మోదీకి కేసీఆర్‌ పరోక్ష సహకారం

ABN , First Publish Date - 2022-09-12T08:13:14+05:30 IST

హైదరాబాద్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): జాతీయ రాజకీయాల పేరుతో సీఎం కేసీఆర్‌ ఏ ప్రయత్నం చేసినా అది యూపీఏ విచ్ఛిన్నం కోసమే

మోదీకి కేసీఆర్‌ పరోక్ష సహకారం

యూపీఏ విచ్ఛిన్నానికి ప్రయత్నాలు

అధికారం కోసం టీఆర్‌ఎస్‌, బీజేపీ పరస్పర మద్దతు.. రేవంత్‌ ఆరోపణలు

 

హైదరాబాద్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): జాతీయ రాజకీయాల పేరుతో సీఎం కేసీఆర్‌ ఏ ప్రయత్నం చేసినా అది యూపీఏ విచ్ఛిన్నం కోసమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీతో సుపారీ ఒప్పందం చేసుకున్న కేసీఆర్‌.. ఆయనకు పరోక్ష సహకారాన్ని అందిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం తన నివాసంలో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్డీయేని గద్దె దింపాలని కేసీఆర్‌ నిజంగా అనుకుంటే ఆ కూటమి భాగస్వాములను ముందుగా బయటికి తీసుకురావాలి కదా అని ప్రశ్నించారు. జగన్‌, చంద్రబాబు, ఏక్‌నాథ్‌ షిండేలను కలవని కేసీఆర్‌.. కాంగ్రె్‌సతో ఉన్న నితీశ్‌ కుమార్‌, శిబూ సోరెన్‌, స్టాలిన్‌, ఉద్ధవ్‌ ఠాక్రేలను కలవడంలో మతలబేంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ పెట్టే జాతీయ పార్టీలో కుమార స్వామి తన పార్టీని విలీనం చేస్తారా..? అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం అయ్యేందుకు, మోదీ తిరిగి ప్రధాని కావడానికి టీఆర్‌ఎస్‌, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు. కాగా, మునుగోడు టికెట్‌ ఆశించిన కాంగ్రెస్‌ నేతలు చెలిమల కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్‌ నేతలతో రేవంత్‌ ఆదివారం తన నివాసంలో భేటీ అయ్యారు. స్రవంతి గెలుపు కోసం కృషి చేయాలన్నారు.

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించండి..

‘‘రాష్ట్రంలోని వీఆర్‌ఏల బతుకుకు భరోసా ఇవ్వలేని మీరు దేశాన్ని ఉద్ధరిస్తారా..?’’ అంటూ సీఎం కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చి, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో వారి పక్షాన కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు.

సెప్టెంబరు 17పై ఏం చేద్దాం..? 

సెప్టెంబరు 17న టీఆర్‌ఎస్‌, బీజేపీలు పోటా పోటీ కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో అసలు భారత యూనియన్‌లో హైదరాబాద్‌ రాష్ట్రాన్ని విలీనం చేసిన పార్టీగా ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిద్దామన్న దానిపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు టీపీసీసీ ముఖ్యనేతలు గాంధీభవన్‌లో సోమవారం సమావేశం కానున్నారు. కాగా, భారత్‌ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించాక.. బీజేపీని వ్యతిరేకించే ప్రగతిశీల శక్తులు, అభ్యుదయ, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, యువత తదితర వర్గాలు యాత్రలో పాల్గొనాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, మాజీ ఎంపీ వీహెచ్‌ విజ్ఞప్తి చేశారు. భారత్‌ జోడో యాత్రలో భట్టి పాల్గొని వచ్చిన నేపథ్యంలో ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయనతో మధుయాష్కీ, వీహెచ్‌ భేటీ అయ్యారు.  

భట్టిని కలిసిన పాల్వాయి స్రవంతి..

భట్టి విక్రమార్క, మధుయాష్కీ, వీహెచ్‌లను మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎల్పీ కార్యాలయంలో వారితో భేటీ అయిన ఆమె.. తన విజయానికి సహకరించాలని కోరారు. కాగా, సింగరేణి కాంట్రాక్టు కార్మికులు భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్‌లను కలిశారు. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. 

Updated Date - 2022-09-12T08:13:14+05:30 IST