కేసీఆర్‌ డిమాండ్‌ మేరకు సేకరణ పెంచాం

ABN , First Publish Date - 2021-12-02T07:13:40+05:30 IST

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి బియ్యం సేకరణ విషయంలో కేంద్రం పారదర్శకమైన, సార్వత్రకమైన విధానాన్ని అనుసరిస్తోందని, ....

కేసీఆర్‌ డిమాండ్‌ మేరకు  సేకరణ పెంచాం

దేశవ్యాప్తంగా ఏటా ఉప్పుడు బియ్యం సేకరణ పెరుగుతూనే ఉంది

 మా విధానాలు పారదర్శకం: కేంద్రం


న్యూఢిల్లీ, డిసెంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి బియ్యం సేకరణ విషయంలో కేంద్రం పారదర్శకమైన, సార్వత్రకమైన విధానాన్ని అనుసరిస్తోందని, ఎక్కడా ఏ అయోమయం లేదని కేంద్రం స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను ఎప్పుడూ పరిర క్షిస్తుందని, ఏటా ధాన్యం సేకరణ పెరుగుతూనే ఉందని తెలిపింది. తెలంగాణలో 2020-21లో రబీ సీజన్‌లో సేకరణ లక్ష్యం 55 లక్షల టన్నులుగా నిర్ణయించినప్పటికీ 61.87 లక్షల టన్నుల మేరకు సేకరించామని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 25 నాటికి రబీ, ఖరీఫ్‌ సీజన్‌లకు కలిపి తెలంగాణ నుంచి 94.53 లక్షల టన్నులను సేకరించామని, 2019-20లో సేకరించిన 74.54 లక్షల టన్నులకంటే ఎంతో ఎక్కువ సేకరణ ఇప్పటికే జరిగిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 2019-20లో 55.3 3లక్షల టన్నుల బియ్యం సేకరించగా.. 2020-21లో అది 56.67 లక్షల టన్నులకు పెరిగిందని వివరించింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ డిమాండ్‌తో 2020-21లో ఉప్పుడు బియ్యం సేకరణను కూడా 24.75 లక్షల టన్నుల నుంచి 44.75 లక్షల టన్నుల మేరకు పెంచామని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 4 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించామని పేర్కొంది. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కవితా మల్లోతు, పసునూరి దయాకర్‌, వేంకటేశ్‌ నేత బోర్లకుంట, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రంజిత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, గౌరవ్‌ గొగోయ్‌, తెలుగుదేశం సభ్యుడు కేశినేని నాని తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి ఈ వివరాలు తెలిపారు. 2021-22లో కేంద్ర పూల్‌ ద్వారా 521.89 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించామని.. రబీ సీజన్‌ ప్రారంభమైనప్పుడే రబీ (యాసంగి) పంటకు లక్ష్యం నిర్ణయిస్తామని ఆమె చెప్పారు.


ధాన్యం సేకరణ విధానం రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారుతుందని.. అదనపు మార్కెట్‌ నిల్వలే కాక, స్థానిక ఆహారపు అలవాట్లు, స్థానిక అభిరుచికి అనుగుణంగా పండించే వెరైటీలు, అంతర్జాతీయ మార్కెట్‌లో బియ్యం ఎగుమతిని బట్టి సేకరణ జరుగుతుందని ఆమె తెలిపారు. ఏటా బియ్యం సేకరణ దేశ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నదని, 2018-19లో 443.99 లక్షల టన్నుల సేకరణ జరగగా.. అది 2019-20లో 518. 26 లక్షల టన్నులకు, 2020-21లో 600.74 లక్షల టన్నులకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. ధాన్యం ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ సేకరణ కూడా పెరుగుతుందని అమె అన్నారు. పంటమార్పిడిని ప్రోత్సహించాలని అన్ని రాష్ట్రాలకూ సలహా ఇచ్చామని.. పప్పుధాన్యాలు, చమురు గింజలు, తృణధాన్యాలకు కనీస మద్దతు ధరను ఇతోధికంగా పెంచి రైతులకు ప్రోత్సాహకాలు కల్పించినట్టు వివరించారు. భారత ఆహార సంస్థ ఆస్తులను అమ్మే ఆలోచన లేదని, ఎఫ్‌సీఐ తన సొంత గోదాములు, ప్రైవేటు గోదాములతో కలిపి 414.70 లక్షల టన్నుల మేరకు నిల్వ చేయగలదని చెప్పారు. తమ ఆపరేషన్ల ద్వారా ఎఫ్‌సీఐ 2020-21లో 2,62,696 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపారు.




ధాన్యం కొనాలి.. రైతుల్ని ఆదుకోవాలి

పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీల డిమాండ్‌

పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసనలు కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేయాలని, వార్షిక కొనుగోలు లక్ష్యాన్ని ఒకేసారి ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. బుధవారం ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో ఎంపీలు ప్రభాకర్‌ రెడ్డి, కవిత, శ్రీనివా్‌సరెడ్డి, వెంకటేశ్‌ నేత, రంజిత్‌రెడ్డి, రాములు, బీబీ పాటిల్‌, పసునూరి దయాకర్‌లు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. సభా కార్యకలాపాలను అడ్డుకునే ప్రయ త్నం చేశారు. దీంతో ఉదయం సభ కొద్దిసేపు వా యిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వెల్‌లోకి వెళ్లి నిరసనలు కొనసాగించారు. అయినప్పటికీ స్పీకర్‌ సభ ను నడిపించారు. స్పీకర్‌ పోడియం ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంపీలు బైఠాయించారు. ఎంపీ కె.కేశవరావు విలేకరులతో మాట్లాడుతూ.. కేరళ, తమిళనాడు, ఒడిసా రాష్ట్రాల ఎంపీలతో కలిసి ధాన్యం కొనుగోలుపై పార్లమెంటులో సంయుక్తంగా నిరసనలు తెలుపుతామని చెప్పారు. గత ఏడాది మిగిలిన 5లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యా న్నీ కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశా రు. ప్రతి గింజా కొంటామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్ప డం సంతోషకరమన్నారు. నామా మాట్లాడుతూ.. రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఇతర పార్టీల ఎంపీలు తమతో పాటు నిరసనల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. పంట మొత్తం కొంటామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారని, అదే విషయాన్ని పార్లమెంటులో ప్రకటన చేయాలని డి మాండ్‌ చేశారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌.. పంట మొత్తం కొనబోమని చెబుతుండగా.. కిషన్‌రెడ్డి కొంటామని అంటున్నారని చెప్పారు.

Updated Date - 2021-12-02T07:13:40+05:30 IST