీ, యూఏఈ, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, బహ్రెయిన్‌ తదితర దేశాల్లో ఉద్యోగ, ఉపాధి నిమిత్తం సుమారు 8లక్షల తెలంగాణ వాసులు ఉంటున్నారు. వీరిలో జగిత్యాల, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన వారే అత్యధికం.  సరైన సమయంలో జీతాలు అందకపోవడం, పలు కేసుల్లో ఇరుక్కొని జైళ్లలో మగ్గుతుండడం, వివిధ కారణాల వల్ల విదేశాల్లో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలు స్వగ్రామాలకు రాకపోవడం, ఏజెంట్ల మోసాలకు గురై ఇక్కట్లు పాలవడం వంటి సమస్యలను గల్ఫ్‌ కార్మికులు ఎదుర్కొంటున్నారు.



కరోనా కారణంగా అక్కడ ఉంటున్న వారి పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. దీంతో ఎన్‌ఆర్‌ఐలపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్‌ఆర్‌ఐల ద్వారా తెలంగాణకు ఏటా సుమారు రూ.1,200 కోట్ల ఆదాయం వస్తుందన్న అంచానాలు ఉన్నాయి. అయినప్పటికీ గల్ఫ్‌ కార్మికుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌ఆర్‌ఐ పాలసీ ఫండ్‌ ద్వారా గల్ఫ్‌లో ఇబ్బందులు పడి తిరిగి వచ్చిన వారికి పునరావాసం కల్పించే వీలు ఉంటుంది. ప్రవాస కార్మికుల కుటుంబాలకు పావలా వడ్డీకి రుణాలు, గృహ నిర్మాణ రుణాలు, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు అందుతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమల్లోకి తీసుకొని రావాలని గల్ఫ్‌ బాధిత కార్మికుల కుటుంబాలు కోరుతున్నాయి.


Updated Date - 2021-08-16T17:34:30+05:30 IST