జగన్ ఆశలపై నీళ్లు చల్లిన కేసీఆర్

ABN , First Publish Date - 2021-08-25T21:20:21+05:30 IST

సీఎం జగన్ ఆశలపై సీఎం కేసీఆర్ నీళ్లు చల్లారు. తెలంగాణ కేడర్‌లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను డిప్యుటేషన్‌‌పై

జగన్ ఆశలపై నీళ్లు చల్లిన కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రయత్నాలు దాదాపు ఫలించిన వేళ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఆశలపై నీళ్లు చల్లారు. నిజానికి రవీంద్రను ఏపీకి తీసుకెళ్లేందుకు కేంద్రం నుంచి అనుమతి అవసరం. దీంతో వైసీపీ పెద్దలు కేంద్రంతో మంతనాలు జరిపి ఒప్పించారు.  అమిత్ షాతోనూ మాట్లాడారు. జగన్ మొర ఆలకించిన కేంద్రం స్టీఫెన్ రవీంద్రను ఏపీకి పంపేందుకు ఓకే కూడా చెప్పింది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రవీంద్రకు నిఘా విభాగం బాధ్యతలు అప్పగించాలని జగన్ భావించారు. 


గతంలో దివంగత మఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి భద్రతా వ్యవహరాలను స్టీఫెన్‌ పర్యవేక్షించారు. రాయలసీమ జిల్లాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఇంటెలిజెన్స్ బాధ్యతలు కట్టబెట్టాలనుకున్నారు. మరోవైపు, రవీంద్రను ఏపీకి పంపేందుకు కేసీఆర్ కూడా అంగీకరించారు. 


ఈ వ్యవహారం అంతా జరుగుతున్న సమయంలో జగన్, కేసీఆర్ మధ్య సత్సంబంధాలున్నాయి. దీంతో స్టీఫెన్‌ను డిప్యుటేషన్‌పై పంపించాలని కోరడంతో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. డిప్యుటేషన్‌కు తెలంగాణ సర్కారు ఆమోదం తెలిపిన తర్వాత స్టీఫెన్‌ రవీంద్ర సెలవుపై వెళ్లారు. ఆయన ఏపీ ఇంటెలిజెన్స్‌, పోలీసువర్గాలతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. డీవోపీటీ ఆమోదం లభించిన వెంటనే ఆయన ఇక్కడ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారని అందరూ అనుకున్నారు.


అయితే, అంతలోనే ఏమైందో ఏమోగాని ఆ తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రవీంద్రను తెలంగాణలోనే ఐజీ హోదాలో పనిచేశారు. ఆయనకు ఎలాంటి కీలకమైన బాధ్యతలు అప్పగించలేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి ప్రకటన వస్తే ఏపీకి పంపాలనే నిర్ణయానికి కట్టుబడి.. ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగించలేదనే ప్రచారం కూడా జరిగింది. 


స్టీఫెన్ రవీంద్రకు కీలక బాధ్యతలు ఎందుకంటే!

ఇటీవల తెలంగాణ, ఏపీ మధ్య నీళ్లు చిచ్చు రేగింది. ఈ క్రమంతో ఏపీ నిర్ణయాలను కేసీఆర్ కూడా విమర్శించారు. ఒక విధంగా చెప్పాలంటే నీళ్ల పంచాయతీ ఇద్దరు సీఎంల మధ్య ఎడబాటును పెంచిందనే వాదన కూడా ఉంది. ఈక్రమంలోనే తెలంగాణలో పనిచేస్తున్న దళిత ఐపీఎస్, ఐఏఎస్  అధికారులు ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ స్వచ్ఛంద పదవీవిమరణ చేశారు కూడా. వీరితో పాటుగా ప్రతిపక్షాలు కూడా సీఎం దళిత అధికారులకు కీలకమైన బాధ్యతలు అప్పగించడం లేదనే విమర్శలు కూడా చేశారు. అటు ప్రతిపక్షాలకు, ఇటు అధికారుల విమర్శలకు కేసీఆర్ చెక్ పెట్టాలని అనుకున్నారు.


అందులోభాగంగా ఐఏఎస్‌ అధికారి రాహుల్ బొజ్జకు సీఎం సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం దళిత బంధును రాహుల్ బొజ్జ పర్యవేక్షిస్తున్నారు. రాహుల్‌ బొజ్జా మంచి వ్యక్తి అని, ఆయనను ఈ పథకం అమలు కోసం కమిషనర్‌గా పెట్టుకున్నామని కేసీఆర్ స్వయంగా ప్రకటన కూడా చేశారు. రాహుల్‌పై ఆయన తండ్రి బొజ్జా తారకంపై ప్రశంసలు కురిపించారు. రాహుల్‌తో పాటు మరికొందరి దళిత అధికారులకు కీలకమైన బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారంట. ముందుగా స్టీఫెన్ రవీంద్రకు తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్‌గా భాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ అనుకున్నారంట. అందుకు స్టీఫెన్ సమ్మతించలేదట. దీంతో తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అనిల్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. స్టీఫెన్ తన నిర్ణయాన్ని తెలపడంతో ఆయనకు సైబరాబాద్ సీపీగా బాధ్యలు అప్పగించారు. రవీంద్రపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్‌ ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి.

Updated Date - 2021-08-25T21:20:21+05:30 IST